దుర్గాదేవిని తీర్చిదిద్దుతోంది!

దుర్గా పూజ అనగానే కోల్‌కతానే గుర్తొస్తుంది. భారీగా, వినూత్నంగా ఉండే అక్కడి దేవీ విగ్రహాలు దసరా ఉత్సవాలకి ప్రత్యేక ఆకర్షణ. అలాంటి విగ్రహాలు తీర్చిదిద్దడంలో ‘చైనా పాల్‌’ది అందెవేసిన చేయి. ఆమె రూపొందించిన విగ్రహాలు దేశం నలుమూలలకూ వెళ్తుంటాయి కూడా.

Published : 15 Sep 2022 00:51 IST

దుర్గా పూజ అనగానే కోల్‌కతానే గుర్తొస్తుంది. భారీగా, వినూత్నంగా ఉండే అక్కడి దేవీ విగ్రహాలు దసరా ఉత్సవాలకి ప్రత్యేక ఆకర్షణ. అలాంటి విగ్రహాలు తీర్చిదిద్దడంలో ‘చైనా పాల్‌’ది అందెవేసిన చేయి. ఆమె రూపొందించిన విగ్రహాలు దేశం నలుమూలలకూ వెళ్తుంటాయి కూడా.

చైనా పాల్‌.. పేరేంటి భిన్నంగా ఉందనుకుంటున్నారా? అవును, ఆమె గురించి చెప్పాలంటే పేరుతోనే మొదలుపెట్టాలి. ఈమె పుట్టి పెరిగింది కోల్‌కతాలోనే. అమ్మా నాన్నలకు ఆరో సంతానం. అప్పటికే ముగ్గురు ఆడపిల్లలు ఉండటంతో ఈమెకు చాహ్‌నా (కోరుకోని) అని పేరు పెట్టారు. చాహ్‌నా కాస్త వాడుకలో చైనా అయిపోయింది. పేరే కాదు, ఆమె పని కూడా భిన్నంగా ఉంటుందని పేరు. దసరాకి ఈమె తయారుచేసే విగ్రహాలు ఒడిశా, మధ్యప్రదేశ్‌, కశ్మీర్‌ కూడా వెళ్తుంటాయి. అమెరికా నుంచీ ఈ సంవత్సరం ఓ విగ్రహం ఆర్డరు వచ్చినా సమయాభావంవల్ల చేయలేకపోయిందట.

కుటుంబం వద్దన్నా...
చైనా పాల్‌ ఉండేది కోల్‌కతాలో విగ్రహ తయారీకి ప్రఖ్యాతి చెందిన కుమరతులి ప్రాంతంలో. ఈమె తండ్రి అక్కడే విగ్రహాలు తయారుచేసేవారు. చిన్నప్పట్నుంచీ విగ్రహాల తయారీ అంటే ఆసక్తి. కానీ ప్రోత్సాహం ఉండేది కాదు. ఆయన మధ్యాహ్న భోజనానికి వెళ్లినప్పుడు, ఆరోగ్యం బాగాలేక ఇంటి దగ్గర ఉన్నపుడు తండ్రి నడిపే వర్క్‌ షాప్‌కి వెళ్లి విగ్రహ తయారీని గమనించేది. తనకు 16 ఏళ్ల వయసులో తండ్రి అనారోగ్యంతో చనిపోవడంతో వర్క్‌షాపు బాధ్యతను చేపట్టింది. ‘అప్పటికి రెండు విగ్రహాల పని అసంపూర్తిగా ఉంది. పనివాళ్లు నా మాటను ఖాతరు చేసేవారు కాదు. వస్తున్నాం అని చెప్పి రాకపోవడం, వచ్చినా అటూ ఇటూ వెళ్లేవారు. మా బంధువు సాయంతో వాటిని పూర్తిచేశా. రూ.3000 లాభం వచ్చింది. అదే పెట్టుబడిగా పనిచేయడం మొదలుపెట్టా. కుటుంబ బాధ్యతనీ తీసుకున్నా’ అని చెబుతుందీమె.

అమ్మాయి కావడంతో మొదట్లో వివక్షను ఎదుర్కొంది. ‘ఎన్నాళ్లు చేస్తుందో చూద్దామని చుట్టూ ఉన్నవాళ్లు అనుకునేవారు. బంధువులూ అభ్యంతరం చెప్పేవారు. నేను మాత్రం ఇక్కడే ఉండాలనుకున్నా. ఇంటి దగ్గర పనులన్నీ ముగించుకుని ఎనిమిదింటికే వచ్చేదాన్ని. నాన్న దగ్గరకు ఏటా వచ్చే కస్టమర్లతోపాటు కొత్త వాళ్లనూ పెంచుకుంటూ వచ్చా’ అంటూ ఈ రంగంలో తన తొలి రోజుల్ని గుర్తు చేసుకుంటుంది. ప్రస్తుతం ఏటా 40 భారీ విగ్రహాల్ని రూపొందిస్తారీమె. ఎప్పటికప్పుడు కొత్తదనం తెస్తారు. చైనాపాల్‌.ఇన్‌ వెబ్‌సైట్‌నీ తెచ్చారు. కుటుంబ, వృత్తి బాధ్యతల్లో పడి పెళ్లి చేసుకోలేదు 44 ఏళ్ల చైనా. 90 ఏళ్ల తల్లినిప్పుడు తనే చూసుకుంటోంది. 2018లో చైనాలో ఓ ఆర్ట్‌ ఫెస్టివల్‌కు హాజరై మట్టితో భారీ విగ్రహాల తయారీని వివరించడంతో పాటు, వివిధ దేశాల విగ్రహ తయారీ పద్ధతుల్ని తెలుసుకుంది. ఫైబర్‌ గ్లాస్‌తోనూ విగ్రహాలు రూపొందించి విదేశాలకు ఎగుమతి చేస్తోంది. చైనా పాల్‌ స్ఫూర్తితో కాంచీ పాల్‌, మాలా పాల్‌, కకోలీపాల్‌ లాంటివారూ ఈ రంగంలో తమ ప్రత్యేకతను చాటుతున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని