పిల్లల్ని సైంటిస్టుల్ని చేయాలని..!

‘అమ్మాయికి చదువెందుకు.. పెళ్లిచేసి పంపేయక’ అని ఉచిత సలహాలిచ్చేవాళ్లని చూస్తుంటే కోపం వచ్చేదామెకు. దాంతో మరింత కసితో చదివేది. చదువుతోనే తల రాత మారుతుందని తనకు తెలుసు. బాగా చదివినా ఆర్థిక కారణాలవల్ల కోరుకున్న కోర్సుల్లో చేరలేకపోయింది.

Updated : 28 Sep 2022 07:28 IST

‘అమ్మాయికి చదువెందుకు.. పెళ్లిచేసి పంపేయక’ అని ఉచిత సలహాలిచ్చేవాళ్లని చూస్తుంటే కోపం వచ్చేదామెకు. దాంతో మరింత కసితో చదివేది. చదువుతోనే తల రాత మారుతుందని తనకు తెలుసు. బాగా చదివినా ఆర్థిక కారణాలవల్ల కోరుకున్న కోర్సుల్లో చేరలేకపోయింది. అయినా నిరూత్సాహపడలేదు... ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకుని.. మూడున్నర దశాబ్దాలుగా గ్రామీణ బాలబాలికల్ని ప్రయోజకులుగా తీర్చుదిద్దుతున్నారు ముత్తా కృష్ణవేణి.

ది 2015 సెప్టెంబరు 15.. ప్రధాని చేతుల మీదుగా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలు అవార్డు అందుకోవడానికి దిల్లీ వెళ్లారు కృష్ణవేణి. అక్కడి వాతావరణం కొత్తగా ఉంది. అంతలో ‘మేడమ్‌ నన్ను గుర్తుపట్టారా’ అంటూ ఓ ఆత్మీయ పలకరింపు. తను ఆమె విద్యార్థినేనని పరిచయం చేసుకున్నారా యువ ఐఏఎస్‌. జాబితాలో తమ టీచర్‌ పేరు చూసి తన బాధ్యత కాకపోయినా తీసుకువెళ్లడానికి వచ్చాడు. ఆ సమయంలో తన ఆనందానికి అవధుల్లేవనీ, అది ఉపాధ్యాయులకు మాత్రమే దక్కే అదృష్టమనీ చెబుతారు కృష్ణవేణి. ఈమెది ఏలూరు జిల్లా, జంగారెడ్డి గూడెం. అమ్మ పాలపర్తి శ్యామల, నాన్న నూకరాజు. నలుగురు తోబుట్టువులు. అమ్మానాన్నా చిన్న టిఫిన్‌ కొట్టు నడిపేవారు. తెల్లవారు ఝామునే లేచి అక్కడ పనిచేశాకే స్కూల్‌కి వెళ్లేవారు కృష్ణవేణి. తన కుటుంబాన్ని ఈ పరిస్థితుల నుంచి ఎలాగైనా బయటికి తీసుకురావాలన్న తపనతో శ్రద్ధగా చదివేవారు. ఆటల్లోనూ చురుగ్గా పాల్గొనేవారు. ‘అప్పట్లో మావూళ్లో సరైన వైద్య సదుపాయాల్లేవు. మెడిసిన్‌ చేసి స్థానికులకు అండగా నిలవాలనుకునేదాన్ని. ఆర్థిక పరిస్థితుల కారణంగా సాధ్యపడలేదు. అగ్రికల్చర్‌ బీఎస్సీలో సీటొచ్చినా ఫీజు కట్టలేకపోయా. ఆ బాధలో నేనుంటే.. ‘అమ్మాయికి చదువెందుకు, పెళ్లిచేసి పంపేయకా’.. అనేవాళ్లు చుట్టుపక్కల వాళ్లు. నాన్న మాత్రం మా చదువుల విషయంలో రాజీపడలేదు. ఇది నా సమస్య మాత్రమే కాదు.. సామాజిక రుగ్మత. దీన్ని ఎలాగైనా పరిష్కరించాల్సిందేనని ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్నా. కెరియర్‌ మొత్తం విశాఖ చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల్లో పనిచేశా. 80ల్లో బాల్య వివాహాలు ఎక్కువ. స్వచ్ఛంద సంస్థల సాయంతో చాలా పెళ్లిళ్లు ఆపగలిగా. పాఠశాల తరఫున అవగాహన కార్యక్రమాలూ చేపట్టా’ అని గుర్తుచేసుకుంటారు కృష్ణవేణి. ప్రస్తుతం అగనంపూడి జెడ్పీ హైస్కూల్లో పని చేస్తున్నారు.

సైన్స్‌ చదువులకు ప్రోత్సాహం..

భర్త వెంకటరావు ఎల్‌ఐసీ ఉద్యోగి. వీరికిద్దరు అమ్మాయిలు. ఈ సైన్స్‌ టీచర్‌.. నేషనల్‌ గ్రీన్‌ టీచర్‌గానూ శిక్షణ తీసుకున్నారు. పర్యావరణ పరిరక్షణ, స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ వైపూ విద్యార్థుల్ని ప్రోత్సహిస్తుంటారు. ఆర్థిక పరిస్థితి బాగాలేక ఈమె విద్యార్థుల్లో కొందరు చిన్నాచితకా పనులు చేస్తుంటారు. వాళ్లలో జీవితంలో పైకి రావాలన్న తపనా ఎక్కువ. వారి ప్రత్యేకతను మిగతా పిల్లలకు చెబుతూ నైతిక విలువల్ని నేర్పుతుంటారు. అదే సమయంలో ఆ పిల్లల్లోనూ న్యూనతా భావం పోగొడతారు. ఇప్పటిదాకా పిల్లల్ని దాదాపు 100 సైన్స్‌ ఫెయిర్లలో పాల్గొనేలా చేశారు. వీళ్లు రాష్ట్ర, జాతీయస్థాయిలో ఎన్నో బహుమతులూ గెల్చుకున్నారు. స్టెమ్‌ సబ్జెక్టులవైపు అమ్మాయిల్ని ప్రోత్సహించేందుకూ, మూఢనమ్మకాలు పోగొట్టేందుకూ వీటిలో ఎక్కువగా భాగం చేస్తారు.


అప్పుడే సంతృప్తి

రాష్ట్ర, జాతీయస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయురాలిగా, ఉత్తమ గ్రీన్‌ టీచర్‌గా ఎంపికయ్యా. వీటికంటే కూడా.. నా విద్యార్థులు లాయర్లు, డాక్టర్లు, టీచర్లుగా స్థిరపడ్డామని చెబుతుంటే వారి విజయాలే నాకు సంతృప్తినిస్తాయి. పిల్లల హృదయాల్లో నాటే నైతిక విలువలు, కష్టం, ప్రేరణ, విజయం.. ఇవి చాలా ముఖ్యం. భవిష్యత్‌ తరాల్ని తీర్చిదిద్దే అమూల్యమైన అవకాశమీ వృత్తి.


- తోనంగి శారద, హైదరాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని