ఆ యాసే... లక్షల అభిమానుల్నిచ్చింది

అమ్మాయేమో రాయలసీమ బిడ్డ. కుర్రాడిదేమో గుంటూరు. ఇద్దరికీ పెళ్లైంది. ఆ ఇద్దరి యాసల మధ్య తేడాలతో తిప్పలుంటాయి చూశారూ! చూసేవారికి మాత్రం బోలెడు కామెడీ. దాన్నే తన యూట్యూబ్‌ ఛానెల్‌ ద్వారా పంచుకొని లక్షల మంది

Updated : 17 Sep 2022 07:30 IST

అమ్మాయేమో రాయలసీమ బిడ్డ. కుర్రాడిదేమో గుంటూరు. ఇద్దరికీ పెళ్లైంది. ఆ ఇద్దరి యాసల మధ్య తేడాలతో తిప్పలుంటాయి చూశారూ! చూసేవారికి మాత్రం బోలెడు కామెడీ. దాన్నే తన యూట్యూబ్‌ ఛానెల్‌ ద్వారా పంచుకొని లక్షల మంది అభిమానులను సంపాదించుకుంది అఖిల వీరమాసు. వసుంధర పలకరించగా తమ ప్రయాణాన్ని చెప్పుకొచ్చిందిలా..

మాది కర్నూలు దగ్గర నంద్యాల. నాన్న రమేష్‌ బాబు, అమ్మ నిర్మల.. ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులు. పదోతరగతి వరకూ అక్కడే చదివా. డిగ్రీ, ఎంబీఏ బెంగళూరులో చేశా. కొన్నాళ్లు ఉద్యోగమూ చేశా. మా వారు మార్టిన్‌ది గుంటూరు. అందరూ ప్రేమ వివాహం అనుకుంటారు కానీ.. మాది పెద్దలు కుదిర్చిన పెళ్లే. తనకు అమెరికాలో ఉద్యోగం. పెళ్లయ్యాక నేనూ అక్కడికి వెళ్లిపోయా. నాకు మొదట్నుంచీ యూట్యూబ్‌ అంటే చాలా ఇష్టం. అందులో ఎన్నో నేర్చుకోవచ్చు కదా.. అందుకని! నాకూ సొంత ఛానెల్‌ ప్రారంభించాలని కోరిక. నాకూ, మా వారికి పర్యటనలంటే ఇష్టం. మా ప్రత్యేక సందర్భాల్నీ ఫొటోలు, వీడియోలు తీస్తుంటాం. అలాంటివన్నీ కొంచెం ప్రత్యేకంగా వీడియోలుగా చేసి పెడదామనుకున్నా. భవిష్యత్తులో చూసుకోవడానికీ సులువుగా ఉంటుందన్నది నా ఉద్దేశం. పైగా మా పాప ఐరావీ పెట్టొచ్చు, తనకీ పెద్దయ్యాక మధుర జ్ఞాపకాలుగా ఉంటాయనిపించి 2021 జనవరిలో ఛానెల్‌ ప్రారంభించాం.

మా సంభాషణలే..
ప్రత్యేక వంటలు, మా ప్రయాణాలు, అమెరికాలో మా జీవనశైలి, ఆరోగ్య - సౌందర్య చిట్కాలు.. ఇలా పెట్టుకుంటూ వచ్చా. మా వీడియోలకు కొంచెం ఎంటర్‌టైన్‌మెంట్‌ కూడా జోడిద్దాం అనుకున్నాం. నాకు, మావారికి మధ్య వాదన, చర్చ ఏదొచ్చినా.. ఈ యాసల తికమక వస్తుంది. దాన్ని చూసి స్నేహితులు తెగ నవ్వుకునే వారు. దీన్నే ఎందుకు ప్రయత్నించకూడదు అనుకున్నా. ఛానెల్‌ పేరూ ‘రాయలసీమ అమ్మాయి, ఆంధ్రా అబ్బాయి’ అని పెట్టాం. సొట్టలు బిట్టలు- వంకర టింకర, ఉర్లగడ్డ- బంగాళా దుంప, తోలుకుపోవడం- తీసుకుపోవడం, మొటిక్కాయలు- గోరు చిక్కుడు, బుడ్డపప్పులు- వేరుశెనగ, బీగం- గొళ్లెం, పదైదు- పదిహేను.. ఇలా ఒక పదాన్నే వేర్వేరు చోట్ల ఎలా మాట్లాడతారన్నది ఒక సందర్భం ఆధారంగా చిన్న సరదా వీడియోగా తీసుకొచ్చే వాళ్లం. మా సంభాషణలు, రోజు వారీ మాటల్నే వీడియోలుగా పెడుతూ వచ్చాం. దాదాపు అన్నింటికీ కనీసం 10 లక్షల వీక్షణలొచ్చేవి.

పట్టించుకోవడం మానేశా..
సబ్‌స్క్రైబర్స్‌ వెయ్యికి చేరడానికి అయిదు నెలలు పట్టింది. ఏడాదిన్నరకి ఆ సంఖ్య దాదాపు 4 లక్షలకు చేరింది. ఇప్పుడు మా ఛానల్‌కు 25 కోట్లకుపైగా వీక్షణలున్నాయి. ఇది నాలో ఆత్మవిశ్వాసాన్నీ నింపింది. ‘మా యాసను చూసి నవ్వుతారేమోనని స్కూలు, కాలేజీల్లో జాగ్రత్తగా మాట్లాడతాం. మీవల్ల చాలా పదాలు పాపులర్‌ అయ్యాయి. మీ వీడియోలు చూశాక చాలా బాగా అనిపిస్తోంది, మా చిన్నతనం గుర్తొచ్చింది’ ఇలా చాలా కామెంట్లు వస్తాయి. కొంతమంది తెలంగాణ భాషలోనూ చేయొచ్చుగా అనడుగుతుంటారు. ప్రాంతీయ భేదాలు వస్తాయన్న ఉద్దేశంతో ఛానెల్‌ పేరునీ ‘దట్‌ తెలుగు ఫ్యామిలీ వ్లాగ్స్‌’గా మార్చాం. నేను ఇష్టపడి చూసే ప్రముఖ యూట్యూబర్ల నుంచీ కూడా అభినందనలు అందుకున్నప్పుడు చాలా సంతోషమేసింది. మొదట్నుంచీ సంఖ్యకంటే బాగా నవ్వించేవీ, ఉపయోగపడే సమాచారాన్నే పెట్టాలనుకున్నాం. అందుకే కొత్తగా అమెరికా వచ్చే వాళ్లకి పనికొచ్చే వాటినీ చేస్తున్నాం. వారానికి ఇన్ని అనీ అనుకోలేదు. పైగా మార్టిన్‌కి ఉద్యోగం, నాకు పాపతో సరిపోతుంది. మంచి ఆలోచన వచ్చినప్పుడే చేసి పెడుతుంటా. మాకూ విమర్శలు వస్తుంటాయి. కాకపోతే ఎక్కువని చెప్పలేను కానీ మొదట్లో బాధపడ్డా. తర్వాత పట్టించు కోవడం మానేశా. ఇప్పుడు చాలా మంది గుర్తుపట్టి సెల్ఫీలు అడుగుతున్నారు. ఊర్లో మా అమ్మానాన్నల్నీ పలకరిస్తున్నారట. వ్యాపార ప్రకటనల కోసం సంప్రదిస్తుంటారు కానీ ఆసక్తి లేక ఒప్పుకోలేదు. ఈ మధ్య ‘రంగరంగ వైభవంగా’ చిత్రబృందం సంప్రదించింది. స్టార్లతో పని చేసే అవకాశం రావడం నమ్మలేక పోయా. ఇన్‌స్టాలో లైవ్‌ ద్వారా ఆ సినిమా ప్రచారంలో భాగమయ్యాం. వైష్ణవ్‌ తేజ్‌, కేతిక శర్మతో చేసిన ఈ కార్యక్రమానికి చాలా మంచి స్పందన వచ్చింది.

మన మీద మనకు నమ్మకం ఉండి, నచ్చినదాన్ని చేసుకుంటూ వెళితే ఇలాంటి గుర్తింపే వస్తుంది. ఎవరైనా సలహా అడిగినా ఇదే చెబుతా. ఒకరిని అనుసరించొద్దు, పోల్చుకోవద్దు... నచ్చింది చేసుకుంటూ వెళ్లమని! పది లక్షల ఫాలోయర్లను చేరుకోవాలన్నది నా కల.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్