రైతుబిడ్డ.. వ్యోమగామి!
అమ్మానాన్నా రైతులు. తనదీ అదే బాట అనుకుంటున్న అమ్మాయి ఆలోచనని మార్చింది ఓ టీవీ ప్రోగ్రామ్. చంద్రుడిపై నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ తొలి అడుగు పెట్టడాన్ని కోట్లమంది వీక్షకులతోపాటు పెగ్గీ విట్సన్ కూడా చూశారు. వీళ్లది అమెరికాలోని లోవా.
అక్టోబరు 4 - 10 అంతరిక్ష వారోత్సవం
అమ్మానాన్నా రైతులు. తనదీ అదే బాట అనుకుంటున్న అమ్మాయి ఆలోచనని మార్చింది ఓ టీవీ ప్రోగ్రామ్. చంద్రుడిపై నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ తొలి అడుగు పెట్టడాన్ని కోట్లమంది వీక్షకులతోపాటు పెగ్గీ విట్సన్ కూడా చూశారు. వీళ్లది అమెరికాలోని లోవా. తొమ్మిదేళ్ల వయసులో ఖగోళ శాస్త్రం గురించి విని ఆసక్తి పెంచుకున్నారు. నాసా మొదటి మహిళా వ్యోమగాముల బృందాన్ని తయారు చేస్తోందని తెలిశాక లక్ష్యం అంతరిక్షమే అయ్యింది. బయాలజీ, కెమిస్ట్రీల్లో డిగ్రీ, బయోకెమిస్ట్రీలో పీహెచ్‌డీ చేసి, 1986లో నాసాలో రిసెర్చ్ అసోసియేట్‌గా చేరారు. మెడికల్ సైన్సెస్ విభాగానికి చీఫ్ అయ్యారు. అమెరికా-సోవియట్ ఉమ్మడి పరిశోధనల్లో పాల్గొన్నారు. 1996లో వ్యోమగామి శిక్షణ తీసుకొన్నా 2002లో ఫ్లైట్ ఇంజినీర్‌గా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ఐఎస్‌ఎస్)లో తొలిసారి అడుగుపెట్టారు. 20 పరిశోధనలు చేసి 185 రోజులకు భూమ్మీదకు తిరిగొచ్చారు. నాసా ఐఎస్‌ఎస్ తొలి సైన్స్ ఆఫీసర్. 2009లో నాసా ఆస్ట్రోనాట్ల ఎంపిక, శిక్షణ కార్యక్రమాలకు చీఫ్ అయ్యారు. ఆ తర్వాతా అంతరిక్షంలోకి అడుగుపెట్టారు. ఏకధాటిగా 289రోజులు గడిపి అలా చేసిన తొలి మహిళగా నిలిచారు. 2017లో తొలి మహిళా కమాండర్‌గా ఐఎస్‌ఎస్‌కి వెళ్లారు. అక్కడున్న 192 రోజుల్లో అయిదు స్పేస్‌వాక్‌లు చేశారు. తిరిగొచ్చేప్పుడు సాంకేతిక లోపం కారణంగా తీవ్రగాయాల పాలయ్యారు. అయినా కొనసాగారు. మొత్తంగా 665 రోజులు స్పేస్‌లో గడిపారు. నాసా చరిత్రలో ఇదో రికార్డు. ఆవిడ ఖాతాలో 10 స్పేస్‌వాక్‌లున్నాయి. 2018లో పదవీ విరమణ పొంది ఎగ్జియోమ్ స్పేస్ ఫ్లైట్ సంస్థలో చేరారు. 2023లో మరోసారి స్పేస్ ప్రయాణం చేయనున్నారు. ‘నాకు 62. అంతరిక్షంలోకెళ్లిన ప్రతిసారీ అదో కొత్త అనుభూతి! నాకొకటే కల. ఆకాశాన్ని చూసి కలలు కనే ప్రతి అమ్మాయికీ.. దాన్ని నాలా అందుకోవడం సాధ్యమే అని నిరూపించడమే’ అంటారీవిడ.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.