చంద్రుడిపై అడుగు.. ఆమె చలవే!

కేథరీన్‌ జాన్సన్‌.. 1918లో వెస్ట్‌ వర్జీనియాలో పుట్టారు. నేర్చుకోవడమంటే అమితాసక్తి. సమస్యేదైనా లెక్కలతో పరిష్కరించొచ్చని నమ్మేవారు. అందుకే మేథమెటీషియన్‌ అయ్యారు. చదువయ్యాక టీచర్‌గా చేశారు. 34 ఏళ్ల వయసులో ఎన్‌ఏసీఏ (ఇప్పుడది నాసా)లో చేరారు. ఈ సంస్థ వేగంగా లెక్కలు చేయగల మహిళల్ని ‘కంప్యూటర్లు’ పేరుతో ఎంచుకునేది.

Updated : 05 Oct 2022 07:54 IST

అక్టోబరు 4 - 10 అంతరిక్ష వారోత్సవం

లెక్కలంటే ఆ అమ్మాయికి ప్రాణం. వేసే అడుగులు, కడిగిన పాత్రలు.. ప్రతిదీ లెక్కేసేది. ఆ ఇష్టమే.. చంద్రుడిపై మనిషి అడుగు పడటానికీ కారణమైంది.

కేథరీన్‌ జాన్సన్‌.. 1918లో వెస్ట్‌ వర్జీనియాలో పుట్టారు. నేర్చుకోవడమంటే అమితాసక్తి. సమస్యేదైనా లెక్కలతో పరిష్కరించొచ్చని నమ్మేవారు. అందుకే మేథమెటీషియన్‌ అయ్యారు. చదువయ్యాక టీచర్‌గా చేశారు. 34 ఏళ్ల వయసులో ఎన్‌ఏసీఏ (ఇప్పుడది నాసా)లో చేరారు. ఈ సంస్థ వేగంగా లెక్కలు చేయగల మహిళల్ని ‘కంప్యూటర్లు’ పేరుతో ఎంచుకునేది. నిజానికి అప్పటికి కంప్యూటర్లు అందుబాటులోకి రాలేదు. లెక్కలేవైనా పేపరుమీదే! తొలిసారి దరఖాస్తు చేసుకున్నప్పుడు కేథరీన్‌ని వాళ్లు ఎంచుకోలేదు. మరోసారి ప్రయత్నించి ఎంపికయ్యారు. ఆమె వేగం, సమస్యల్ని పరిష్కరించే నైపుణ్యం చూసి నాసా సమావేశాలకూ ఆహ్వానించేవారు. నాసా ప్రాజెక్టుపై పనిచేసే బృందంలో స్థానం సంపాదించారు. 1962లో అమెరికా చంద్రుడిపైకి మనుషుల్ని పంపాలనుకుంది. అదంత తేలిక కాదు. రాకెట్లు, స్పేస్‌షిప్‌లు సూటిగా అంతరిక్షంలోకి ప్రవేశించలేవు. వాటికంటూ కొన్ని ప్రత్యేకతలుంటాయి. భూకక్ష్యలోకి వ్యోమనౌకను పంపడం దగ్గర్నుంచి చంద్రుడిపై అడుగు మోపే వరకూ ఎలా సాగాలన్నది ఈమె రేఖాగణిత సాయంతో సూచించారు. దాన్ని ఉపయోగించే నాసా విజయవంతమైంది. మూడు దశాబ్దాలు పనిచేసి ఇలాంటి ఎన్నో సంక్లిష్ట సమస్యలకు పరిష్కారం కనుకున్నారు కేథరీన్‌. 1986లో పదవీ విరమణ పొందినా పిల్లల్ని సైన్స్‌, మేథ్స్‌ వైపు వెళ్లేలా ప్రోత్సహించారు. హ్యూమన్‌ కంప్యూటర్‌గా పేరొందిన ఈమె 2020 ఫిబ్రవరిలో 101 ఏళ్ల వయసులో తనువు చాలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని