ఆకాశాన్ని ఏలేయొచ్చు...
కుటుంబానికి తగిన సమయం కేటాయించొచ్చు.. సుదీర్ఘకాలం కెరియర్‌ని ఆస్వాదించొచ్చు... అవకాశాల వెల్లువ.. మరెన్నో ఆసక్తికరమైన అంశాలు మహిళలు పైలెట్లుగా రాణించడానికి దారులు చూపిస్తున్నాయి అంటున్నారు కెప్టెన్ మమత. హైదరాబాద్ కేంద్రంగా ఫ్లైటెక్ ఏవియేషన్ అకాడమీని నిర్వహిస్తున్న ఆమె వసుంధరతో ముచ్చటించారు..
కుటుంబానికి తగిన సమయం కేటాయించొచ్చు.. సుదీర్ఘకాలం కెరియర్‌ని ఆస్వాదించొచ్చు... అవకాశాల వెల్లువ.. మరెన్నో ఆసక్తికరమైన అంశాలు మహిళలు పైలెట్లుగా రాణించడానికి దారులు చూపిస్తున్నాయి అంటున్నారు కెప్టెన్ మమత. హైదరాబాద్ కేంద్రంగా ఫ్లైటెక్ ఏవియేషన్ అకాడమీని నిర్వహిస్తున్న ఆమె వసుంధరతో ముచ్చటించారు..
అగ్రదేశాలతో పోలిస్తే.. మన దగ్గర మహిళా పైలెట్లు ఎక్కువగా ఉండటానికి కారణాలు?
మనదేశంలో మొదట ఎయిర్‌లైన్స్ నడిపిన టాటా కుటుంబంలో చాలామంది మహిళలకి పైలెట్ లైసెన్స్ ఉంది. అప్పట్లో అభిరుచి ఉన్నవాళ్లు దీన్నో వ్యాపకంగా శిక్షణ పొందారు. నవతరం మహిళలకి వాళ్లు స్ఫూర్తిగా నిలిచారు. మిగతా రంగాలతో పోలిస్తే ఇందులో సుదీర్ఘమైన కెరీర్‌కు అవకాశం ఉండటం, అనువైన వృత్తిగా మారడంతో ఎక్కువ మంది మహిళలు ఆసక్తి చూపించడం మొదలుపెట్టారు. అలా ప్రపంచ దేశాలతో పోలిస్తే మనదేశంలో మహిళా పైలెట్ల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఆయా దేశాల్లో 4 శాతం మహిళా పైలెట్లు ఉంటే మన దగ్గర సుమారు 13 శాతం ఉన్నారు. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మూడు రెట్లు ఎక్కువగా ఉన్నారు.
వేళ కాని వేళల్లో ప్రయాణాలుంటాయి కదా.. మరి వృత్తి, కెరీర్‌ను ఎలా సమతౌల్యం చేస్తుంటారు?
కమర్షియల్ పైలెట్‌కు నెలకు గరిష్ఠంగా 120 గంటలు మించి ఇవ్వరు. కాబట్టి కుటుంబంతో గడిపే సమయం ఎక్కువగానే ఉంటుంది. ప్రసూతి సెలవులు ఉంటాయి. 65 ఏళ్ల వరకు వృత్తిని కొనసాగించొచ్చు. మిగతా రంగాల్లో.. కుటుంబ బాధ్యతలరీత్యా ఆడవాళ్లు కెరియర్‌ని మధ్యలోనే వదిలేస్తుంటారు. కానీ ఇక్కడా సమస్య లేకపోవడంతో ఎక్కువ మంది మహిళలు ముందుకొస్తున్నారు.
కొవిడ్ తర్వాత పైలెట్ల కొరత అధికంగా ఉందంటున్నారు.. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ప్రస్తుతం ఎలాంటి అవకాశాలు ఉన్నాయి?
ఈ రంగంలో అవకాశాలు స్థిరంగా ఉండవు. కొవిడ్ సమయంలో విమానయానం నిలిచిపోయింది. కొవిడ్ అనంతరం ఒక్కసారిగా పైలెట్లకు డిమాండ్ పెరిగింది. ఒక్కో పెద్ద ఎయిర్‌లైన్స్ సంస్థ రెండువేల మంది పైలెట్లను దశల వారీగా నియమించుకునే పనిలో ఉంది. ఆ రకంగా దేశవ్యాప్తంగా 10వేల మంది పైలెట్ల అవసరముందని అంచనా. ప్రస్తుతం శిక్షణ పొందుతున్న వారు దేశవ్యాప్తంగా వెయ్యిమంది ఉండొచ్చు. దీన్ని బట్టి అర్థమవుతోంది కదా.. ఈ రంగం మరింత వృద్ధి చెందుతోందని.
వైమానిక శిక్షణ, ఏవియేషన్ హబ్‌గా పేరున్న హైదరాబాద్ నుంచి.. తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతమంది పైలెట్ కెరీర్‌పై ఆసక్తి చూపిస్తున్నారు?
తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువగానే ముందుకొస్తున్నారు. నేను 30 ఏళ్ల క్రితం శిక్షణ కేంద్రం ప్రారంభించినప్పుడు పది శాతం అమ్మాయిల్లో తెలుగువాళ్లు నుంచి ఒక శాతమే ఉండేవారు. తెలంగాణ, ఆంధ్రపదేశ్ నుంచి ఇప్పుడు బాగా పెరిగారు. హైదరాబాద్ వైమానిక శిక్షణకు దేశంలోనే అత్యంత అనువైన ప్రదేశం. ఏడాదిలో 365 రోజులూ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఇతర ప్రాంతాల్లో అయితే వాతావరణంలో తీవ్రమైన హెచ్చుతగ్గులు ఉంటాయి. భారత వాయు దళానికి చెందిన రెండు పైలెట్ శిక్షణ కేంద్రాలు దుండిగల్, హకీంపేటలో ఉన్నాయి. ప్రైవేటులో నాలుగు అకాడమీలు ఉన్నాయి. కమర్షియల్ పైలెట్ అయ్యేందుకు 200 పని గంటలు పూర్తిచేయాల్సి ఉంటుంది.
* భారత్ వాయుసేనలో ఫైటర్‌జెట్ మహిళా పైలెట్లు 16 మంది ఉన్నారు. వీరిలో రఫెల్‌ని నడిపేవాళ్లూ ఉన్నారు.
* 2004లో కెప్టెన్ రష్మి మిరండా నేతృత్వంలో మహిళా బృందం తొలిసారిగా ముంబయి నుంచి సింగపూర్‌కు అంతర్జాతీయ విమానాన్ని నడిపింది.
* 2010లో ముంబయి నుంచి న్యూయార్క్‌వరకూ నాన్‌స్టాప్ ఫ్లైట్‌ని పూర్తిగా మహిళలే నడిపి చరిత్ర సృష్టించారు.
* 2016లో ప్రపంచంలోనే సుదీర్ఘ సమయం దిల్లీ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కో వరకూ మహిళా బృందం నడిపింది.
తొలినాళ్లలో మహిళలకు హెలికాప్టర్లు, ట్రాన్స్‌పోర్ట్ విమానాలు నడిపేందుకు మాత్రమే అవకాశం ఇచ్చేవారు. తర్వాత యుద్ధ విమానాలు కూడా నడిపే ప్రతిభని సొంతం చేసుకున్నారు. పురుష పైలెట్లతో పోలిస్తే మహిళా పైలెట్ల కారణంగా అయ్యే ప్రమాదాల శాతం తక్కువ. మద్యం తాగి విమానం నడపడం, క్రమశిక్షణ రాహిత్యం వంటి ఫిర్యాదులు మహిళలపై చాలా తక్కువ. దీంతో కమర్షియల్ ఫ్లైట్లను సైతం ఎక్కువగా అమ్మాయిలు నడిపేందుకు అవకాశం ఇస్తున్నారు. తల్లిదండ్రులూ ప్రోత్సహిస్తున్నారు. మొదట్లో ఉత్తరాది నుంచి ఎక్కువగా ఉండేవారు. ప్రస్తుతం అన్ని ప్రాంతాల మహిళలూ ముందుకొస్తున్నారు. అయితే గ్రామీణ ప్రాంతాల వారు 10 శాతమే.
- మల్లేపల్లి రమేష్, హైదరాబాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.