బుజ్జాయిలకు బుద్ధి పాఠాలు

చిట్టినవ్వులు.. ముద్దు మాటలు.. బుడిబుడి అడుగులతో తమ పిల్లల బాల్యం అందంగా సాగిపోవాలనే కోరుకుంటారు ఏ తల్లిదండ్రులైనా. కానీ వారిలో.. బుద్ధిమాంద్యం, మానసిక వైకల్యం వంటి సమస్యలున్నప్పుడు అది పిల్లలకే కాదు కన్నవాళ్ల సహనానికీ పరీక్షే.

Published : 20 Oct 2022 06:02 IST

చిట్టినవ్వులు.. ముద్దు మాటలు.. బుడిబుడి అడుగులతో తమ పిల్లల బాల్యం అందంగా సాగిపోవాలనే కోరుకుంటారు ఏ తల్లిదండ్రులైనా. కానీ వారిలో.. బుద్ధిమాంద్యం, మానసిక వైకల్యం వంటి సమస్యలున్నప్పుడు అది పిల్లలకే కాదు కన్నవాళ్ల సహనానికీ పరీక్షే. అలాంటప్పుడు ఈ సమస్యని ధైర్యంగా ఎలా ఎదుర్కోవాలో శిక్షణ ఇస్తూ 16 ఏళ్లుగా దేశవిదేశాల్లో వందల మందికి ఊరటనిచ్చారు డాక్టర్‌ స్వప్న

మాది సంగారెడ్డి జిల్లాలోని జోగిపేట. మధ్యతరగతి కుటుంబం. నాన్న వెంకటేశం. అమ్మ శశికళ. నాన్న కోరికపై డిగ్రీలో ఫిజియోథెరపీలో చేరా. ఇంటర్న్‌షిప్‌లో భాగంగా స్వచ్ఛంద సంస్థలతోపాటు, ఆస్పత్రుల్లోనూ పనిచేశా. ఆ సమయంలో మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న అనేకమంది చిన్నారులను చూశా. నిజానికి ఆ పసివాళ్ల కంటే.. వాళ్లకు సేవలు చేస్తూ, వాళ్ల భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ అమ్మానాన్నలే ఎక్కువ క్షోభ పడే వారు. ఆ వేదన నుంచి వాళ్లకి ఉపశమనం అందించే మార్గం ఏదైనా ఉందాని ఆలోచించా. అప్పుడే ‘ఎర్లీ ఇంటర్‌వెన్షన్‌’ విధానం గురించి తెలిసింది. ఆసక్తిగా అనిపించడంతో దాన్లో పీజీ చేశా. జాతీయ మానసిక ఆరోగ్య సంస్థ (ఎన్‌ఐఎంహెచ్‌)లో చిన్నారుల జన్యులోప సమస్యలపై అధ్యయనం చేసి పరిశోధనా పత్రాన్ని సమర్పిస్తే అప్పటి రాష్ట్రపతి అబ్దుల్‌కలాం ప్రశంసించారు. వైద్యురాలిగా పని చేస్తూనే పిల్లల మనో విజ్ఞాన శాస్త్రం (చైల్డ్‌ సైకాలజీ)లో పట్టా తీసుకున్నా.

తగిన సమయంలో గుర్తిస్తే...

ఆలస్యం చేయకుండా.. సమస్యని సరైన సమయంలో గుర్తిస్తే ఎలాంటి వ్యాధిపైనా తగ్గించవచ్చు అనేది నా నమ్మకం. ఈ మాటలు తక్కిన జబ్బులకి వర్తిస్తాయేమో కానీ మానసిక సమస్యలతో బాధపడే చిన్నారులకు కాదు. అసాధ్యం అన్నారు చాలామంది. కానీ నేను ఎర్లీ ఇంటర్‌వెన్షన్‌ విధానంలో పిల్లలకే కాదు, కుటుంబానికీ ఊరట కలిగించవచ్చని నమ్మాను. పిల్లల్లో ఎదుగుదల లోపాలని గుర్తించిన వెంటనే వారికి స్పీచ్‌థెరపీ, ఫిజియోథెరపీ, ఎమోషనల్‌ డెవలప్‌మెంట్‌ వంటివి అందిస్తాం. అవయవ లోపాలని గుర్తించి సరిచేస్తాం. ఈ పద్ధతిలో మొదట రెండేళ్ల పిల్లలకి చికిత్స చేసి విజయం సాధించాను. ప్రస్తుతం నెలల పిల్లలకూ దీన్ని అందుబాటులోకి తెచ్చాం. పిల్లలు నోరు తెరచి వాళ్ల సమస్యని చెప్పలేరు. అలాంటప్పుడు తల్లిదండ్రులే ఆ పాత్ర తీసుకోవాలి. వాళ్లు మాట్లాడ్డం ఆలస్యం చేసినా, వస్తువులు గుర్తించలేకపోతున్నా, నేర్చుకోవడంలో ఆలస్యం చేస్తున్నారనిపించినా వెంటనే గుర్తిస్తే దానికి వైద్యం అందించడం తేలిక. ప్రస్తుతం నెలల శిశువు నుంచి ఆరేళ్ల పిల్లలు వరకు ఈ వైద్యం అందించి వాళ్లని మామూలు స్థితికి తీసుకొచ్చేందుకు కృషిచేస్తున్నా. ఇలాంటి పిల్లలని ముందుగానే గుర్తించడంపై అవగాహన కార్యక్రమాలు చేస్తున్నాం. అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలు, ప్లే స్కూళ్లకు వెళ్లి టీచర్లకు, ఆయాలకు మానసిక ఎదుగుదల లేని పిల్లలను గుర్తించడం ఎలానో శిక్షణ ఇస్తాం. అలాంటి పిల్లల్ని నా  దగ్గరకు పంపిస్తే నామ మాత్రపు రుసుముకే వైద్యం అందిస్తున్నా. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణాల్లోని స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నా. 2006 నుంచి మా వారు షేర్ల శ్రీనివాసరావుతో కలిసి మల్కాజిగిరిలోని ‘అభివృద్ధి చైౖల్డ్‌ రిహాబిలిటేషన్‌ కేంద్రం’ నడిపిస్తున్నా. మేం వైద్యం చేసిన వారిలో ఎంతోమంది సాధారణ పిల్లలతో కలిసి బడికి వెళ్తున్నారు. దాంతో ఏపీ, తెలంగాణాల నుంచే కాకుండా అమెరికా, కెనడా, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ వంటి దేశాల్లో స్థిరపడ్డ ఎన్నారైలు సైతం వాళ్ల పిల్లలను తీసుకొచ్చి ఏడాదిపాటు ఇక్కడే ఉండి నయం అయ్యాక వెళ్తున్నారు. ