ఆ పిల్లల జీవితాల్లో.. వెలుగులు నింపుతోంది!

ఆస్తులన్నీ అమ్ముకున్నాం... పిల్లాణ్ని హాస్పిటల్స్‌ చుట్టూ తిప్పడం ఇక మావల్ల కాదు.. ఓ తల్లి ఆవేదన. చికిత్స ఇంకా పూర్తయినా కాలేదు.. అప్పులు తీర్చే దారి కనిపించక ఆత్మహత్య చేసుకున్నాడాయన.. ఓ భార్య గుండెకోత. నిద్రాహారాలు కరవైన తల్లులు.. చంకల్లో కీమోతో నీరసించిన పిల్లలు.. ఇవన్నీ చూసిన ఆ డాక్టరమ్మ మనసు తల్లడిల్లింది. పైసా ఖర్చులేకుండా అలాంటి వారికి అత్యుత్తమ చికిత్స అందించాలనుకున్నారు. అనుకోవడమే కాదు చేసి చూపిస్తున్నారు డాక్టర్‌ ప్రియా రామచంద్రన్‌.

Updated : 30 Aug 2022 08:39 IST

ఆస్తులన్నీ అమ్ముకున్నాం... పిల్లాణ్ని హాస్పిటల్స్‌ చుట్టూ తిప్పడం ఇక మావల్ల కాదు.. ఓ తల్లి ఆవేదన. చికిత్స ఇంకా పూర్తయినా కాలేదు.. అప్పులు తీర్చే దారి కనిపించక ఆత్మహత్య చేసుకున్నాడాయన.. ఓ భార్య గుండెకోత. నిద్రాహారాలు కరవైన తల్లులు.. చంకల్లో కీమోతో నీరసించిన పిల్లలు.. ఇవన్నీ చూసిన ఆ డాక్టరమ్మ మనసు తల్లడిల్లింది. పైసా ఖర్చులేకుండా అలాంటి వారికి అత్యుత్తమ చికిత్స అందించాలనుకున్నారు. అనుకోవడమే కాదు చేసి చూపిస్తున్నారు డాక్టర్‌ ప్రియా రామచంద్రన్‌.

ద్రాస్‌ మెడికల్‌ కాలేజీ నుంచి పీహెచ్‌డీలో బంగారు పతకం సాధించిన ప్రియ.. యూకే, యూఎస్‌లలో పీడియాట్రిక్‌ సర్జన్‌గా శిక్షణ పొందారు. స్వదేశానికి తిరిగొచ్చి చెన్నైలోనే పీడియాట్రిక్‌ యూరాలజిస్ట్‌గా సేవలందిస్తున్నారు. ఒకసారి హాస్పిటల్‌లో ఉండగా.. ఓ తల్లి చాలా వేదనతో తన బిడ్డను చూపించేందుకు వచ్చింది. ఏమైందంటే.. క్యాన్సర్‌ అనీ, కీమోథెరపీ నడుస్తోందనీ కన్నీరు మున్నీరైంది. అప్పటికి ధైర్యం చెప్పి పంపారామె. ఆరునెలల తర్వాత ఆమె మళ్లీ ప్రియకు తారసపడ్డప్పుడు.. ‘చికిత్స కోసం ఆస్తులన్నీ అమ్ముకున్నాం. తాకట్టు పెట్టేందుకూ ఏమీ మిగల్లేదు. ఇక చికిత్స మా వల్లకాదు’ అంటూ బోరుమందా తల్లి. ఎంత ఓదార్చినా ఆ అమ్మ కన్నీరు ఆగలేదు. తర్వాత ఎన్ని రోజులైనా ఆ సంఘటన పదే పదే గుర్తుకొచ్చేది ప్రియకు. ఇక తనే ఏదో ఒకటి చేయాలని 2002లో ‘రే ఆఫ్‌ లైట్‌ ఫౌండేషన్‌’ను స్థాపించారు.

తొలి విరాళం తనదే...

