ఆమె చేతిలో దిల్లీ బస్సు స్టీరింగ్!
‘ఇంటిని ముందుండి నడిపించేవాళ్లు.. వీళ్లకి నాలుగు చక్రాల బండి ఓ లెక్కా?’ ఇదే భావించింది దిల్లీ ప్రభుత్వం. అందుకే ప్రభుత్వ రవాణా సర్వీసుల్లోకి మహిళలకు అవకాశమిచ్చింది. ఇప్పుడు చేర్చుకొంది 11 మందినే! రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరుగుతుందనీ చెప్పింది.
‘ఇంటిని ముందుండి నడిపించేవాళ్లు.. వీళ్లకి నాలుగు చక్రాల బండి ఓ లెక్కా?’ ఇదే భావించింది దిల్లీ ప్రభుత్వం. అందుకే ప్రభుత్వ రవాణా సర్వీసుల్లోకి మహిళలకు అవకాశమిచ్చింది. ఇప్పుడు చేర్చుకొంది 11 మందినే! రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరుగుతుందనీ చెప్పింది.
రోడ్డు మీద వాహనాలు నడిపే మహిళలు ఎంతోమంది కనిపిస్తున్నా.. ప్రభుత్వ రంగంలో స్టీరింగ్ పట్టినవాళ్లు అరుదు. దాన్నే మార్చాలనుకొని దిల్లీ ప్రభుత్వం దిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (డీటీసీ)లో తాజాగా 11మందికి అవకాశమిచ్చింది. ‘మా ఊరిలో బుల్లెట్ నడిపిన మొదటి అమ్మాయిని నేనే. అందరి కంటే భిన్నంగా ఉండాలన్నది నా తత్వం. అందుకే బస్సు నడిపే అవకాశమనగానే దరఖాస్తు చేసుకున్నా. ఇంట్లోవాళ్లూ ఎంతగానో ప్రోత్సహించారు’ అనే 23 ఏళ్ల పూజ బాక్సర్ కూడా. రాష్ట్రస్థాయి పోటీల్లోనూ పాల్గొంది. తనది హరియాణలోని హిస్సార్. మహిళలు డ్రైవర్లుగా ఉంటే తోటి ఆడవాళ్లూ ఆనందిస్తారంటోంది. ముఖ్యంగా రాత్రిపూట ప్రయాణం సురక్షితంగా భావిస్తారన్నది తన అభిప్రాయం.
2015లో ఒకమ్మాయి బస్సు నడిపిందన్న వార్త సీమను స్టీరింగ్ పట్టుకునేలా చేసింది. దాంతో తనూ నేర్చుకుంది. కానీ నడపడానికి ప్రైవేటు సంస్థలే అవకాశమిచ్చాయి. ‘డీటీసీ అర్హతల్లో మార్పు చేసిందనగానే ఎగిరి గంతేశా. మా ఇంటి దగ్గర్లోని డిపోలోనే పోస్టింగ్. మా పిల్లల స్కూలూ ఇదే దారిలో. వాళ్లు ఎక్కే బస్సునే నేను నడపబోతున్నానన్న ఊహే కొత్తగా ఉంద’ంటుందీమె. 27 ఏళ్ల బబితా ధవన్‌దీ ఇదే కథ. ఈమెది హరియాణలోని ఓ పల్లె. నాన్నకి సాయంగా ఉండొచ్చని టీనేజీలోనే ట్రాక్టర్ నేర్చుకుంది. ‘మరి బస్ ఎందుకు నడపలేం అని ప్రయత్నించా’నని చెబుతుంది. ‘అమ్మాయిలు ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లనే నడుపుతున్నారు. దాంతో పోలిస్తే బస్సు, లారీ లాంటివి చాలా చిన్నవనిపించాయి. అందుకే 2018లోనే హెవీ వెహికల్ లైసెన్స్ సాధించా’నంటోంది 28 ఏళ్ల దీపక్. నీతూ దేవికి మాత్రం చిన్నతనం నుంచీ ప్రభుత్వోద్యోగం సాధించాలని కల. అందుకోసం ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకొంది.
ఆ పోస్టింగ్‌లు ఆలస్యమవుతున్నాయని పట్టుబట్టి నేర్చుకొని మరీ డ్రైవర్ అయ్యింది.
‘ఇంటర్ అవ్వగానే పెళ్లి చేశారు. ఆడవాళ్లకి ఇల్లే లోకమవ్వాలి, గడపదాటొద్దన్న మాటలు వినీ వినీ విసిగిపోయా. నీకేమీ చేతకాదన్న మాట విన్న ప్రతిసారీ ఏదో ఒకటి చేసి నిరూపించుకోవాలన్న కసి పెరిగేది. ఆరేళ్ల క్రితం ఓ ఎన్‌జీఓ డ్రైవింగ్‌లో శిక్షణ ఇస్తోంటే చేరా. క్యాబ్ డ్రైవర్‌గా మారి నేనూ సంపాదించగలనని చూపించా. ఇప్పుడు ప్రభుత్వ విభాగంలో చేరా’నని గర్వంగా చెబుతుంది 40 ఏళ్ల సీమా ఠాకూర్. షర్మిలా శర్మకు మాత్రం ఆ బాధలేదు. చుట్టూ ఉన్న వాళ్ల వ్యాఖ్యల్ని పట్టించుకోకుండా నా భర్త నాకు అండగా నిలిచాడంటుంది తను. నీతూ దేవికి నాన్న చిన్నతనంలోనే చనిపోయారు. అమ్మకు ఆర్థికంగా అండగా నిలవడానికి చిన్నచిన్న కొలువులు చేస్తూ ఇలా డ్రైవర్ అయ్యింది. ఈ పదకొండు మందీ ఆర్థికంగా వెనుకబడినవారే.. అయితేనేం ‘మేం ఎవరికీ తీసిపో’మనే ఆత్మవిశ్వాసం వాళ్లది. వాళ్ల స్ఫూర్తితో ఈ రంగంలోకి మరింతమంది రావాలన్నదే తమ కల అంటున్నారు. దిల్లీ ప్రభుత్వమూ ఇది ప్రారంభమే.. ఈ తడవ 180 మందికి అవకాశమిస్తామని చెబుతోంది. ఈ మార్పు ఇతర రాష్ట్రాలకీ వ్యాపించాలని కోరుకుందాం!
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.