అమ్మాయిలూ నమ్మండి... ఏదైనా సాధించగలం!

పల్లెటూరి అమ్మాయి.. అయినా ధైర్యం చేసి ఇంజినీరింగ్‌లో చేరారు. అప్పట్లో ఆ చుట్టుపక్కల గ్రామాల్లో అలా చేరిన మొదటి అమ్మాయి తనే. తర్వాత తన స్ఫూర్తితో ఎందరో సాంకేతిక విద్య వైపు వెళ్లారు. ఇప్పుడు ఆవిడే ‘ఐఈఈఈ హైదరాబాద్‌ విభాగ అధ్యక్షురాలి’గా..

Updated : 22 Sep 2022 07:33 IST

పల్లెటూరి అమ్మాయి.. అయినా ధైర్యం చేసి ఇంజినీరింగ్‌లో చేరారు. అప్పట్లో ఆ చుట్టుపక్కల గ్రామాల్లో అలా చేరిన మొదటి అమ్మాయి తనే. తర్వాత తన స్ఫూర్తితో ఎందరో సాంకేతిక విద్య వైపు వెళ్లారు. ఇప్పుడు ఆవిడే ‘ఐఈఈఈ హైదరాబాద్‌ విభాగ అధ్యక్షురాలి’గా.., ప్రొఫెసర్‌గా ఆడపిల్లలను సాంకేతిక విద్య ఎంచుకునేలా చేయడమే కాదు.. నాయకత్వ హోదాలకు చేరుకునేలా, వ్యాపారవేత్తలుగా ఎదిగేలా ప్రోత్సహిస్తున్నారు. ఆవిడే  డాక్టర్‌ యార్లగడ్డ పద్మసాయి. వసుంధర పలకరించగా తన ప్రయాణాన్ని పంచుకున్నారిలా...

మాది ఏపీలోని ఎన్టీఆర్‌ జిల్లా గుమ్మడిదుర్రు. మొదట్నుంచీ గణితంపై ఆసక్తి. అందుకే ఇంజినీరింగ్‌ ఎంచుకున్నా. ఆపై ఎంఈ, పీహెచ్‌డీనీ చేశా. అయిదేళ్లు ఎలక్ట్రానిక్స్‌ సంస్థలో పనిచేసి, బోధనా రంగంలోకి అడుగు పెట్టా. ప్రస్తుతం హైదరాబాద్‌లోని వీఎన్‌ఆర్‌ విజ్ఞాన్‌ జ్యోతి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీకి డీన్‌ని. రోజురోజుకీ సాంకేతికత మారిపోతుంటుంది. దాని గురించి చెప్పాలంటే ప్రొఫెసర్లుగా మాకు అవగాహనుండాలి. ఆ ఉద్దేశంతోనే ‘ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీర్స్‌’ (ఐఈఈఈ)లో చేరా. ఇదో అంతర్జాతీయ సంస్థ. ప్రపంచవ్యాప్తంగా పరిశ్రమల నిపుణులు ఇందులో సభ్యులుగా ఉంటారు. కాన్ఫరెన్సులు, ప్రొఫెషనల్‌, ఎడ్యుకేషనల్‌ కార్యక్రమాల ద్వారా సాంకేతికత, దాని పరిణామాలు వంటి అంశాలపై అవగాహన కల్పిస్తారు. వీరంతా వారి పరిధిలో ఉన్న వారితో ఆ జ్ఞానాన్ని పంచుకుంటూ ఉంటారు. ఇవన్నీ తెలుసుకొని పిల్లలకు ఉపయోగకరమైన పాఠ్యాంశాలను రూపొందిస్తాం.  ప్రొఫెసర్లే కాదు.. ఉద్యోగులు, విద్యార్థులు ఎవరైనా ఇందులో చేరొచ్చు.

నా ఆధ్వర్యంలో..

ఐఈఈఈలో ప్రపంచవ్యాప్తంగా 10 ప్రాంతీయ విభాగాలు ఉంటాయి. మనది ఆసియా పసిఫిక్‌. దీనిలోనూ రాష్ట్రాలవారీ విభాగాలుంటాయి. మా ‘విమెన్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌ ఎఫినిటీ గ్రూప్‌’ (డబ్ల్యూఐఈ ఏజీ) విభాగంలో ఆరు వేలకుపైగా సభ్యులున్నారు. చాలా దేశాలు ఇంజినీరింగ్‌లో అమ్మాయిల ఉనికిని పెంచాలనుకుంటున్నాయి. అలా ఈ ప్రత్యేక మహిళా గ్రూపు మొదలైంది. నెలకోసారి కోర్‌ సభ్యులమంతా సమావేశమవుతాం. విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులు, ఉద్యోగినులకూ ఏ అంశాలపై అవగాహన కల్పించాలన్నది చర్చించుకొని కార్యక్రమాలు ప్లాన్‌ చేస్తాం. నాయకత్వం, ఆంత్ర ప్రెన్యూర్‌షిప్‌, మహిళా సాధికారత, రాబోయే కొత్త టెక్నాలజీలు, సైబర్‌ సెక్యూరిటీ, సైబర్‌ మోసాలను ఎదుర్కోవడం వంటి వాటిపైనా అవగాహన కల్పిస్తాం. దీనికి పలు సంస్థలు కార్పొరేట్‌ రెస్పాన్సిబిలిటీలో భాగంగా కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత చెల్లించడమో, తమ నిపుణులతో శిక్షణ ఇప్పించడమో చేస్తుంటాయి. తెలుగు రాష్ట్రాలు రెండూ హైదరాబాద్‌ విభాగం కిందకే వచ్చేవి. గత ఏడాది నుంచి వైజాగ్‌ ప్రత్యేక సెక్షన్‌గా మారింది. సభ్యులైన వాళ్లు ఈ కాన్ఫరెన్స్‌లకు హాజరవొచ్చు. ఏటా ప్రపంచ వ్యాప్తంగానూ ఈ కాన్ఫరెన్స్‌లు జరుగుతాయి. ‘విమెన్‌ ఇన్‌ లీడర్‌షిప్‌’ పేరుతో అంతర్జాతీయ సదస్సును హైదరాబాద్‌లో ఇటీవలే నిర్వహించాం. అది నా ఆధ్వర్యంలోనే జరిగింది. ఈ సదస్సును తెలంగాణ ప్రభుత్వం, కొన్ని సంస్థలు స్పాన్సర్‌ చేశాయి.

అది మార్చాలనే..!

ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా 33% రిజర్వేషన్‌ పెట్టాక అమ్మాయిలూ ప్రొఫెషనల్‌ కోర్సులను ఎంచుకోవడం పెరిగింది. మిడిల్‌స్థాయి వరకూ గట్టిపోటీ ఇస్తున్నారు. కానీ నాయకత్వ హోదాకి వచ్చేసరికే తగ్గిపోతున్నారు. చేయలేమేమోనన్నది వాళ్ల అనుమానం. ఈ అంశంపై దృష్టిపెట్టి, వారిని ఆ దిశగా ప్రోత్సహిస్తున్నాం. మనమూ ఎవరికీ తక్కువ కాదన్న నమ్మకాన్ని కలిగిస్తున్నాం. సంస్థల పాలసీ రూపకల్పనలోనూ మహిళల పాత్ర పెంచేలా కృషి చేస్తున్నాం. నేను పల్లెటూరి అమ్మాయినే. మా చుట్టుపక్కల గ్రామాల్లో ఇంజినీరింగ్‌ చదివిన మొదటి అమ్మాయిని. నన్ను చూసి ఈ రంగాన్ని ఎంచుకున్న వారెందరో! బీటెక్‌ రెండో ఏడాదిలోనే పెళ్లైంది. మావారు శ్రీనివాసరావు మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చేశారు. నాన్న, మావారి ప్రోత్సాహంతోనే చదువు కొనసాగించగలిగా.

* అమ్మాయిలూ... ఇంగ్లిష్‌ రానంత మాత్రాన భయపపడొద్దు. ఫండమెంటల్స్‌పై దృష్టి పెట్టండి. నేను 80ల్లో ఇంజినీరింగ్‌ చేసినా కొత్త టెక్నాలజీలను సులువుగా నేర్చుకోగలగడానికి కారణమిదే.

* సాఫ్ట్‌వేర్‌ ఒక్కటే కాదు, ఇతర ఇంజినీరింగ్‌ బ్రాంచిల్లోనూ చాలా అవకాశాలున్నాయి. పైగా మిగతా వాటిల్లో ఒకసారి అవకాశాలుండటం, తర్వాత తగ్గడం లాంటివి ఉండవు. కాకపోతే ప్రారంభ వేతనాలు కాస్త తక్కువ. కానీ వీటిల్లో నిరంతర ఎదుగుదల ఉంటుంది. ఎవరో చెప్పారని కాక మీకు నచ్చిన దాన్ని ఎంచుకోండి.

* తల్లిదండ్రులూ... పిల్లలను బలవంతంగా వారికి ఇష్టం లేని కోర్సుల్లో చేర్పించొద్దు. నచ్చింది చదివినపుడే బాగా రాణించగలరు.


‘ఫలానా స్థాయికి వెళ్లాలని ప్రత్యేకంగా ఏదీ ప్లాన్‌ చేసుకోలేదు. నాకు ఇచ్చిన పనిని సమర్థంగా చేయడం, నేను చేయగలను అనిపిస్తే ముందుకెళ్లి బాధ్యత తీసుకోవడం... చెప్పిన సమయానికి కచ్చితంగా పూర్తి చేయడం... ఈ లక్షణాలే జూనియర్‌ని అయినా ఉన్నత హోదాలు దక్కేలా చేశాయి. నిబద్ధతతో పనిచేస్తే గుర్తింపు దానంతటదే వస్తుంది. మనల్ని మనం తక్కువ అంచనా వేసుకోవద్దు. ఒకరి కోసమూ పని చేయొద్దు. మన పని మనకు సంతృప్తినిస్తే చాలు’

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని