ఈ అమ్మకు వందమంది పిల్లలు!

ప్రమీలమ్మా, పురుషోత్తం పెదనాన్న, కల్లూ బాబాయ్‌.. అక్కడున్న వంద మందినీ వరసలతో పలకరిస్తారామె. ఏ బంధమూ లేకపోయినా రక్తం పంచుకు పుట్టిన పిల్లల్నే మరిపించేలా వారికి ప్రేమను పంచుతారు. అమ్మా నాన్నల్నే భారంగా భావిస్తున్న పరిస్థితుల్లో ఎందరో వృద్ధుల్ని వీళ్లూ నా సొంత పిల్లలే అంటూ కంటికి రెప్పలా చూసుకుంటున్నారు మలినేని అరుణ. ఇదంతా ఎందుకు, ఎలా చేస్తున్నారో ఆవిడ మాటల్లోనే...

Updated : 13 Sep 2022 06:43 IST

ప్రమీలమ్మా, పురుషోత్తం పెదనాన్న, కల్లూ బాబాయ్‌.. అక్కడున్న వంద మందినీ వరసలతో పలకరిస్తారామె. ఏ బంధమూ లేకపోయినా రక్తం పంచుకు పుట్టిన పిల్లల్నే మరిపించేలా వారికి ప్రేమను పంచుతారు. అమ్మా నాన్నల్నే భారంగా భావిస్తున్న పరిస్థితుల్లో ఎందరో వృద్ధుల్ని వీళ్లూ నా సొంత పిల్లలే అంటూ కంటికి రెప్పలా చూసుకుంటున్నారు మలినేని అరుణ. ఇదంతా ఎందుకు, ఎలా చేస్తున్నారో ఆవిడ మాటల్లోనే...

మాది ఖమ్మం. పదో తరగతిలోనే పెళ్లి కావడంతో చదువు ఆపేశా. మావారు శ్యామసుందర్‌ ఆర్టీసీ కండక్టర్‌గా చేసేవారు. మాకిద్దరబ్బాయిలు... శివకిశోర్‌, వంశీకృష్ణ. స్నేహితురాళ్లూ, బంధువుల అమ్మాయిలూ.. ఉద్యోగాల్లో, ఇతర బాధ్యతల్లో ఉండటం చూసి నాకూ సమాజానికి ఏదో ఒకటి చేయాలని ఉండేది. 1991లో ఖమ్మంలో ‘ప్రియదర్శిని సేవా మండలి’ ఏర్పాటుచేసి రోడ్లపై కనిపించే దిక్కులేని వృద్ధులకు, అనాథలకు అన్నం పెట్టే దాన్ని. అప్పట్లో హెచ్‌ఐవీ తీవ్రత ఎక్కువగా ఉండేది. దానిపైనా, పౌష్టికాహారం పైనా అవగాహన కార్యక్రమాలు నిర్వహించే దాన్ని.

హైదరాబాద్‌ వచ్చినప్పుడల్లా రోడ్లపైన దిక్కూ మొక్కూ లేని వాళ్లు ఎక్కువగా కనిపించే వారు. వాళ్లనలా చూసినా, ఏమీ చేయలేని పరిస్థితి. మా వారితో హైదరాబాద్‌ వెళ్లి వృద్ధాశ్రమం ప్రారంభిస్తానంటే.. ‘పిల్లల చదువులు పూర్తయ్యాక చేద్దామ’న్నారు. చిన్నబ్బాయి ఇంజినీరింగ్‌ అవ్వగానే, అంటే 2011లో హైదరాబాద్‌లోని అమీన్‌పూర్‌లో ‘ది నెస్ట్‌- హోమ్‌ ఫర్‌ ది ఏజ్డ్‌’ (9440892317) స్థాపించా. మాది ఆర్థికంగా కలిగిన కుటుంబమేమీ కాదు. ఆయన జీతంతోనే ఇల్లు గడవాలి. అందులోనే మిగిల్చి సేవ కోసం కేటాయించేదాన్ని. కానీ ఆశ్రమమంటే చాలా ఖర్చు. ఉన్నంతలో చేస్తుంటే... ఎవరో ఒకరు తోడు వస్తారన్న ధైర్యంతో ముందడుగు వేశా. రోడ్లమీద దయనీయంగా కనిపించే వాళ్లంతా అనాథలు కాదు. కొందరు అందరూ ఉన్నా అనాథలుగా బతుకుతున్నారు. మాకు ఎవరు కనిపించినా, అలానే ఎవరూ లేరని ఎవరైనా తీసుకొచ్చినా చేరదీసి వారికో కుటుంబం ఉందన్న ధైర్యం ఇస్తా. పలకరింపు, వేళకు భోజనం, అవసరమైన వారికి వైద్యం.. ఇంతకంటే వారేమీ కోరుకోరు. ఆశ్రమంలో ప్రస్తుతం 100 మంది ఉన్నారు. వారంతా 60-100 మధ్య వయస్కులు. వీళ్లలో ఒక్కొక్కరిదీ ఒక్కో దీన గాథ. అయినా గతాన్ని మర్చిపోయి ఉన్నన్నాళ్లూ హాయిగా, సంతోషంగా గడిపేలా చూసుకుంటా. అనాథాశ్రమం అంటే.. 24 గంటల పర్యవేక్షణ అవసరం. వారి గాయాలైతే కట్లు కట్టాలి. వేళకు మందులు వేయాలి. సిబ్బంది లేనపుడు ఇవన్నీ మనమే చేయాలి. అందుకే రోజంతా ఆశ్రమంలోనే ఉంటా. మా ఇల్లు కూడా పక్కనే. ఏ కారణంతోనైనా నేను అందుబాటులో లేకపోతే అంతే బాధ్యతగా చూసుకునే వ్యక్తి కుటుంబంలో ఉండాలి. అందుకే పిల్లల్నీ చిన్నప్పట్నుంచీ నా కార్యక్రమాల్లో భాగం చేశా. కోడళ్లు నాగ మౌనిక, పద్మ తులసి మా ఇంట్లో అడుగు పెట్టే ముందే సేవా వారసులుగానూ ఉండాలన్న నియమం పెట్టా. వారూ అర్థం చేసుకుని పెద్ద మనసుతో అంగీకరించారు. మా వారు ఖమ్మంలో ఉద్యోగం చేస్తుంటే మేమంతా ఆశ్రమంలో ఉండే వాళ్లం.

ఇంట్లో అందరికీ పాజిటివ్‌..

కొవిడ్‌ సమయంలో మా వారూ హైదరాబాద్‌ వచ్చేశారు. ఇంట్లో అందరికీ కరోనా వచ్చింది. మేమంతా కోలుకున్నాం కానీ, ఆయన మాకు దూరమయ్యారు. ఎందరికో ధైర్యం చెబుతూ వచ్చిన నేను బాగా డీలా పడిపోయా. కుటుంబ, ఆశ్రమ సభ్యులు ధైర్యం చెప్పి మామూలు మనిషినయ్యేలా చేశారు. అప్పుడు ఆశ్రమంలోనూ 15 మందికి పాజిటివ్‌ వచ్చింది. ఎవరికీ ప్రాణహాని లేకుండా కాపాడుకోగలిగాం. ప్రస్తుతం చిన్నబ్బాయి నాతోపాటు ఆశ్రమాన్ని చూసుకుంటున్నాడ[ు. ఆశ్రమంలో ఇప్పటివరకూ 100 మందికి అంతిమ సంస్కారాలూ జరిపా. దీన్ని ప్రస్తుతం అద్దె ఇంట్లో నడుపుతున్నాం. నెలకు రూ.4-5 లక్షలు ఖర్చవుతుంది. 25 మందికి ప్రభుత్వ పింఛన్‌, నిర్వహణ కోసం కొంత మొత్తం అందుతుంది. కొందరు విరాళాలూ ఇస్తుంటారు. కొత్త వారిని చేర్చుకోవాలని ఉన్నా స్థలం సరిపోవడం లేదు. అందుకే ఈ కాలనీలోనే మాకున్న 400 గజాల స్థలంలో భవనం నిర్మించాలనుకుంటున్నాం. సొంత భవనం వస్తే ఖర్చు కూడా తగ్గుతుంది.

వృద్ధుల సేవలో మాకెంతో సంతృప్తి ఉంటుంది. పిల్లలు ఎలా ఇబ్బంది పెట్టేవారో వాళ్లు చెబుతుంటే గుండె తరుక్కు పోతుంది. కొందరైతే చివరి చూపులకీ రారు. ఎన్నో కష్టాలు పడి ప్రయోజకుల్ని చేసిన అమ్మానాన్నల్ని పిల్లలు ఎప్పటికీ మర్చిపోకూడదన్నదే ఈతరానికి నా సూచన.

- బోనకుర్తి విఠల్‌, హైదరాబాదు

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని