పాఠాల నుంచి.. అందాల పోటీల వరకు!

ఉపాధ్యాయులంటే విద్యార్థులకు పాఠాలు చెప్పడమే కాదు, వారి జీవితమూ స్ఫూర్తి పాఠంలా ఉండాలి. అప్పుడే భావితరాలూ వారిని ఆదర్శంగా తీసుకుంటాయి. అలాంటి స్ఫూర్తినిచ్చే జీవితం ఈ అధ్యాపకురాలిది. చిన్న వయసులోనే పెళ్లి, పిల్లలు. అయినా చదువు ఆపలేదు. పైగా నృత్యకారిణిగా ..

Updated : 05 Sep 2022 06:46 IST

ఉపాధ్యాయ దినోత్సవం ప్రత్యేకం

ఉపాధ్యాయులంటే విద్యార్థులకు పాఠాలు చెప్పడమే కాదు, వారి జీవితమూ స్ఫూర్తి పాఠంలా ఉండాలి. అప్పుడే భావితరాలూ వారిని ఆదర్శంగా తీసుకుంటాయి. అలాంటి స్ఫూర్తినిచ్చే జీవితం ఈ అధ్యాపకురాలిది. చిన్న వయసులోనే పెళ్లి, పిల్లలు. అయినా చదువు ఆపలేదు. పైగా నృత్యకారిణిగా రాణిస్తూనే అందాల పోటీల్లోనూ ప్రతిభని చాటుతున్నారు విశాఖకు చెందిన పైడి రజని. ఆ ప్రయాణాన్ని ‘వసుంధర’తో పంచుకున్నారిలా...

శ్రీకాకుళం జిల్లా కనిమెట్ట మా స్వస్థలం. నాన్న పేడాడ మల్లేశ్వరరావు నీటి పారుదలశాఖలో ఇంజినీర్‌. నేను పదో తరగతిలో ఉండగా చనిపోయారు. ఇంటర్‌ చదువుతుండగానే పెళ్లి చేశారు. ఉన్నత చదువులు చదవాలన్న నా కోరికను మా వారు గోపాలరావు ప్రోత్సహించారు. ప్రైవేటుగా డిగ్రీ, ఇంగ్లిష్‌లో పీజీ చేశా. శ్రీకాకుళంలో బీఈడీ, ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఎంఈడీ చేశా. నాకు ఇద్దరు పిల్లలు. వారి బాధ్యతలు దృష్ట్యా కొంతకాలం ఇంటికే పరిమితమైనా తర్వాత నాకెంతో ఇష్టమైన అధ్యాపక వృత్తిలోకి అడుగుపెట్టా. 2010-2013 మధ్య శ్రీకాకుళంలోనూ, ఆ తరువాత నుంచి విశాఖలోని మిసెస్‌ ఎ.వి.ఎన్‌.కళాశాలలో అధ్యాపకురాలిగా చేస్తున్నా. పీహెచ్‌డీ కోసం మూడేళ్లు బోధనకు దూరంగా ఉన్నా.. త్వరలో పూర్తికానుండటంతో మళ్లీ అధ్యాపకురాలిగా చేరా. సేవా కార్యక్రమాలన్నా కూడా చాలా ఇష్టం. అందుకే కొన్ని ఎన్జీఓల్లోనూ భాగమయ్యా. 2018లో ‘శక్తి ఎంపవరింగ్‌ ఉమెన్‌ అసోసియేషన్‌’ను స్థాపించా. దీనిద్వారా అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాల్లో ఉండేవారికి కావాల్సిన ఉపకరణాలు ఇచ్చేదాన్ని. మహిళల హక్కులపై అవగాహన సదస్సులు, అనారోగ్యాలతో బాధపడుతున్న పేదలకు ఆర్థిక సాయం తదితర కార్యక్రమాలు ఐదువందలకు పైగా నిర్వహించా.

మిసెస్‌ ఆంధ్రప్రదేశ్‌...

నృత్యంలో శిక్షణ కోసం మా అమ్మాయిని ఓ సంస్థలో చేర్పించినపుడు నాకూ నేర్చుకోవాలనిపించింది. అలా ఇద్దరం ఒకేసారి కూచిపూడి, భరతనాట్యం నేర్చుకున్నాం. కలిసి నృత్యప్రదర్శనలూ ఇచ్చాం. నేను 30కిపైగా ప్రదర్శనలిచ్చా. అన్నమాచార్య కీర్తనలతో కచేరీలూ చేశా. గతేడాది మిసెస్‌ ఆంధ్రప్రదేశ్‌ పోటీలు జరుగుతున్నాయని తెలిసి అందులోనూ పాల్గొన్నా. వందలాది మందికి ఆడిషన్లు, ఇంటర్వ్యూలు నిర్వహించి ఆంధ్రప్రదేశ్‌ నుంచి 50 మందిని తుది పోటీలకు ఎంపిక చేసి వారికి ఆన్‌లైన్లోనే గ్రూమింగ్‌ కార్యక్రమాలు నిర్వహించారు. ఆపైన వ్యక్తిత్వ విశ్లేషణ, మహిళా సాధికారత, ర్యాంప్‌ వాక్‌, వస్త్ర ధారణ, సేవాభావం, నృత్యం, మాట తీరు... ఇలా పలుఅంశాలపై అవగాహన కలిగించారు. ఆరు నెలలు కొనసాగిన ఆయా పోటీల్లో అభ్యర్థుల ప్రతిభను నిశితంగా అంచనా వేసి ‘మిసెస్‌ ఆంధ్రప్రదేశ్‌- 2021’గా నన్ను ప్రకటించారు. ప్రస్తుతం ‘మిసెస్‌ ఇండియా’ పోటీల్లో పాల్గొనే యత్నాల్లో ఉన్నా.

మహిళలు తమ కెరియర్‌లో ఎంత ఎదిగినా తల్లిగా విజయవంతం కావడమూ ముఖ్యమే. ఆ విషయంలో నాకెంతో సంతృప్తి ఉంది. అబ్బాయి వెంకట ప్రీతమ్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. అమ్మాయి రేష్మ ఎం.బి.బి.ఎస్‌. చదివింది. ప్రస్తుతం అమెరికాలో ఎం.ఎస్‌. చేస్తోంది. మహిళలు ఏదో ఒక్క రంగానికి పరిమితం కాకూడదు. ఒకే సమయంలో పలు రంగాల్లో రాణించగలిగే సామర్థ్యం మహిళల సొంతం. కావాల్సిందల్లా ఆత్మవిశ్వాసం.

- బి.ఎస్‌.రామకృష్ణ, విశాఖపట్నం

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్