కళతోనూ కోట్ల వ్యాపారం!
చిత్రకారిణిగా ఎదగాలని కలగన్నారు. మదిలో ఎన్నో వినూత్న ఆలోచనల్ని పోగుచేసుకున్నారు. కానీ సరైన ప్రోత్సాహం అందలేదామెకు. అయినా అక్కడితో ఆగలేదు. తనలాంటి పరిస్థితి వేరొకరికి రాకూడదని.. కళాకారుల్ని ప్రోత్సహించే వేదికను ఆవిష్కరించారు.. శరణ్ అప్పారావు.
చిత్రకారిణిగా ఎదగాలని కలగన్నారు. మదిలో ఎన్నో వినూత్న ఆలోచనల్ని పోగుచేసుకున్నారు. కానీ సరైన ప్రోత్సాహం అందలేదామెకు. అయినా అక్కడితో ఆగలేదు. తనలాంటి పరిస్థితి వేరొకరికి రాకూడదని.. కళాకారుల్ని ప్రోత్సహించే వేదికను ఆవిష్కరించారు.. శరణ్ అప్పారావు. ‘అప్పారావు గ్యాలరీస్’తో కళల అభివృద్ధికీ, కళాకారుల ఆర్థిక పరిపుష్టతకు అండగా నిలుస్తోన్న శరణ్‌ని ‘వసుంధర’ పలకరించింది.
మాది ఉయ్యూరు జమిందార్ల కుటుంబం. మద్రాస్ ప్రెసిడెన్సీ ఉన్నప్పుడే తాతయ్యా వాళ్లు చెన్నైలో స్థిరపడ్డారు. విజయవాడలో బంధువులు ఉన్నారు. నాన్న ఎం.వి.జి.అప్పారావు. దేశం మెచ్చిన టెన్నిస్ ఆటగాడు. వింబుల్డన్‌లోనూ ఆడారు. ఆయనకు, తాతయ్యకీ చిత్రకళలంటే ఇష్టం. వాళ్ల నుంచి నాకూ అది పరిచయమైంది. నేనైతే ఆధునిక చిత్రకళ పరంగా ఏదైనా సాధించాలని తపనపడేదాన్ని. నాకు 16 ఏళ్లపుడ[ు నాన్న చనిపోయారు. తర్వాత అమ్మ సునీత నన్ను ప్రోత్సహించారు. చెన్నై స్టెల్లా మేరీ కాలేజీలో ఫైన్‌ఆర్ట్స్ చేశా. కళాకారిణిగా నా ఆలోచనలకు మరింత విస్తృతి ఉండాలని హార్వర్డ్, ప్యారిస్‌లోని ఈఎన్‌ఎస్‌ఈసీ యూనివర్సిటీ, వాషింగ్టన్ డీసీలో పలు కోర్సులు చేశాను. చెన్నై తిరిగొచ్చి చిత్రకారిణిగా కెరియర్ మొదలుపెట్టా. ఆర్ట్ అంటే.. చేత్తో గీసేదొక్కటే కాదు... ఆకృతులతో, వస్తువులతో, వివిధ రకాలుగా దాన్ని ప్రదర్శించొచ్చు. నేను కుండల్ని వినూత్న రీతిలో కళాత్మకంగా అమర్చేదాన్ని. కానీ అప్పట్లో వాటిని ప్రోత్సహించే వేదికలు చెన్నైలో లేకపోవడంతో గుర్తింపు, ఆదాయం రెండూ లేవు. ఈ కెరియర్‌కు సరిపోతానా అనే సందేహం మొదలైంది. ఆ ఆలోచనల్లోంచే.. ‘నాకు దక్కని ప్రోత్సాహాన్ని నేనే ఇతరులకు ఎందుకివ్వకూడదూ’ అనుకున్నా. అలా 1983లో చెన్నైలో నాన్న పేరుతో ‘అప్పారావు ఆర్ట్‌గ్యాలరీస్’ మొదలుపెట్టా. నాకప్పుడు 20 ఏళ్లుంటాయి. నా ఆనందం అంతా ఇంతా కాదు. కుటుంబ సహకారం తీసుకోకుండానే ఇది చేయగలిగా. దీనికి పెద్ద మొత్తంలో పెట్టుబడి అవసరం. గ్రిండ్లేస్ బ్యాంక్‌ను సంప్రదిస్తే అతి కష్టమ్మీద వాళ్లు అంగీకరించారు. ఆర్ట్ గ్యాలరీకి రుణాలివ్వడం దేశంలో అదే తొలిసారనుకుంటా. తొలి రెండేళ్లు చెన్నైలోనే పలువురు కళాకారుల్ని ఆహ్వానించి ప్రదర్శనలిచ్చా. సామన్యులూ పెద్ద ఎత్తున వచ్చేవారు. ప్రజాదరణ నా ఉత్సాహాన్ని పెంచింది. దాంతో ఆర్ట్‌గ్యాలరీస్ నిర్వాహకురాలిగా మారిపోయా.
వందల ప్రదర్శనలు
తర్వాత దిల్లీ, నోయిడాల్లోనూ ఆర్ట్ గ్యాలరీస్ తెరిచా. వీటిని చాలా ప్రత్యేకంగా డిజైన్ చేశా. కళాకారులు తమ కళను పెయింటింగ్, డ్రాయింగ్‌తో పాటు వివిధ ఆకృతులు, వస్తువులు, స్వతహాగా మలిచిన బొమ్మలు, కాగితాలు, వివిధ రకాల లోహాలు, అచ్చులు.. ఇలా వేటితోనైనా ప్రదర్శించే స్వేచ్ఛనిస్తా. కొన్నిసార్లు థీమ్‌లతో నిర్వహిస్తాం. ఈ మధ్య చదువుకు ముడిపెట్టి జామెట్రీ, హిస్టరీ లాంటివీ చేశాం. గ్యాలరీల బయటా వందల ప్రదర్శనలు ఏర్పాటుచేశాం. లండన్, ప్యారిస్, న్యూయార్క్.. నగరాల్లో నేను ఏర్పాటుచేసిన ప్రదర్శనల్లో భారతీయ కళాకారుల సృజనలకు అద్భుత ఆదరణ దక్కింది. మా గ్యాలరీల ద్వారా వందలమంది కళాకారుల ప్రతిభ జనాలకు చేరువైంది. వారిలో తెలుగు వాళ్లూ ఉన్నారు. అమెరికాలో స్థిరపడిన సంగీతారెడ్డి, వైజాగ్‌కు చెందిన దివ్యా చిన్ని, సంజీవరావు, శ్రీనివాసరెడ్డి.. ఇలా ఎంతోమంది మాతో కలసి పనిచేస్తున్నారు. కళాకారిణిగా ఉన్నా కళకు ఇంత ఖ్యాతి తెచ్చేదాన్ని కాదేమో. ప్రదర్శనలతోపాటు అమ్మకాలూ చేపడతాం. అమ్మగా వచ్చిన మొత్తంలో కొంత మాకు అందుతుంది. బొమ్మలతో ఏం వ్యాపారం ఉంటుంది అనుకుంటున్నారా... ఏటా అమ్మకాలు రూ.కోట్లలోనే జరుగుతున్నాయి. కళలకు ప్రాచుర్యం పెంచడానికి కళాకారులతో పరిచయ కార్యక్రమాలూ నిర్వహిస్తాం. యువతకు చేరువకావడానికి ఇప్పుడు ఆన్‌లైన్లో, ప్రత్యేకించి సామాజిక మాధ్యమాల్లో కళాకారుల కళాఖండాల్ని ప్రదర్శిస్తున్నాం.
ఈ రంగంలోకి మహిళల రాక బాగా పెరిగింది. వారెంతో సాహసోపేత కళల్ని ప్రదర్శిస్తున్నారు. వారిలో ధైర్యం, లక్ష్యంపై కసి కనిపిస్తోంది. ఇదే ఎన్నో వినూత్న కళాఖండాల్ని ప్రజలముందుకు తెప్పిస్తోంది. మహిళగా నాకిది సంతృప్తినిచ్చిన అంశం.
- హిదాయతుల్లాహ్.బి, చెన్నై
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.