అంతరిక్షయానం ఆమె కల నెరవేరుతోందిలా..

చిన్నప్పటి నుంచి అంతరిక్షానికి వెళ్లాలని కలలుకందా అమ్మాయి. వాటిని సాకారం చేసుకోవడానికి కృషి చేసింది. అవి ఫలించి ఇటీవలే నాసా సంస్థ అంతరిక్ష నౌక ‘క్రూడ్రాగన్‌’లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లే బృందంలో స్థానాన్ని సంపాదించింది. రష్యాకు చెందిన అన్నా కికినా స్ఫూర్తి గాథ ఇది...

Published : 03 Sep 2022 00:15 IST

చిన్నప్పటి నుంచి అంతరిక్షానికి వెళ్లాలని కలలుకందా అమ్మాయి. వాటిని సాకారం చేసుకోవడానికి కృషి చేసింది. అవి ఫలించి ఇటీవలే నాసా సంస్థ అంతరిక్ష నౌక ‘క్రూడ్రాగన్‌’లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లే బృందంలో స్థానాన్ని సంపాదించింది. రష్యాకు చెందిన అన్నా కికినా స్ఫూర్తి గాథ ఇది...

ఏడాది అక్టోబరు మూడోతేదీన అంతరిక్షానికి పయనించనున్న 37 ఏళ్ల అన్నా కికినా అమెరికాలో ప్రత్యేక శిక్షణ తీసుకుంటోంది. స్పేస్‌ ఎక్స్‌ మిషన్‌లో భాగంగా క్రూడ్రాగన్‌ అంతరిక్షనౌకలో ప్రయాణించడానికి తనకు అవకాశం దక్కడం సంతోషంగా ఉందని చెబుతోందీమె. ‘ఇది నాకు అందించిన పెద్ద బాధ్యతగా భావిస్తున్నా. ఈ ప్రయాణానికి కావాల్సిన శిక్షణ చివరి దశలో ఉంది. ఏ వ్యోమగామికైనా ఇది పెద్ద బాధ్యతేే. నేనూ అంతే. నాసా నుంచి నికోలేమన్‌, జోష్‌ కాస్సడా, జపాన్‌కు చెందిన కోయిచ్చి వకటా వ్యోమగాముల బృందంలో నేనూ బాధ్యతలు నిర్వర్తించడం సంతోషంగా ఉంది. ఎప్పటికైనా అంతరిక్షంలోకి వెళ్లాలని చిన్నప్పటి నుంచి నేను కన్న కల త్వరలో తీరనుంది. నేను పుట్టిన సైబీరియా ప్రాంతానికి గర్వకారణంగా నిలవనున్నా. అందుకే నాతోపాటు మా సొంతూరు నోవోసిబిర్‌స్క్‌కు గుర్తుగా చేతితో తయారుచేసిన ‘గొరోడొవిఛోక్‌’ పిల్లాడి బొమ్మను తీసుకెళుతున్నా’ అని చెబుతున్న అన్నా కికినా ఈ యాత్రతో రష్యా నుంచి అంతరిక్షంలోకి వెళ్లిన అయిదో మహిళా వ్యోమగామి కానుంది. ఏదైనా సాధించాలనే కల కనే హక్కు మనకుంది. అయితే దాన్ని సాకారం చేసుకోవడానికి మాత్రం ఎంతటి కష్టానికీ వెరవకూడదంటుంది అన్నా.

పరీక్షలెన్నో దాటి..

అన్నా ‘నోవోసిబిర్‌స్క్‌ స్టేట్‌ అకాడమీ ఆఫ్‌ వాటర్‌ ట్రాన్స్‌పోర్ట్‌’లో ఇంజినీరింగ్‌ డిగ్రీ చేసింది. సాహసక్రీడలపై ఆసక్తితో రాఫ్టింగ్‌, పాలీథ్లాన్‌ వంటివి నేర్చుకోవడమే కాదు, పలు పోటీల్లో విజేతగానూ నిలిచింది. చదువైన తర్వాత సైబీరియా ఆల్‌టాయ్‌ రేడియోస్టేషన్‌లో పని చేసింది. ఏ ఉద్యోగంలో ఉన్నా అంతరిక్షంలోకి వెళ్లాలనే చిన్ననాటి కలను మాత్రం వదల్లేదు. అలా 2012లో వ్యోమగామి కావడానికి దరఖాస్తు చేసుకొని తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అర్హత పరీక్షకు ఎంపికైంది. తర్వాత 42మంది మహిళలు సహా 303 మందితో పోటీ పడాల్సి వచ్చింది. దాదాపు రెండేళ్లు సాగిన ఈ పోటీల్లో తుది దశకు ఎనిమిది మంది ఎంపిక కాగా, వీరిలో ఏకైక మహిళగా  అన్నా నిలిచింది. ఎట్టకేలకు అర్హత పరీక్షలన్నింటినీ దాటి అన్నా విజేత అయ్యింది. 2014లో టెస్ట్‌ కాస్మొనాట్‌గా ఎంపికై శిక్షణ తీసుకుంటూ, తాజాగా నాసా తరఫున క్రూ డ్రాగన్‌లో అంతరిక్షానికి వెళ్లే నలుగురిలో ఒకరిగా స్థానాన్ని సంపాదించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్