అక్కడే విద్యార్థులు..అక్కడే ఆచార్యులు!
చదువుకున్న బడిలోనో, కళాశాల్లోనో పాఠాలు బోధిస్తే.. జీవితానికి మార్గం చూపిన చోటే తర్వాతి తరాల్ని తీర్చిదిద్దితే... అలాంటి అవకాశం రావడం నిజంగా అపురూపం కదూ. ఏదో ఒక కాలేజీలో ఒకరిద్దరు ఇలా ఉండటం సహజమే. కానీ కరీంనగర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ, పీజీ కళాశాలలో అధ్యాపకులుగా పని చేస్తున్న వారిలో 14 మంది పూర్వ విద్యార్థులేనంటే నమ్మగలరా..!
ఉపాధ్యాయ దినోత్సవం ప్రత్యేకం
చదువుకున్న బడిలోనో, కళాశాల్లోనో పాఠాలు బోధిస్తే.. జీవితానికి మార్గం చూపిన చోటే తర్వాతి తరాల్ని తీర్చిదిద్దితే... అలాంటి అవకాశం రావడం నిజంగా అపురూపం కదూ. ఏదో ఒక కాలేజీలో ఒకరిద్దరు ఇలా ఉండటం సహజమే. కానీ కరీంనగర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ, పీజీ కళాశాలలో అధ్యాపకులుగా పని చేస్తున్న వారిలో 14 మంది పూర్వ విద్యార్థులేనంటే నమ్మగలరా..! గురువుల దినోత్సవం సందర్భంగా వసుంధరతో వారి జ్ఞాపకాలను పంచుకున్నారు...
ఎన్.సంగీతరాణి, బి.రజనీదేవి.. ఆ కాలేజీలో బ్యాచ్‌మేట్స్, డి.సుజాత, ఆర్.జ్యోతిర్మయిలది మరో బ్యాచ్.. ఇప్పుడు అదే కాలేజీలో వీళ్లు ఆచార్యులూ, సహాయ ఆచార్యులూ. వీళ్లే కాదు కె.సునీత, ఆర్.సునీత, తహేరా తాజీన్, సీహెచ్.శోభారాణి, ఎన్.ఉదయశ్రీ, ఎం.శకుంతల, జె.స్వప్న, నజియా రహ్మాన్, జబిన్ సుల్తానా, వరుణి.. వీళ్లు కూడా అదే కాలేజీలో ఒకప్పుడు సీనియర్స్, జూనియర్స్. ఈ పద్నాలుగు మంది ఇప్పుడు అక్కడ పాఠాలు బోధిస్తున్నారు. వీరిలో తొమ్మిది మంది రెగ్యులర్ ఉద్యోగులూ, మిగతా వాళ్లు ఒప్పంద ఉద్యోగులూనూ. ఒక్క వృక్షశాస్త్రంలోనే వీళ్లలో అయిదుగురున్నారు.
‘మేం చదువుకునే రోజుల్లో ఇక్కడ అరకొర సదుపాయాలుండేవి. అయినా జీవితంలో పైకి రావాలనే తపన బాగా ఉండేది. మాకు చదువులు నేర్పిన శకుంతల, షిరాజ్, హేమలత, నాంపల్లి మధుబాబు, ఖురేషి, బాబురావు, సత్యనారాయణ, బియాబాన్.. ఒక్క క్లాస్ కూడా మిస్ కాకుండా బోధించారు. వారి అంకితభావం మమ్మల్ని ఆలోచింపజేసేది. బోధన వృత్తిలోకి రావడానికి వారే మాకు స్ఫూర్తి’ అని గుర్తు చేసుకున్నారీ చదువులమ్మలు. 1987-2002 మధ్య వివిధ బ్యాచ్‌లలో ఇక్కడ డిగ్రీలు చేశారు వీళ్లు. అప్పటితో పోల్చితే ఇప్పుడు పరిస్థితులూ, సౌకర్యాలూ ఎంతో మెరుగయ్యాయనేది వీరి మాట. ‘రవాణా వసతులు పెరిగాయి. ఆధునిక భవనాలు వచ్చాయి. ఆర్ట్స్, కామర్స్, సైన్స్‌కు ప్రత్యేక బ్లాకులున్నాయి. కంప్యూటర్ ల్యాబ్‌తో సహా ఊహించని అభివృద్ధి జరిగింది. అప్పటికీ ఇప్పటికీ మారనిదంటే... మొక్కలు, చెట్లతో ఆహ్లాదకరమైన క్యాంపస్. గురు-శిష్యుల మధ్య అనుబంధం’ అని గతాన్ని నేటితో పోల్చి చెబుతారు. విద్యార్థులుగా ఆ రోజుల్లో కొంచెం బిడియం, భయంతో ప్రాంగణంలో తిరిగే వాళ్లమనీ, ఇష్టమైన అధ్యాపకులతో తప్ప మిగతా వారితో మాట్లాడేవాళ్లం కాదనీ అంటారు. ఈతరం మాత్రం అన్నింటా చురుగ్గా ఉంటారనీ.. చదవాలీ, సాధించాలనే పట్టుదల వారిలో ఎక్కువగా కనిపిస్తోందనీ చెబుతారు. క్రమశిక్షణ విషయంలో తమ విద్యార్థుల్లో తాము కనిపిస్తున్నామంటారు. సబ్జెక్టుల బోధనతో పాటు ఎన్‌ఎస్‌ఎస్, మహిళా సాధికారత, టాస్క్, ఎకో క్లబ్, హెల్త్ క్లబ్, పరీక్షల విభాగం వంటి బాధ్యతలూ నిర్వహిస్తున్నారు వీళ్లు.
ఎలా మర్చిపోగలం...
ప్రయోగశాలలో తన ఆరాధ్య అధ్యాపకురాలు.. శకుంతల మేడమ్ కుర్చీలో ఇప్పుడు తాను కూర్చోవడం అదృష్టమంటారు వృక్షశాస్త్ర ఆచార్యులు డి.సుజాత. విద్యార్థి సంఘం నాయకురాలిగా పని చేయడం ఎన్నో మధుర జ్ఞాపకాలను మిగిల్చిందనీ, విద్యార్థినుల సమస్యల పరిష్కారానికి కృషి చేయడంతోపాటు క్రీడల్లో ఆల్ రౌండర్‌గా తనకు ప్రత్యేక గుర్తింపు ఉండేదంటారు జంతుశాస్త్రం ప్రొఫెసర్ సంగీత రాణి. మా విద్యార్థినులు ఇప్పుడు మమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుంటున్నారని సంతోష పడుతున్నారు. బోధనపై ఆసక్తి గలవారు ఇక్కడే పనిచేసే అవకాశం రావాలని ఆకాంక్షిస్తున్నారు. ఈ 14 మందిలో ఎవరికీ తమకు పాఠాలు బోధించిన వాళ్లతో కలిసి పనిచేసే అవకాశం రాలేదు. అదొక్కకే కాస్త అసంతృప్తి.. తమ విద్యార్థులకైనా ఆ అవకాశం రావాలని కోరుకుంటున్నారు. ఏటా కళాశాలకు అవసరమైన ఏదో ఒక వస్తువును కొనుగోలుచేస్తూ పూర్వ విద్యార్థులుగా తమ అభిమానాన్నీ చాటుకుంటున్నారు.
వాళ్లంతా స్వీట్ 14
2008కు ముందు ఏడుగురు, తర్వాత బదిలీల్లో ఏడుగురు కళాశాలకు వచ్చారు. వీరంతా అన్యోన్యంగా ఉండటంతో వీళ్లని ‘స్వీట్ 14’ అని పిలుస్తాం. ఇంతమంది పూర్వ విద్యార్థులు అధ్యాపకులుగా ఉండటం మా విద్యార్థులకు ఆదర్శం. బోధనతో పాటు ఇతర అంశాల్లోనూ చురుగ్గా భాగస్వాములు అవుతూ వీళ్లంతా కళాశాల ప్రగతిలో యథాశక్తి పాలుపంచుకుంటున్నారు.
- డా. టి.శ్రీలక్ష్మి, ప్రిన్సిపల్
- టి.రమేశ్, కరీంనగర్
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.