పల్సర్ బైక్ పాట.. ఇద్దరిని నిలబెట్టింది
ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్.. అంటూ అవకాశం కోసం ఎదురు చూసే వారెందరో! వీళ్లిద్దరికీ అది ‘పల్సర్ బైక్’ పాటతో వచ్చింది. దివ్యజ్యోతి దాన్ని పాడి, ఝాన్సీ దానికి నర్తించి గుర్తింపు
ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్.. అంటూ అవకాశం కోసం ఎదురు చూసే వారెందరో! వీళ్లిద్దరికీ అది ‘పల్సర్ బైక్’ పాటతో వచ్చింది. దివ్యజ్యోతి దాన్ని పాడి, ఝాన్సీ దానికి నర్తించి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈటీవీలో ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీలో ప్రదర్శించగా అది వాళ్ల జీవితాల్నే మార్చేసింది. అవకాశాలు వాళ్ల తలుపు తడుతున్నాయి. దాని వెనక ఎన్నో కష్టాలు, కన్నీళ్లు, ఎన్నో ఏళ్ల శ్రమా ఉంది. వాళ్ల స్ఫూర్తి గాథల్ని వసుంధరతో పంచుకున్నారు.
హౌస్ కీపర్‌గా చేసి..
నాన్నను అనుకరిస్తూ పాటలపై ఇష్టం పెంచుకుంది. సింగర్‌గా ఎదగాలని కలలు కని హైదరాబాద్ చేరుకుంది. దాన్ని సాధించడం అనుకున్నంత సులువు కాదని అర్థమవ్వడానికి దివ్యజ్యోతికి ఎంతో కాలం పట్టలేదు. ఆ బాధలో అనుకోకుండా పాడిన పాట ఆమెకు అవకాశాల్ని తెచ్చిపెట్టింది.
‘సంతోషం, బాధ, దుఃఖం.. ఏదైనా నాకు గుర్తొచ్చేది పాటే. పని అలసట మర్చిపోవడానికి నాన్న పాడే పాటల్నే నేనూ అనుకరిస్తూ వచ్చా. శిక్షణ తీసుకోకపోయినా పరిస్థితికి తగ్గట్టుగా పాట కట్టేసేదాన్ని. గొంతు బాగుండటంతో చుట్టుపక్కల గ్రామాల్లో సాంస్కృతిక కార్యక్రమాల్లో పాడే అవకాశమిచ్చేవారు. పెళ్లయ్యాక ఆ అవకాశమూ లేదు. ఇద్దరు పిల్లలు. మా ఆయన రాజు వ్యవసాయ కూలీ. పదేళ్ల క్రితం టీవీలో పాటలపోటీ ప్రకటన చూసి, నిరూపించుకోవాలన్న కోరిక కలిగింది. మాది కరీంనగర్ జిల్లాలోని నర్సింగాపూర్. ఆయన్ని ఒప్పించి, పిల్లలతో సహా హైదరాబాద్ వచ్చేశా. ఆడిషన్‌లోనూ పాల్గొన్నా. న్యాయనిర్ణేతలు లేచి నిల్చొని చప్పట్లతో అభినందిస్తే అవకాశం ఖాయమనుకున్నా. కానీ నా ఫోన్ పోయింది. ఎంపికయ్యానన్న సమాచారం కోసం ఎదురుచూస్తోన్న నాకది పెద్ద దెబ్బే. కూలీ చేస్తే వచ్చిన డబ్బులే ఆధారం కొత్త ఫోనేం కొనగలను? సినిమా వాళ్లని కలవొచ్చని బ్యుటీషియన్‌గా, తర్వాత ఓ టీవీ ఛానెల్‌లో హౌస్‌కీపర్‌గా చేరా. ఇంతలో మా ఆయన పని చేసేచోట పడిపోయాడు. తలకి పెద్ద గాయమైంది. బతకడం కష్టమన్నారు. ఊరికి తీసుకెళ్లి ఏడాదిపాటు జాగ్రత్తగా చూసుకుంటే కానీ ఆయన మాకు దక్కలేదు. మళ్లీ హైదరాబాద్ వచ్చి హౌస్‌కీపర్‌గా చేరా. ఈసారి సినిమాల్లో చిన్నపాత్రలు, డబ్బింగ్ అవకాలొచ్చాయి. మావారికి మళ్లీ ప్రమాదంలో కాలు విరిగింది. ఇల్లు గడవడమే భారమవ్వడంతో ఇక పాటపై ఆశలు వదులుకొన్నా. ఓసారి ఆఫీసులో పనిచేస్తూ పాట పాడుకుంటున్నా. ఛానెల్‌కి వచ్చిన నటి దాన్ని వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తే వైరలైంది. సినీతారల నుంచి అభినందనలతోపాటు యూట్యూబ్‌లో పాడే అవకాశాలొచ్చాయి. నా పాటలకు లక్షల్లో వీక్షణలు. ‘పల్సర్ బైక్’ పాటకి కోటికిపైగా వ్యూస్. తెలంగాణ ఆర్టీసీ కోసం ప్రచార గీతాల్ని పాడించారు. రఘు కుంచె సంగీత దర్శకత్వంలోనూ పాడా. ఆ పాటతో నా కల నెరవేరింది. ఇన్నేళ్ల నా కోరిక, తపనే ఈ గుర్తింపు తెచ్చిపెట్టాయనిపిస్తుంది’.
- చిప్ప సాయికిరణ్, హైదరాబాద్
నాన్న వదిలేస్తే.. కళ ఆదుకుంది
తరగతిలో శ్రద్ధగా పాఠం వింటోంటే.. ‘నీ కోసం మీ నాన్న వచ్చార’ని కబురు. పెదాలపై చిరునవ్వు, చేతిలో స్వీట్లతో ఉన్న ఆయన్ని వాటేసుకొని ‘ఇంటికొచ్చేయ్ నాన్నా.. అమ్మ ఏడుస్తోంది. ప్లీజ్’ అంటూ కన్నీళ్లు పెట్టుకొంది. ఆయనేమో ‘అయితే నాకో సాయం చేస్తావా మరి’ అనడిగాడు. సరేనన్న తనతో ‘నేను నీ తండ్రిని కాదని రేపు కోర్టులో చెప్పాల’న్న తండ్రి మాటకి ప్రేమగా పెనవేసుకున్న ఆ అమ్మాయి చేతుల్ని అప్రయత్నంగానే వదిలేసింది. కుటుంబాన్ని రోడ్డున పడేసిన నాన్న స్థానంలో నిలబడి.. అమ్మను, తమ్ముడ్ని సాకింది. ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ కార్యక్రమంలో ‘పల్సర్ బైక్’ పాటతో దుమ్మురేపిన ఆర్టీసీ కండక్టర్ ఝాన్సీ కథ ఇది.
‘అమ్మ ప్రేమించి పెళ్లి చేసుకుందని అమ్మమ్మవాళ్లు దూరం పెట్టారు. నాన్న కానిస్టేబుల్. నేను, తమ్ముడు పుట్టాక.. నాన్నకు అప్పటికే పెళ్లై ముగ్గురు పిల్లలున్నారని అమ్మకు తెలిసింది. నిలదీయడంతో మమ్మల్నీ వదిలేశాడు. కోర్టులు, కేసులు అంటూ తిరగడంతో నా చదువు దెబ్బతింది. కూరగాయల దుకాణం పెట్టుకొని అమ్మ మమ్మల్ని సాకేది. నాకు 14 ఏళ్లున్నప్పుడు ఓసారి స్టేజ్ మీద డ్యాన్స్ చేసే అవకాశమొచ్చింది. అదయ్యాక నిర్వాహకులు చేతిలో రూ.150 పెట్టారు. వాటిని చూసి సంతోషంతో ఏడుపొచ్చేసింది! కష్టమో నష్టమో ఇదే కొనసాగిద్దామని నిర్ణయించుకున్నా. అలా 15 ఏళ్లుగా డ్యాన్స్ చేస్తున్నా. ఇంటర్ వరకే చదివా. తమ్ముణ్ని ఎంబీఏ చదివించా. తనిప్పుడు ఓ ప్రైవేటు సంస్థలో హెచ్‌ఆర్. మాది ప్రేమ పెళ్లి. ఆయనతోపాటు మా బాబు, పాపకీ నా డ్యాన్సంటే ఇష్టం. బాబు పుట్టాక ఆర్టీసీ కండక్టర్‌గా ఉద్యోగమొచ్చింది. డిపో అధికారులు, సిబ్బంది సాయంతో ఉద్యోగం, ప్రదర్శనలు రెండూ చేయగలుగుతున్నా. నా ప్రయాణంలో ఎన్నో అవమానాలు, ఇబ్బందులు. అయినా డ్యాన్స్‌ను విడిచిపెట్టలేదు. 16 మందితో కూడిన బృందం మాది. అందరూ దీనిపైనే ఆధారపడ్డారు. నా వృత్తిని దైవంగా భావిస్తా. ఒక్క ‘పల్సర్ బైక్’తో ఇంత పేరు రావడం చాలా ఆనందంగా ఉంది’.
- చంద్రమౌళిక సాపిరెడ్డి, విశాఖపట్నం.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.