Updated : 20/09/2022 06:49 IST

కమల్‌హాసన్‌ ప్రశంసే మలుపు!

కోరుకున్నది దక్కకపోతే.. నిరాశ మామూలే! మీనాక్షి అనంతరామ్‌కి.. తనెంతగానో కోరుకున్న ఉద్యోగం దక్కలేదు. కానీ పెద్ద లక్ష్యాన్ని నిర్దేశించుకొని వ్యాపారవేత్తగా ఎదిగారు. అంతా బాగుందనుకుంటున్నప్పుడు చెట్టంత కొడుకు దూరమయ్యాడు. ఆ బాధ నుంచి తేరుకొని తనలా కుటుంబ సభ్యులను కోల్పోయిన వారికి సాయం చేస్తున్నారు. వసుంధర పలకరించగా తన స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని చెప్పుకొచ్చారిలా...

నాకు చిన్నప్పుడు కాస్త నత్తి ఉండేది. దాన్ని అధిగమించడానికి ఇంగ్లిషులో అనర్గళంగా మాట్లాడటం సాధన చేసేదాన్ని. దీంతో ఆంగ్ల భాష, ప్రసంగ నైపుణ్యాలపై పట్టు వచ్చింది. ఎంతలా అంటే.. నాన్నతో కలిసి 1988లో ఓ రంజీ మ్యాచ్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరించేంతలా! అందుకు లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డులో స్థానం కూడా దక్కింది. మాది చెన్నై. నాన్న ఎం.కె. మురుగేశ్‌, రంజీ క్రీడాకారుడు. ఆయన ఉద్యోగరీత్యా విశాఖపట్నంలో స్థిరపడ్డాం. ఎమ్మెస్సీ చదివా. ఆపై పీహెచ్‌డీలో భాగంగా పరిశోధనలూ చేశా. 25 పరిశోధన పత్రాలు రాశా. అంటార్కిటిక్‌ మిషన్‌కూ ఎంపికయ్యా. లఖ్‌నవూ ‘ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌’కు ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఎంపికైన పరిశోధకుల్లో నేనూ ఒకర్ని. అక్కడ యువ శాస్త్రవేత్త అవార్డునూ అందుకున్నా. నాలుగు పేటెంట్లు సాధించా. పీహెచ్‌డీ పూర్తయ్యాక బర్క్‌లీ, స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయాల్లో పోస్ట్‌డాక్టోరల్‌ అవకాశమొచ్చింది. ‘బర్క్‌లీ’లో కొంతకాలం పరిశోధనలు చేశా. ప్రొఫెసర్‌గా స్థిరపడాలన్నది నా కోరిక. ఆంధ్రవిశ్వవిద్యాలయంలో పోస్టులు పడటంతో దరఖాస్తు చేశా. కానీ ఎంపికవ్వలేదు. ఎంత నిరాశపడ్డానో! కానీ అక్కడితో ఆగాలనుకోలేదు.

అదలా పనికొచ్చింది..

చదువే కాదు... చిన్నచిన్న కార్యక్రమాలకు వ్యాఖ్యాతగానూ చేసేదాన్ని. 1995లో ప్రముఖ నృత్యకారిణి పద్మాసుబ్రహ్మణ్యం నాట్యప్రదర్శన విశాఖలో జరిగింది. దానికి నేనే వ్యాఖ్యాత. ముఖ్య అతిథిగా హాజరైన హీరో కమల్‌హాసన్‌ నన్ను పిలిచి మరీ చాలా బాగా మాట్లాడానని అభినందించారు. ఒకటి దక్కలేదు కదా అని ఆగిపోవడం నా నైజం కాదు. అంతకుమించిన ఉన్నతస్థాయిలో ఉండాలనుకుంటా. కమల్‌హాసన్‌ ప్రశంస.. ఈ రంగంలో ఎదగాలన్న ఆలోచనిచ్చింది. అదే ఏడాది ‘రాజ్‌మతాజ్‌’ పేరుతో ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థను ప్రారంభించా.

రూ.5 వేలు పెట్టుబడి. జాతీయ, అంతర్జాతీయ సంస్థలతోపాటు గోవా కార్నివాల్‌, విశాఖ ఉత్సవ్‌, గోపాల్‌పూర్‌ డాన్స్‌ ఫెస్టివల్‌, కోణార్క్‌ డాన్స్‌ ఫెస్టివల్‌, నేషనల్‌ గేమ్స్‌ (2002) వంటి ప్రతిష్ఠాత్మక ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణ బాధ్యతలను విజయవంతంగా పూర్తిచేశా. ఇప్పటివరకూ వెయ్యికిపైగా కార్యక్రమాలు చేశా. 6,800 ప్రదర్శనలకు వ్యాఖ్యాతగా వ్యవహరించా. మా సంస్థలో 32 మంది పని చేస్తున్నారు. ఇప్పుడు మా సంస్థ టర్నోవర్‌ రూ.5కోట్లకు పైమాటే!

అలా సేవవైపు..

అంతా సజావుగా సాగితే జీవితమెలా అవుతుంది? మా పెద్దబ్బాయి ఇంజినీరింగ్‌ ఆఖరి సంవత్సరంలో ఉండగా క్యాన్సర్‌తో చనిపోయాడు. ఒక్కసారిగా నా ప్రపంచం తలకిందులైపోయింది. కానీ దీనిపై ఏదైనా చేయాలనిపించింది. 2007లో ‘రోహిత్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌’ ప్రారంభించి, క్యాన్సర్‌ బాధిత కుటుంబాలకు సాయపడుతున్నా. క్యాన్సర్‌ కారణంగా కుంగిపోతున్న రోగులు, నాలాంటి కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్‌ ఇప్పిస్తున్నా. 40వేల మందికి ఈవిధంగా సాయపడ్డా. రచయితను కూడా. నేను రాసిన ‘మారిపోసా’ అమెజాన్‌ బెస్ట్‌సెల్లర్‌(2022)గా ఎంపికైంది. మావారు అనంతరామ్‌, అత్త ప్రోత్సాహంతోనే నేననుకున్న మార్గాల్లో విజయవంతంగా సాగగలుగుతున్నా.


‘చాలామంది మహిళలు తమకి తాము పరిమితులు విధించుకుంటూ కొన్ని రంగాల్లోకి ప్రవేశించడానికే భయపడుతుంటారు. నేను ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ ప్రారంభించినప్పుడు ఈ రంగంలో మహిళలు లేరనే చెప్పొచ్చు. నేనో మధ్యతరగతి అమ్మాయినైనా నా నైపుణ్యాలపై నాకున్న నమ్మకంతో ముందడుగు వేసి, విజయం సాధించా. మీరూ మీ శక్తిసామర్థ్యాలు, నైపుణ్యాలను గమనించుకొని దాని ప్రకారం తగిన రంగంలో అడుగుపెట్టండి. తప్పక రాణిస్తారు. దానికి కుటుంబమూ తోడు నిలిస్తే మెరుగైన ఫలితాలు మన సొంతం’.

- బి.ఎస్‌. రామకృష్ణ, విశాఖపట్నం


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని