అరువు పిస్తోలు.. 20 స్వర్ణాలు!

కొన్ని క్రీడలకు ఆసక్తి, నైపుణ్యం మాత్రమే సరిపోవు. ఆర్థిక పరిస్థితీ సహకరించాలి. వాటిలో షూటింగ్‌ ఒకటి. లక్షలు పెట్టి పిస్తోల్‌, రైఫిల్‌.. కొనగలిగే వాళ్లే దీన్ని ఎంచుకునేది. కుటుంబ ఆర్థిక పరిస్థితి

Updated : 09 Sep 2022 07:56 IST

కొన్ని క్రీడలకు ఆసక్తి, నైపుణ్యం మాత్రమే సరిపోవు. ఆర్థిక పరిస్థితీ సహకరించాలి. వాటిలో షూటింగ్‌ ఒకటి. లక్షలు పెట్టి పిస్తోల్‌, రైఫిల్‌.. కొనగలిగే వాళ్లే దీన్ని ఎంచుకునేది. కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అయినా.. ఆటపైన ఇష్టంతో ధైర్యంగా అటువైపు వెళ్లింది టి.ఎస్‌.దివ్య. ప్రాక్టీసుకూ అష్టకష్టాలూ పడుతూనే జాతీయస్థాయిలో 20కిపైగా స్వర్ణపతకాలు సాధించింది. తన ప్రయాణం గురించి వసుంధరకు వివరించిందిలా!

డిగ్రీలో మా కాలేజీలోనే క్రీడల్లో శిక్షణ ఇస్తున్నా.. ఏ ఆట ఎంచుకోవాలో తెలియలేదు. కాలేజీ దార్లోనే షూటింగ్‌ అకాడమీ ఉందని తెలిసి వెళ్లి వివరాలు కనుక్కున్నా. అక్కడికి అందరూ కార్లలోనే వస్తుండటం చూస్తేనే అర్థమైంది అది డబ్బున్నవాళ్ల క్రీడని. స్పోర్ట్స్‌ పిస్తోలు కొనాలంటే లక్షకు పైమాటే. ఒక్కరోజు ప్రాక్టీసుకి బుల్లెట్‌ల కోసం రూ.2వేలు ఖర్చవుతుంది. అమ్మానాన్నలతో చెబితే.. ఏమీ మాట్లాడలేదు. వారి మౌనానికి కారణం మా ఆర్థిక పరిస్థితే. నా బాధ చూసి అన్నయ్య ప్రాక్టీసు వరకూ డబ్బు సర్దుతానని, అకాడమీలో మాట్లాడాడు. దాంతో ఎగిరి గంతేశా.

నాన్న సుబ్బరాజ్‌, అమ్మ గాయత్రి.. రిటైర్డ్‌ ఉద్యోగులు. మాది బెంగళూరు. క్రీడల్ని నాకు పరిచయం చేసింది అన్నయ్య రాజ్యవర్ధన్‌. తను ఎన్‌సీసీలో సాహస క్రీడల్లో పతకాలు సాధించేవాడు. దాంతో నాకూ ఆసక్తి కలిగింది. స్కూల్లో బాస్కెట్‌బాల్‌ ఆడేదాన్ని. ఎక్కువగా గాయాలయ్యేవి. ‘ఆడపిల్లకు ఆటలెందుకు’ అని అమ్మానాన్న వారించేవారు. గెలిస్తే మాత్రం అభినందించేవారు. బాస్కెట్‌ బాల్లో అంతర్జాతీయస్థాయిలో ఆడాలంటే ఓ వయసు వరకే అవకాశం. మధ్యలో గాయాలపాలైతే ఇక అంతే. కానీ ఒలింపిక్స్‌లో నలభై దాటినవాళ్లూ షూటింగ్‌లో కొనసాగడం చూశా. అయితే దాని గురించి అవగాహన లేదు. బీఏలో చేరాక షూటింగ్‌ గురించి ఎక్కువగా తెలుసుకున్నా.

క్లాసులు మానాల్సి వచ్చేది
అన్నయ్య ప్రైవేటు ఉద్యోగి. తనకూ ఇది మోయలేని భారమే. అయినా నా ఇష్టాన్ని చూసి కాదనలేకపోయాడు. అకాడమీలో అయితే చేరాను కానీ సొంత పిస్తోలు లేదు. దాంతో ఇబ్బందయ్యేది. శిక్షకులూ తమ పిస్తోళ్లను ప్రాక్టీసు తర్వాత తీసుకువెళ్లేవారు. నా ఆసక్తిని గమనించిన అకాడమీ అధ్యక్షులు మంజునాథ్‌ కొందరికి చెప్పి వాళ్ల పిస్తోళ్లని క్లబ్‌లోనే ఉంచమని ప్రాక్టీసుకి అవకాశమిచ్చేవారు. కొంతమంది అందుకు ఇష్టపడేవారు కాదు. అది బాధనిపించినా.. పట్టించుకోకుండా ప్రాక్టీసు మీదే దృష్టి పెట్టేదాన్ని. పిస్తోలు అందుబాటులో ఉన్నప్పుడే నా ప్రాక్టీస్‌.. దాంతో కొన్నిసార్లు కాలేజీలో క్లాసులకు వెళ్లలేకపోయేదాన్ని. 2017లో కర్ణాటక ఒలింపిక్‌ అసోసియేషన్‌ పోటీల్లో ఆడాలనుకున్నా. కానీ ప్రాక్టీసుకి పిస్తోలు దొరకలేదు. అలా నెల గడిచిపోయింది. పోటీలకు వెళ్లడం కష్టమేననుకున్నా. నా పరిస్థితి చూసి బంధువుల్లో ఒకరిని అన్నయ్యే  పిస్తోలు అడిగి తెచ్చాడు. పోటీలకు రెండ్రోజుల ముందు ప్రాక్టీసు చేసి స్వర్ణం సాధించటంతో పిస్తోలు ఇచ్చిన అంకుల్‌ ఆశ్చర్యపోయారు. అప్పట్నుంచీ పోటీలు ఎప్పుడున్నా నెల ముందుగా పిస్తోలు ఇస్తానని హామీ ఇచ్చారు. అలా 2020 వరకు 10మీ, 25మీ విభాగాల్లో 15 స్వర్ణాలు, నాలుగు ఛాంపియన్‌షిప్‌లు గెలుచుకున్నా. కేరళలో ఇండియన్‌ టీమ్‌ ట్రయల్స్‌, చెన్నైలో ఆల్‌ ఇండియా జి.బి.మౌలంకర్‌ ఛాంపియన్‌షిప్‌లలో రజతాలు సాధించా.


నాలుగో ర్యాంకు

కిలో బరువుండే పిస్తోలుని పట్టుకోవడం, ఏకాగ్రతతో లక్ష్యానికి గురిపెట్టడం.. నాకెప్పుడూ కష్టంగా అనిపించలేదు. కరోనా సమయంలో ఏడాది ప్రాక్టీసు లేకున్నా 2021లో మూడు నేషనల్‌ ఛాంపియన్‌షిప్‌లలో నాలుగు స్వర్ణాలు సాధించా. గత డిసెంబరులో నేషనల్‌ షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌ 25మీటర్ల సీనియర్‌ ఉమెన్‌ సివిలియన్‌ కేటగిరీలో, ఈ ఆగస్టులో భారత జాతీయ జట్టు ఎంపిక పోటీలు- టీ6 విభాగంలో స్వర్ణాలు గెలవడంతో జాతీయస్థాయిలో నాలుగో ర్యాంకు సాధించా. ఇప్పటికీ పోటీలంటే ఆటకంటే కూడా ఖర్చు గురించే నా భయం. ఎక్కడికి వెళ్లాలన్నా కనీసం రూ.50వేలు ఉండాల్సిందే. అమ్మానాన్నలకూ ఇబ్బందే. అయినా, గెలుస్తానన్న నమ్మకంతో నానా కష్టాలూ పడి సర్దుబాటు చేస్తున్నారు. ప్రస్తుతం ఎల్‌ఎల్‌ఎం చదువుతున్నా. అది పూర్తై న్యాయవాదిగా ప్రాక్టీసు ప్రారంభిస్తే సొంత పిస్తోలుతో మరింత ధైర్యంగా పోటీల్లో పాల్గొనగలను!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్