‘క్యాన్సర్‌ బాధిత పిల్లలూ, నిరాశతో దీనంగా ఉండే కుటుంబీకులూ నన్నెంతో బాధించారు. చేయూతనివ్వాలనుకుని విరాళాల కోసం ఎన్నో సంస్థల్ని సంప్రదించా. ఎవరూ ఆసక్తి చూపలేదు. అప్పుడో స్నేహితురాలి సలహాతో నేనే లక్ష రూపాయలు పెట్టి ఓ పెయింటింగ్‌ కొన్నా. ఆరు నెలల తర్వాత దాన్ని వేలం వేస్తే రూ.3.5లక్షలొచ్చింది. ఆ మొత్తంతో సేవలు మొదలుపెట్టా’ అని గుర్తు చేసుకుంటారు ప్రియ. తర్వాతా ఆ స్నేహితురాలితో కలిసి వివిధ నగరాల్లో పలువురు ప్రముఖ కళాకారుల చిత్రాలతో ఆర్ట్‌ ఎగ్జిబిషన్లు నిర్వహించేవారు. అక్కడ చిత్రాల్ని వేలం వేసేవారు. ఇలా ఏటా రూ. 20లక్షల దాకా వచ్చేవి. వాటికితోడు కొందరు స్నేహితులూ సాయం చేసేవారు. అలా పిల్లల చికిత్సకు సొమ్ము సమకూర్చుకునే వారు. 2004లో కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) పథకం తెచ్చాక.. చాలా సంస్థలు విరాళాలివ్వడం మొదలుపెట్టాయి. ఇప్పుడు ఏటా రూ.1.5 కోట్లకు పైగా వస్తున్నాయి.


ప్రధాని ప్రశంసలు..

టీవల చెన్నైకి వచ్చిన ప్రధాని మోదీ ఈ ఫౌండేషన్‌ ద్వారా క్యాన్సర్‌ నయమైన పిల్లలతో ముచ్చటించి, ప్రియను అభినందించారు. ఎన్ని పనుల్లో ఉన్నా ఆధ్యాత్మిక ప్రసంగాలూ చేస్తుంటారు ప్రియ. ఎన్నో ఆధ్యాత్మిక పుస్తకాలూ రాశారు. ‘ఇప్పుడిప్పుడే పిల్లల క్యాన్సర్లపై తల్లిదండ్రుల్లో అవగాహన వస్తోంది. పిల్లల ఆరోగ్యం, భవిష్యత్తు పట్ల అమ్మానాన్నలు మరింత శ్రద్ధ చూపాలి’ అంటారామె.


డాక్టర్‌ ప్రియ సేవలు ప్రారంభించే నాటికి దేశంలో పిల్లల క్యాన్సర్‌ చికిత్సల్లో విజయ శాతం 40 మాత్రమే. తొలిదశలో గుర్తించకపోవడం, డబ్బు లేక అత్యుత్తమ చికిత్స అందకపోవడమే కారణాలుగా గుర్తించిన ప్రియ.. ఈ రెంటినీ పరిష్కరించాలనుకున్నారు. పేదలకోసం క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ క్యాంపులు మొదలుపెట్టారు. కొందరు డబ్బుల్లేక ఇతర హాస్పిటల్స్‌ నుంచి ఈమె దగ్గరికి వచ్చేవారు. అలా వచ్చిన వారిలో కొందరికి తల్లిదండ్రుల్లో ఒకరే ఉండేవారు. ఆరా తీస్తే.. క్యాన్సర్‌ అని తెలియగానే తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారని, చికిత్సకు డబ్బు లేక, అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నారని సమాధానమిచ్చేవారు. ఇది విని నిర్ఘాంతపోయిన ప్రియ.. తాను పనిచేస్తున్న కంచి కామకోటి చైల్డ్స్‌ ట్రస్ట్‌ హాస్పిటల్‌లో క్యాన్సర్‌ విభాగాన్ని తెరిపించారు. ఫౌండేషన్‌ ఖర్చుతో అక్కడ బోన్‌మ్యారో మార్పిడి యూనిట్‌ని అందుబాటులోకి తెచ్చారు. దానికి తోడుగా బెడ్‌, ల్యాబ్‌, వైద్యుల ఫీజులు తీసుకోకుండా చికిత్స అందించేది హాస్పిటల్‌ యాజమాన్యం. ఇప్పటిదాకా వందల మందికి సేవలందించారు. వీరు అందించిన చికిత్సల్లో 85 శాతం విజయవంతమయ్యాయి. వాళ్లంతా సాధారణ జీవనం సాగిస్తున్నారు. ‘మా సాయంతో క్యాన్సర్‌ నయం చేయించుకుని వెళ్లినవారిలో కొందరు ఉద్యోగాలూ, వ్యాపారాలూ చేస్తున్నారు. వారంతా తోచినంతలో ఫౌండేషన్‌కి సహకరిస్తున్నారు’ అని సంతోషంగా చెబుతారు ప్రియ. రజనీకాంత్‌, ధనుష్‌, త్రిష.. లాంటి సినీతారలూ ఈ ఫౌండేషన్‌కు సహకరిస్తున్నారు.

- హిదాయతుల్లాహ్‌.బి, చెన్నై

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని