40 వేల మందికి బాస్‌!

ఓ ఏడాది విరామం తీసుకుంటేనే రేసులో నిలబడటం కష్టమనే ఐటీ రంగంలో 13 ఏళ్ల గ్యాప్‌ తర్వాత కూడా నిలదొక్కుకున్నారావిడ. ఏ స్థాయిలో అంటే... ఇప్పుడావిడ ఇన్ఫోసిస్‌ వంటి దిగ్గజ సంస్థలో 40 వేల మందికి బాస్‌!... అంతే కాదు... ప్రతిష్ఠాత్మక ‘హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అసోసియేషన్‌’ (హైసియా) అధ్యక్షురాలిగానూ ఎన్నికయ్యారు. ఆవిడే మనీషా సాబూ.

Updated : 08 Sep 2022 06:54 IST

ఓ ఏడాది విరామం తీసుకుంటేనే రేసులో నిలబడటం కష్టమనే ఐటీ రంగంలో 13 ఏళ్ల గ్యాప్‌ తర్వాత కూడా నిలదొక్కుకున్నారావిడ. ఏ స్థాయిలో అంటే... ఇప్పుడావిడ ఇన్ఫోసిస్‌ వంటి దిగ్గజ సంస్థలో 40 వేల మందికి బాస్‌!... అంతే కాదు... ప్రతిష్ఠాత్మక ‘హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అసోసియేషన్‌’ (హైసియా) అధ్యక్షురాలిగానూ ఎన్నికయ్యారు. ఆవిడే మనీషా సాబూ. మూడు దశాబ్దాల వయస్సున్న ఈ సంస్థకు ఓ మహిళ సారథ్యం ఇదే మొదటిసారి. ఈ హైదరాబాదీ కోడలు వసుంధరతో తన ప్రస్థానాన్ని పంచుకున్నారు....

నా గురించి చెప్పమంటే.. డ్రీమర్‌ని అంటా. పెద్ద కలలు కనడం వాటిని సాధించేవరకూ ఎంత కష్టమైనా పడటం నాకలవాటు. కొత్తగా ప్రయత్నించే వారు, వ్యాపార ఆలోచనలో ఉన్నవారు, విశాల దృక్పథంతో ఆలోచించేవారు, పెద్దకలలు కని వాటిని సాకారం చేసుకోవడానికి ప్రయత్నించే వారి నుంచీ స్ఫూర్తి పొందుతుంటా. పుట్టింది మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌. నాన్న ప్రభుత్వ ఉద్యోగి. ఆయన బదిలీల వల్ల దేశంలో దాదాపు అన్ని నగరాలూ తిరిగా. మా శ్రీవారు సంజయ్‌ది హైదరాబాదే.

ముగ్గురన్నయ్యలతో సమానంగా నన్ను పెంచారు అమ్మానాన్నా. ఎన్‌ఐటీ నాగ్‌పుర్‌ నుంచి ఇంజినీరింగ్‌, ముంబయిలో ఎంబీఏ చేశా. ముందు నుంచీ నా దృష్టి సాఫ్ట్‌వేర్‌ రంగంపైనే! కులం, ప్రాంతం, లింగంతో సంబంధం లేకుండా సమాన అవకాశాలు, ప్రపంచంలోని విఖ్యాత నిపుణులతో పని చేయొచ్చన్న ఉద్దేశంతోనే దీన్ని ఎంచుకొన్నా. కానీ చదువయ్యాక సొంత ఊరు వెళ్లిపోయాం. కెరియర్‌ కంటే పెళ్లి ముఖ్యమని నాన్న ఉద్దేశం. అయినా నేను కెరియర్‌కి ఫుల్‌స్టాప్‌ పెట్టలేదు. చిన్న చిన్న వ్యాపారాలు చేశా. స్కూళ్లలో కంప్యూటర్‌ పాఠాలూ బోధించా. ఇలా 13 ఏళ్లు గడిచాక 2001లో కార్పొరేట్‌ ప్రపంచంలోకి అడుగుపెట్టా. రోజురోజుకీ మారిపోయే రంగం ఇది. ఇన్నేళ్ల గ్యాప్‌ తర్వాత ప్రయత్నిస్తుంటే తిరస్కరణలు సాధారణమే. వాటికి ముందునుంచీ సిద్ధంగానే ఉన్నా. పరిశ్రమ పోకడలను బట్టి తగిన కోర్సులు నేర్చుకుంటూ వచ్చా. అయినా ఆర్థిక రంగంలో ఆటుపోట్ల కారణంగా సంస్థల మూసివేత, విలీనాలు జరిగేవి. కెరియర్‌లో నిలదొక్కుకోవడానికి కసితో పనిచేసేదాన్ని. బాధ్యతలు తీసుకోవడంలో ముందుండేదాన్ని. ఈ తీరే హైసియాకు సారథిని చేసింది. ఎంఐటీ, స్టాన్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయాల నుంచి మేనేజ్‌మెంట్‌ కోర్సులూ చేశా. ఇన్ఫోసిస్‌ హైదరాబాద్‌, ఇండోర్‌లకు హెడ్‌ని కూడా. 2010లో హైదరాబాద్‌ విభాగంలో 23 మంది ఉద్యోగులం ఉండే వాళ్లం. ఇప్పుడా సంఖ్య 40వేలకు పైనే. ఉద్యోగ ప్రస్థానంలో పదిసార్లు ఎక్స్‌లెన్స్‌ అవార్డుని అందుకున్నా. ఐఎస్‌బీ, ఐఐఐటీ, ఇక్ఫాయ్‌ విద్యార్థులకు ప్రసంగాలనీ ఇస్తుంటాను. తెలంగాణ ప్రభుత్వం నుంచి ‘విమెన్‌ అచీవర్‌’ పురస్కారాన్నీ అందుకొన్నా.

ఏమిటీ.. హైసియా?

30 ఏళ్ల క్రితం హైదరాబాద్‌లో ప్రారంభమైన ఈ సంస్థ ఐటీ పరిశ్రమ, చిన్న, మధ్యతరహా సంస్థల అభివృద్ధి, ఐటీ లీడర్‌షిప్‌, సంబంధిత పాలసీలు మొదలైన అంశాలపై పనిచేస్తుంది. తెలంగాణలో దాదాపు 90 శాతం ఐటీ ఉద్యోగులకు ప్రతినిధి.
కొవిడ్‌.. పెళ్లి, మెటర్నిటీ తర్వాతా ఉద్యోగాన్ని కొనసాగించే వీలును మహిళలకు కల్పించింది. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానం వారికి కెరియర్‌ బ్రేక్‌ లేదా ఉద్యోగాన్నే వదిలే పరిస్థితి రాకుండా అడ్డుకుంది. అయితే కొంత ఒత్తిడికి కారణమైందన్నదీ వాస్తవమే. నెట్‌వర్కింగ్‌, తోటివారి నుంచి నేర్చుకోవడం, ప్రొఫెషనల్‌గా ఎదిగే వీలు లేకుండా పోయింది. అందుకే సంస్థలు హైబ్రిడ్‌ పద్ధతిని ప్రవేశపెట్టాయి. హైసియా నుంచి మేమూ వివిధ స్థాయిల్లోని కనీసం వెయ్యి మంది మహిళల్లో స్ఫూర్తిని నింపే ప్రోగ్రామ్‌లు, ప్రణాళికల్ని రూపొందిస్తున్నాం.


స్ఫూర్తిగా నిలవాలని...

హైసియా అధ్యక్షురాలిగా రెండేళ్ల వ్యవధిలో తెలంగాణలో ఐటీ పరిశ్రమ వృద్ధిలో కీలకపాత్ర పోషించాలన్నది నా ధ్యేయం. ఇందుకోసం హైసియా సభ్యులు, ప్రభుత్వం, ఇతరులతో కలిసి పనిచేస్తున్నా. ఐటీలో అమ్మాయిల ప్రాధాన్యం పెరగడానికీ కృషి చేస్తున్నా. కాలేజ్‌ పిల్లలతో మాట్లాడి ఈ రంగంపై అవగాహననూ కల్పిస్తున్నా. ఇప్పటివరకూ ఈ పదవిలో అమ్మాయిలెవరూ లేరు. నాదైన ముద్ర వేయడం ద్వారా మరింత మంది అమ్మాయిలు నాయకత్వ హోదాను అందుకునేలా స్ఫూర్తినివ్వాలన్నది లక్ష్యం.


చుట్టూ చూడండి... అవకాశాలు బోలెడు...

ఆడవాళ్లకి నేను చెప్పేదొకటే! కలల్ని కనడానికి, లక్ష్యం వైపు సాగడానికి ఎప్పుడూ భయపడొద్దు. కానీ మనకు కెరియర్‌ను పక్కన పెట్టాల్సొచ్చే పరిస్థితులెన్నో! అలాంటప్పుడు చుట్టూ చూడండి.. ఎన్నో ప్రత్యామ్నాయాలు కనిపిస్తాయి. వాటిని అందుకొంటే పరిస్థితుల్లో మార్పు వచ్చినప్పుడు తిరిగి కెరియర్‌ను చక్కగా కొనసాగించొచ్చు. కుటుంబం, బాధ్యతలున్నా మీకంటూ కొన్ని ప్రాధామ్యాలను ఏర్పరచుకోండి. ఏ పని చేసినా మన ముద్ర వేసినప్పుడే విజయం సాధించినట్టు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని