బెల్లం వంటకాలతో.. కోటి వ్యాపారం!

పౌష్టికాహారం గొప్పతనం తెలిసినా.. వాటిని తయారుచేసుకొనే తీరిక, ఓపిక నేటితరం మహిళలకి ఉండటం లేదు. అలాగని బజారులో దొరికేవన్నీ నాణ్యమైనవే అని చెప్పలేం. మార్కెట్లో ఉన్న ఈ అవసరాన్ని గుర్తించి సేంద్రియ బెల్లంతో.. ఆరోగ్యకరమైన చిరుతిళ్లు తయారుచేస్తూ కోటిరూపాయల  టర్నోవర్‌తో విజయపథంలో

Updated : 19 Sep 2022 07:34 IST

పౌష్టికాహారం గొప్పతనం తెలిసినా.. వాటిని తయారుచేసుకొనే తీరిక, ఓపిక నేటితరం మహిళలకి ఉండటం లేదు. అలాగని బజారులో దొరికేవన్నీ నాణ్యమైనవే అని చెప్పలేం. మార్కెట్లో ఉన్న ఈ అవసరాన్ని గుర్తించి సేంద్రియ బెల్లంతో.. ఆరోగ్యకరమైన చిరుతిళ్లు తయారుచేస్తూ కోటిరూపాయల  టర్నోవర్‌తో విజయపథంలో నడుస్తున్నారు విశాఖపట్నానికి చెందిన శిలపరశెట్టి గౌరీ సుజాత..

టీచర్‌గా తన కెరియర్‌ని మొదలుపెట్టిన సుజాత... వ్యాపారవేత్తగా బలపడటానికి కారణం కొవిడ్‌ అంటే ఆశ్చర్యంగా ఉంటుంది. ఎన్నో వ్యాపారాలకు గడ్డు రోజులు తెచ్చిన కొవిడ్‌ సుజాతకి మాత్రం విజయాన్ని అందించింది. అదెలాగంటే.. అనకాపల్లి అంటే టక్కున గుర్తుకొచ్చేది రుచికరమైన బెల్లం. అక్కడ తయారైన బెల్లాన్ని ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే కుటుంబాల్లో  సుజాత కుటుంబం కూడా ఒకటి. అనకాపల్లి బెల్లం మార్కెట్‌లో వాళ్లకో దుకాణం ఉంది. చెరకు దిగుబడులు తగ్గడంతో వాళ్ల వ్యాపారం కూడా ఢీలా పడింది. దాంతో ఆరోగ్యప్రియులని ఆకర్షించేందుకు రసాయనాల్లేకుండా సేంద్రియ ఎరువులతో పంట పండించారు సుజాత భర్త. అయినా వ్యాపారంలో పెద్ద మార్పేం రాలేదు. ‘ఆధునిక అవసరాలకు అనుగుణంగా మార్పులు చేస్తే తప్ప వ్యాపారం నిలబడదనుకున్నా. అందుకే బెల్లాన్ని దిమ్మల రూపంలో కాకుండా.. దాన్ని పౌష్టికాహారంగా మార్చి అమ్మాలకున్నా. అప్పటి వరకు ఓ ప్రైవేటు బడిలో టీచర్‌గా పనిచేసేదాన్ని. టీచర్‌గా పిల్లలు, గర్భిణిలు, బాలింతల్లో.. పోషకాహార లోపం గురించి నాక్కొంత అవగాహన ఉంది. అందుకే  సేంద్రియ బెల్లంతో వాళ్లు తినేందుకు అవసరం అయిన.. కొబ్బరి ఉండలు, సున్నుండలు, అరిసెలు వంటి చిరుతిళ్లు తయారీ మొదలుపెట్టా. రూ.10 వేల పెట్టుబడితో మార్కెటింగ్‌ మొదలుపెట్టా. వీటిని సూపర్‌ బజార్లు, డిపార్డుమెంటల్‌ స్టోర్లకు తీసుకెళ్తే... చాలామంది ‘వీటినెవరు కొంటారండి?’ అన్నారు మొహంపైనే. కొంతమంది మొహమాటానికి.. స్టాక్‌ తీసుకున్నా వారం తిరక్కుండానే వెనక్కి పంపించేశారు. ఎందుకిలా అవుతోందని ఆరా తీశా. నేనే స్వయంగా వెళ్లి సూపర్‌ బజార్‌, మాల్స్‌ ముందు నిలబడి వచ్చిపోయే వారికి మా ఉత్పత్తులను ఉచితంగా రుచి చూపించి, నచ్చితేనే తీసుకోండనేదాన్ని. నష్టాలు వచ్చినా కొన్నిరోజులు అలానే ప్రచారం చేశా. నా శ్రమ వృథా కాలేదు. వినియోగదారులు మా బ్రాండ్‌ గురించి ఆరా తీయడం మొదలుపెట్టారు. నెమ్మదిగా మాల్స్‌, ఆర్గానిక్‌ స్టోర్లు ఆర్డర్లు పెంచాయి. అది సరిపోదనిపించి.. ఎక్కడ ఫుడ్‌ ఫెస్టివల్స్‌ జరిగినా అక్కడికి వెళ్లి పాల్గొన్నేదాన్ని. డీఆర్‌డీఏ తరఫున ప్రభుత్వ వేడుకల్లో స్టాల్స్‌ పెట్టేదాన్ని. దీంతో పొదుపు సంఘాల ద్వారా వ్యాపార విస్తరణకు రుణం దొరికింది. లోన్‌ తీసుకుని.. ‘క్యూ వన్‌ ఇంటర్నేషనల్‌ ఆగ్రో ఫుడ్స్‌’ పేరిట కుటీర పరిశ్రమను ఏర్పాటుచేసి.. ‘అనకాపల్లి బెల్లం రుచులు’ పేరుతో పప్పుండలు, కొబ్బరి ఉండలు, అరిసెలు, సిమ్మిలి, పాకుండలు, మినప సున్నండలు, రాగి, ఉలవ, అవిశ లడ్డూలు.. ఇలా సేంద్రియ పదార్థాలతో చేసిన 40 రకాల పౌష్టికాహారాలను తయారుచేస్తున్నా. తయారీ, నాణ్యత నా బాధ్యత అయితే మార్కెటింగ్‌ మావారు శ్రీనివాసరావు చూస్తున్నారు’ అంటూ వ్యాపారాన్ని విస్తరించిన విధానం గురించి చెప్పుకొచ్చారు సుజాత.

కొవిడ్‌తో డిమాండ్‌..

కొవిడ్‌ కారణంగా ఎన్నో వ్యాపారాలు నష్టపోయాయి. కాని అదే మా వ్యాపారానికి దారిచూపింది అంటారు సుజాత. ‘మా ఉత్పత్తులన్నీ వ్యాధినిరోధక శక్తి ఉన్నవి కావడంతో కొవిడ్‌ సమయంలో ఎక్కువ వ్యాపారం జరిగింది. స్థానికంగా అమ్మకాలు పది రెట్లు పెరిగాయి. అలాగే దిల్లీలోని ఆంధ్రాభవన్‌, తెలంగాణ భవన్‌ సమీపంలోని స్టోర్లలో, పలు విశ్వవిద్యాలయాల క్యాంటిన్లలలోనూ, ప్రధాన నగరాల్లోని స్టోర్లలో మా ఉత్పత్తుల్ని ఉంచాం. దేశవ్యాప్తంగా మా ఉత్పత్తులకు ఆదరణ పెరగడంతో ఇప్పుడు రోజుకి యాభైవేల రూపాయల సరకు కూడా అమ్ముతున్నాం. ఒకప్పుడు నెలకి రూ. 50వేలు అమ్మడం కష్టమయ్యేది. ప్రస్తుతం మా యూనిట్‌లో 26 మంది మహిళలకు పని కల్పించాం. ప్యాకింగ్‌లోనూ పర్యావరణ హితంగా ఉండాలనుకున్నాం. అందుకే అరిక ఆకుతో తయారు చేసిన ప్లేట్లను వినియోగిస్తుంటాం. వెదురు బుట్టలు, మట్టి కుండలను కూడా ప్యాకింగ్‌కోసం వాడుతున్నాం. దీనివల్ల చేతివృత్తులవారికి కూడా పని కల్పించగలుగుతున్నాం. కొవిడ్‌ సమయంలో ప్రజల ఆరోగ్యానికి మేలు చేసే ఉత్పత్తులని అందించినందుకు పలు పురస్కారాల్నీ అందుకున్నాం. రూ.10 వేల పెట్టుబడితో మొదలైన మా వ్యాపారం నేడు రూ.కోటి వార్షిక టర్నోవర్‌కు చేరుకుంది’అంటున్నారు సుజాత. 

- బొద్దల పైడిరాజు, విశాఖపట్నం

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని