సేవ కోసమే.. ఈ ఊపిరి!
మాది యాదాద్రి భువనగిరి జిల్లా, గుర్రాలదండి. నాకో తమ్ముడు, ఇద్దరు చెల్లెళ్లు. పెద్ద చెల్లీ దివ్యాంగురాలే. చిన్న చెల్లి పుట్టగానే నాన్న ఇల్లు వదిలి వెళ్లిపోవడంతో కూలి పనులు చేస్తూ మా నలుగుర్నీ పెంచింది అమ్మ సావిత్రి. ఆమె కష్టాల్ని చూసి మంచి ఉద్యోగం సాధించి, తనని బాగా చూసుకోవాలనుకునేదాన్ని. ఇంటరయ్యాక ఊళ్లో విద్యావాలంటీర్‌గా చేశా. గౌరవ వేతనాన్ని అమ్మకే ఇచ్చేదాన్ని...
చిన్న కష్టానికే కుంగిపోవడం.. లక్ష్యాన్ని అందుకోలేకపోతే జీవితం లేదనుకోవడం... ఇలాంటి వాళ్లు వంగూరి అలివేలు మంగమ్మ గురించి తెలుసుకోవాల్సిందే. ఆత్మవిశ్వాసం, ఆశయం ఉంటే వైకల్యాన్ని, వైఫల్యాల్ని జయించవచ్చంటున్న మంగమ్మ స్ఫూర్తి ప్రయాణమిది.
మాది యాదాద్రి భువనగిరి జిల్లా, గుర్రాలదండి. నాకో తమ్ముడు, ఇద్దరు చెల్లెళ్లు. పెద్ద చెల్లీ దివ్యాంగురాలే. చిన్న చెల్లి పుట్టగానే నాన్న ఇల్లు వదిలి వెళ్లిపోవడంతో కూలి పనులు చేస్తూ మా నలుగుర్నీ పెంచింది అమ్మ సావిత్రి. ఆమె కష్టాల్ని చూసి మంచి ఉద్యోగం సాధించి, తనని బాగా చూసుకోవాలనుకునేదాన్ని. ఇంటరయ్యాక ఊళ్లో విద్యావాలంటీర్‌గా చేశా. గౌరవ వేతనాన్ని అమ్మకే ఇచ్చేదాన్ని. అప్పుడే కుట్టుమిషన్ కొనుక్కున్నా. పరోపకారంలో ఉండే తృప్తికి ఏదీ సాటి రాదనిపించి.. డిగ్రీ తర్వాత సామాజిక కార్యకర్తగా శిక్షణ తీసుకున్నా. భువనగిరి, ఆ చుట్టుపక్కల గ్రామాల్లో దివ్యాంగులకు సర్టిఫికెట్లు ఇప్పించడం, పుట్టబోయే శిశువులకు వైకల్యం రాకుండా గర్భిణులకు జాగ్రత్తలు వివరించడం, స్వయంఉపాధి కోసం రుణాలు పొందడంలో సాయపడేదాన్ని.
అందరికీ ‘అమ్మ ప్రేమ’...
నాన్న తిరిగొచ్చినా రోజూ తప్పతాగి అమ్మని కొట్టేవాడు. 2006లో ఓ ప్రమాదంలో నా కాళ్లు విరిగాయి. ఇది నన్ను నిస్సహాయురాల్ని చేసింది. కుటుంబానికి భారంగా మారానని నిద్రమాత్రలు మింగేశా.. ఇంట్లోవాళ్లు సకాలంలో హాస్పిటల్‌కి తీసుకువెళ్లి బతికించారు. వాళ్ల ప్రేమతో జీవితం మీద ఆశ కలిగింది. నాన్న మారకపోవడంతో.. 2008లో హైదరాబాద్‌కు వచ్చేశాం. నేను టైలరింగ్, తమ్ముడు డ్రైవింగ్, చెల్లి నర్సుగా.. ఇలా తలో పని చేసే వాళ్లం. నాలుగేళ్లకు మరో యాక్సిడెంట్.. ఎడమ కాలు మళ్లీ విరిగింది. శస్త్రచికిత్స చేయడంతో ఆరు నెలలు విశ్రాంతి తీసుకున్నా. ‘నాకే ఎందుకిలా..’ లాంటి ఆలోచనలతో నిరాశగా గడుపుతున్నప్పుడు.. ‘నీలాంటివాళ్లకి అండగా నిలిచి అమ్మకు పేరు తీసుకురా’ అని ధైర్యాన్ని నూరిపోశారు స్నేహితులు. దాంతో 2015లో ‘అమ్మ ప్రేమ ఫౌండేషన్’ను ప్రారంభించా. తొలి ఏడాది 30 మంది దివ్యాంగులకు టైలరింగ్‌లో శిక్షణ ఇచ్చా. తర్వాత 30 మంది అనాథ పిల్లల విద్య, సంరక్షణ చూసుకోవడం మొదలుపెట్టా. టైలరింగ్‌తో వచ్చిన ఆదాయంతోనే ఇవన్నీ చేసేదాన్ని. ఈ దశలో ఆరోగ్యం క్షీణించడం, ఆర్థిక కష్టాలు.. నామీదే ఆధారపడ్డ పిల్లలు... ఏమీ పాలుపోలేదు. ఓ ప్రయత్నం చేద్దామని సామాజిక మాధ్యమాల్లో ఫౌండేషన్ గురించి వీడియోను పోస్ట్ చేశా. చాలా మంది దాతలు ముందుకొచ్చారు. దాంతో ఫౌండేషన్ కొనసాగుతోంది. దివ్యాంగుల పెళ్లిళ్లకి కుటుంబ సహకారం ఉండదు. అందుకే ఇప్పటివరకూ 20 మంది దివ్యాంగులకు పెళ్లిళ్లు చేశా. నిరుపేదల పెళ్లిళ్లకు వస్త్రాలు, తాళిబొట్టు, భోజనాలూ ఏర్పాటు చేశా. ఈ మధ్య అనారోగ్యంతో మంచానికే పరిమితమయ్యా. తమ్ముడు ఆటోడ్రైవర్, తనే ఫౌండేషన్ బాధ్యతల్లో నాకు అండాదండా. ఊపిరి ఉన్నంతవరకూ సేవలు ఆగకూడదన్నదే నా ధ్యేయం.
- గ్యార అనిల్, హైదరాబాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.