‘ఆటో’లోనూ... దీటుగా

ఇప్పటి వరకూ సేల్స్‌ అంటే చీరలు, అలంకరణ వస్తువుల షోరూముల్లోనే ఎక్కువగా అమ్మాయిలు కనిపించేవారు. కానీ పరిస్థితి మారిపోతోంది. ‘మగవాళ్లకే’ అనుకునే ఆటోమొబైల్‌లోనూ మన హవా ప్రారంభమైంది. ఆ... వాహనాల గురించి మనకేం తెలుసు అని కొట్టిపారేస్తున్నారా? సంస్థలలా భావించడం లేదు. ఒకరో ఇద్దరో కాదు.. ఏకంగా అన్ని విభాగాలూ మనమే నిర్వహించే ప్రత్యేక షోరూములనే ప్రారంభిస్తున్నాయి.

Published : 14 Sep 2022 00:52 IST

ఇప్పటి వరకూ సేల్స్‌ అంటే చీరలు, అలంకరణ వస్తువుల షోరూముల్లోనే ఎక్కువగా అమ్మాయిలు కనిపించేవారు. కానీ పరిస్థితి మారిపోతోంది. ‘మగవాళ్లకే’ అనుకునే ఆటోమొబైల్‌లోనూ మన హవా ప్రారంభమైంది. ఆ... వాహనాల గురించి మనకేం తెలుసు అని కొట్టిపారేస్తున్నారా? సంస్థలలా భావించడం లేదు. ఒకరో ఇద్దరో కాదు.. ఏకంగా అన్ని విభాగాలూ మనమే నిర్వహించే ప్రత్యేక షోరూములనే ప్రారంభిస్తున్నాయి. టాటా, ఫోక్స్‌వ్యాగన్‌, మహీంద్రా వంటి పెద్ద సంస్థలు మన ప్రతిభను గుర్తించాయి.

హైదరాబాద్‌లో టాటా..

ఈమధ్యే టాటా సంస్థ డీలర్‌ వెంకట రమణ మోటార్స్‌ హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ‘ఆల్‌ విమెన్‌ ప్యాసెంజర్‌ వెహికల్‌ షోరూం’ ప్రారంభించింది. దక్షిణాదిన ఇదే మొదటిది. ఈ షోరూంని 20 మంది మహిళలు నిర్వహిస్తున్నారు. వాహనం టెస్ట్‌ రైడ్‌, దాని గురించి వివరించడం, సంప్రదింపులు ఇలా అన్ని విషయాలూ ఇక్కడ అతివలే చూసుకుంటారు. అంటే.. సెక్యూరిటీ, వ్యాలె పార్కింగ్‌ నుంచి బ్యాక్‌ఎండ్‌, రిసెప్షన్‌, అకౌంట్స్‌, సేల్స్‌ మేనేజర్‌, బ్రాంచి మేనేజర్‌, డైరెక్టర్‌గా.. విభాగమేదైనా ఆడవాళ్లే కనిపిస్తారన్నమాట!

‘మహిళా సాధికారతను ఇక్కడ చేతల్లో చూపుతున్నా’మని సంస్థ డైరెక్టర్‌ డాక్టర్‌ సహృదయని చెబితే.. ‘రంగమేదైనా సవాళ్లు తప్పనిసరి. ఇందుకు ఆటోమోటివ్‌ పరిశ్రమా మినహాయింపు కాదు. నాకీ రంగంలో 12 ఏళ్ల అనుభవం. అన్నింటినీ దాటుకొని ముందుకు సాగుతున్నా’నంటారు బ్రాంచి మేనేజర్‌ నిరోష బండిరెడ్డి. ఉద్యోగులకు అదనపు సాంకేతికతతోపాటు వాహనాలు నడపడంలో శిక్షణ, డ్రైవింగ్‌ లైసెన్స్‌లనీ ఇప్పిస్తున్నారు. మానసిక స్థైర్యాన్ని పెంచేందుకు వారంలో రెండ్రోజులు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. వివాహితలకు కుటుంబాన్ని, ఉద్యోగాన్ని సమన్వయం చేసుకొనేందుకు వీలుగా రాత్రి 7.30 లోపు విధులు ముగించుకొనే వెసులుబాటు కల్పిస్తున్నారు.

జయపురలో ‘మహీంద్ర’

మహీంద్రా అండ్‌ మహీంద్రా కూడా ‘ఆల్‌ విమెన్‌ టీమ్‌’ బాట పట్టింది. అయితే ఇది ఆటోమొబైల్‌ సర్వీస్‌ వర్క్‌షాప్‌. ‘పింక్‌ కాలర్స్‌’ పేరుతో కోర్‌ విభాగాల్లో అమ్మాయిల ప్రాధాన్యం పెంచడానికి కృషి చేస్తోంది. జయపురలో ప్రారంభించిన ఈ వర్క్‌షాప్‌లో టెక్నీషియన్లు, సర్వీస్‌ అడ్వైజర్‌, డ్రైవర్లు, మేనేజర్‌, సెక్యూరిటీ అందరూ అమ్మాయిలే. ఈ సంస్థ ఐటీఐ లకు ప్రాధాన్యమిస్తోంది. వారికి పరిశ్రమ అనుభవం, ప్రాక్టికల్‌ పరిజ్ఞానాన్ని అనుభవజ్ఞుల శిక్షణలో అందిస్తున్నారు. పరిశ్రమ అవసరాలకు తగ్గట్టుగా వారిని సిద్ధం చేస్తున్నారు. ఆపై ప్రత్యేక రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌ నిర్వహించి మరీ అమ్మాయిలను ఎంచుకుంటున్నారు.

కోయంబత్తూరులో ఫోక్స్‌వ్యాగన్‌

‘ఆటోమోటివ్‌ రంగంపై ఆసక్తి, దానిలో ప్రతిభ చూపుతున్న వారెందరో! దాన్ని అందరికీ తెలియజెప్పాలన్నదే మా ప్రయత్నం’ అంటోంది ఫోక్స్‌వ్యాగన్‌. ఈ జర్మన్‌ సంస్థ కోయంబత్తూరులో తాజాగా పూర్తిగా మహిళా సిబ్బందే నిర్వహించే షోరూంను ప్రారంభించింది. ‘ఆటో’ పరిశ్రమలో భిన్నత్వాన్ని తేవాలనే ఈ నిర్ణయాన్ని తీసుకుందట. ఈ ‘ఆల్‌ విమెన్‌ షోరూమ్‌’లో 35 మంది మహిళలున్నారు. సెక్యూరిటీ, హౌజ్‌ కీపింగ్‌ దగ్గర్నుంచి మేనేజ్‌మెంట్‌ వరకూ అంతా ఆడవాళ్లే. పరిశ్రమలో మార్పులకు తగ్గట్టుగా తమ ఉద్యోగినులకు ‘అప్‌స్కిల్లింగ్‌’ సెషన్లనీ నిర్వహిస్తారట. అప్పుడే పోటీని తట్టుకుంటూ నాయకత్వ హోదాలను సమర్థంగా నిర్వహించగలుగుతారంటోంది యాజమాన్యం. చెన్నైలోని ఎలక్ట్రిక్‌ టూవీలర్స్‌ తయారీ సంస్థ ‘గ్రీవ్స్‌ మొబిలిటీ’లో పనిచేసే వారిలో 70% అమ్మాయిలే. ఫాక్స్‌కాన్‌ అనే ఎలక్ట్రిక్‌ వస్తువులు, వాహనాల ఫ్యాక్టరీలోనూ 80% మహిళలే సేవలందిస్తున్నారు.


మీపై మీకు నమ్మకం ఉంటే..
- గుమ్మి ఇందిరా రెడ్డి, వరుణ్‌ మోటార్స్‌, వనస్థలిపురం

నస్థలిపురంలోని వరుణ్‌ మోటార్స్‌లో రిలేషన్‌షిప్‌ మేనేజర్‌గా రెండేళ్ల నుంచి పనిచేస్తున్నా. వినియోగదారుల బడ్జెట్‌, అవసరం, ఆసక్తుల ఆధారంగా వాహనాలను సూచిస్తాం. మొదట నేను టీచర్‌ని. ఆసక్తితో ఇటువైపు వచ్చా. మూడు, నాలుగు నెలలు శిక్షణ తీసుకున్నా. ఆటోమొబైల్స్‌ పురుషాధిక్య రంగం. అమ్మాయిలూ దీనిపై ఆసక్తి చూపుతున్నారు. అమ్మాయిలనగానే ఆ వీళ్లకు ఏం తెలుస్తుందిలే అన్న భావన, నమ్మకం చూపకపోవడం సాధారణమే. నాకూ ఈతరహా అనుభవాలు ఎదురయ్యాయి. విషయ పరిజ్ఞానం, మనపై మనకు నమ్మకం, ఓపిక ఉంటే వీటిని ఎదుర్కోవడం తేలికే. ఎవరేమనుకున్నా ఫర్లేదు అనుకుంటూ ధైర్యంగా ముందుకెళ్లే వారికి అవకాశాలు ఎన్నో!


దీటుగా రాణిస్తున్నారు

- చంద్రశేఖర్‌, వైస్‌ ప్రెసిడెంట్‌, హెచ్‌.ఆర్‌., వరుణ్‌ మోటర్స్‌

న్ని రంగాల్లోనూ ఇప్పుడు ‘ఇంక్లూజివిటీ’ భావన పెరుగుతోంది. సాధారణంగా పరిశ్రమలో పది నుంచి పన్నెండు శాతం మహిళలు ఉంటారు. అయితే మేం మరో అడుగు ముందుకేశాం. రెండు తెలుగు రాష్ట్రాల్లోని మా షోరూముల్లో సుమారు 2800 మంది అమ్మాయిలు పని చేస్తున్నారు. ఇది మా మొత్తం సిబ్బందిలో దాదాపు 20 శాతం. ఆటోమొబైల్స్‌కి సంబంధిత అంశాల్ని నేర్చుకోవడంలో, విధుల్లో అమ్మాయిలు మగవాళ్లకు దీటుగా పని చేస్తున్నారు. మా సంస్థాగత పని తీరు పోటీల్లో బహుమతులు సాధించడంలోనూ ముందంజలోనే ఉంటున్నారు. ఆల్‌ విమెన్‌ షోరూమ్స్‌ అనేది వారిపై భరోసాకి, వారి దక్షతకు నిదర్శనం. ఈ రంగంలోకి వచ్చే అమ్మాయిల సంఖ్య పెరుగుతోంది. అవకాశాలూ అలానే ఉన్నాయి.

సహకారం: - బొందలపాటి దేవీప్రసాద్‌, హైదరాబాద్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని