50 దేశాలకు తువాళ్లు, దుప్పట్లు!

తువాళ్లు, బెడ్‌షీట్ల రంగంలో అగ్రగామి సంస్థ వెల్‌స్పన్‌ గురించి మనదేశంలో కన్నా.. అమెరికా, చైనా, జపాన్‌ వాళ్లకే ఎక్కువ తెలుసు. అంతెందుకు... వింబుల్డన్‌, ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నీల్లో

Published : 12 Sep 2022 00:26 IST

తువాళ్లు, బెడ్‌షీట్ల రంగంలో అగ్రగామి సంస్థ వెల్‌స్పన్‌ గురించి మనదేశంలో కన్నా.. అమెరికా, చైనా, జపాన్‌ వాళ్లకే ఎక్కువ తెలుసు. అంతెందుకు... వింబుల్డన్‌, ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నీల్లో ఆటగాళ్ల కోసం అధికారికంగా ఉపయోగించే తువాళ్లు ఈ సంస్థవే! ఓ చిన్న టెక్స్‌టైల్‌ సంస్థని 50  దేశాల్లో విస్తరించి గ్లోబల్‌ లీడర్‌గా మార్చిన గొప్పతనం దీపాలీ గోయెంకాది..

పుట్టింది జైపుర్‌ మార్వాడి కుటుంబంలో. మహారాణి గాయత్రి దేవి స్కూల్లో పదో తరగతి వరకే చదువుకుంది. కుటుంబ సంప్రదాయం అంటూ 18 ఏళ్లకే పెళ్లి చేశారు. అలా ముంబయిలో అడుగుపెట్టింది దీపాలి. భర్త బీకే గోయెంకా వెల్‌స్పన్‌ అనే ఓ మోస్తరు టెక్స్‌టైల్‌ సంస్థకి యజమాని. తర్వాత ఇద్దరమ్మాయిలు రాధిక, వన్షిక. వాళ్లని చూసుకుంటూ వాళ్లతోపాటే ఆగిపోయిన తన చదువుని కొనసాగించి సైకాలజీలో డిగ్రీ పూర్తిచేసింది. వాళ్లకి కాస్త ఊహ తెలిశాక తనకి తీరిక, సమయం దొరికాయి. ‘మా అమ్మ ఉద్యోగిని. తను ఒక్క క్షణం కూడా వృథా చేసేది కాదు. అంతచక్కగా సమయాన్ని ఉపయోగించుకొనేది. ఆ అలవాటే నాకూ వచ్చింది. ఖాళీగా ఉండటం ఎందుకని మా ఆఫీస్‌కి వెళ్లాను. ‘ఇక్కడ నువ్వు శ్రీమతి గోయెంకావి కాదు. మామూలు ఉద్యోగివని గుర్తుంచుకో’ అన్నారు మావారు. ‘గోయెంకా భార్య కాబట్టి ఇక్కడ ఉంది. లేకపోతే ఈమెకి టెక్స్‌టైల్స్‌ గురించి ఏం తెలుసట’ అన్న తోటి ఉద్యోగుల మాటలు నన్ను ఆలోచింపచేశాయి. నిజమే నాకు ఈ వ్యాపారం గురించి ఏమీ తెలియదు. కాబట్టి... క్షేత్రస్థాయి నుంచే తెలుసుకోవాలనుకున్నా. పంపిణీదార్లూ, రీటైలర్లతో మాట్లాడేదాన్ని. బేరసారాలని గమనించేదాన్ని. మెషీన్ల వేగాన్ని అంచనా వేసేదాన్ని. ఇందుకోసం ఉదయాన్నే ట్రైన్‌ పట్టుకుని ఆఫీసుకొచ్చి.. మళ్లీ సాయంత్రం పిల్లలు ఇంటికి చేరుకొనే సమయానికి అక్కడ ఉండేదాన్ని. ఆఖరుగా నాకు అసలు పరిచయం లేని బ్యాలెన్స్‌ షీట్ల గురించి తెలుసుకున్నా. మా సంస్థ 1985లో ప్రారంభమయినా నేను 2003లో సీఈవోగా బాధ్యతలు తీసుకున్నా. హోమ్‌ ఫర్నిషింగ్‌ ఉత్పత్తులయిన దుప్పట్లు, తువాళ్లు వంటివాటిపై దృష్టిపెట్టి కొత్త ఉత్పాదనలు తీసుకొచ్చా. ఒక్కో తువాలు రూ.400 నుంచి రూ.800 అంటే ‘అమ్మో అంత ఖరీదా..’ అన్నవాళ్లే... నెమ్మదిగా టవల్స్‌ రంగంలో అగ్రగామిగా ఎదగడం చూశాక విమర్శలని వెనక్కి తీసుకున్నారు’ అనే దీపాలి ప్రజల అభిరుచులకు తగ్గట్టుగా భిన్నమైన బ్రాండ్లని మార్కెట్లోకి తీసుకొచ్చి వెల్‌స్పన్‌ని అంతర్జాతీయ సంస్థగా తీర్చిదిద్దారు. సంస్థ బాధ్యతలు చూసుకుంటూనే హార్వర్డ్‌ నుంచి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు కూడా చేశారు.

కొత్త ఉత్పత్తులు...
వీరి హైగ్రో బెడ్‌షీట్లు.. ఇవి గదిలో ఉష్ణోగ్రతని నియంత్రిస్తాయి. ఫ్లెక్సీ బెడ్‌షీట్‌లు.... మంచం సైజ్‌కి తగ్గట్టుగా ఒదిగిపోతాయి. స్విఫ్ట్‌ డ్రై టవల్‌... ఇవి తడిని 30 శాతం వేగంగా పీల్చుకుంటాయి. అలాగే స్పిన్‌టేల్స్‌, వెల్‌ట్రాక్‌ వంటి కొత్త బ్రాండ్లకి శ్రీకారం చుట్టారు. ఈ బ్రాండ్‌ తువాళ్లకి మొదటిసారిగా ఆగ్మెంటెడ్‌ రియాలిటీ టెక్నాలజీనీ జోడించి పేటెంట్లు తీసుకున్నారు. ఈ తువాళ్లని స్కాన్‌ చేస్తే అందులోని పాత్రలు కథలు చెబుతాయి. పిల్లల కోసం వీటిని తయారుచేశారు. ‘మా ఉత్పత్తుల తయారీకి కావాల్సిన కాటన్‌ని నేరుగా రైతుల నుంచే కొనడం మొదలుపెట్టాం. గుజరాత్‌లోని అంజర్‌, వాపీ ప్లాంట్లలో నీటిని రీసైక్లింగ్‌ చేసి వ్యవసాయానికి వాడుతున్నాం’ అనే దీపాలి 2016లో అతిపెద్ద సవాల్‌ని ఎదుర్కొన్నారు. బెడ్‌షీట్ల తయారీకోసం వాడిన పత్తి నాణ్యత లేదని వెనక్కి పంపించింది అమెరికా. దాంతో సంస్థ ఆదాయం సగానికి పైగా పడిపోయింది. అప్పుడే నిబ్బరంతో వ్యవహరించి.. వారం రోజుల పాటు అమెరికా అంతా తిరిగి క్లైంట్ల నమ్మకాన్ని కూడగట్టుకున్నారు. అమెరికా, ఇంగ్లాండ్‌, చైనా, జపాన్‌, న్యూజిలాండ్‌ సహా 50 దేశాల్లో ఈ ఉత్పత్తులు అమ్ముడవుతున్నాయి.


మహిళా ఉద్యోగులే.. విజయ రహస్యం!

‘నేను సంస్థలో చేరినప్పుడు ఆడవాళ్లు 7 శాతం ఉండేవారు. ప్రస్తుతం 23 శాతానికి చేర్చగలిగాను. మహిళలే మా సంస్థ విజయ రహస్యం. ఏ సంస్థ ఎదుగుదలకైనా ఐక్యూ ఒక్కటే సరిపోదు. ఈక్యూ కూడా అవసరం. ఈ విషయంలో మహిళా ఉద్యోగులు ముందుంటారు. మా పిల్లల్లో ఒకరు లోదుస్తుల తయారీ విభాగం చూస్తుండగా.. మరొకరు బ్రాండ్‌ మేనేజర్‌. ఏ పని చేసినా మనస్ఫూర్తిగా, ఇష్టంగా చేయమని వాళ్లకి చెబుతా. అయినా సరే వైఫల్యాలు పలకరిస్తున్నాయా? మరేం ఫర్వాలేదు. మనకూ టైమ్‌ వస్తుందని ఆశతో ఎదురుచూడమంటా’ అని విజయసూత్రాల్ని చెబుతున్నారు 52 ఏళ్ల దీపాలి.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని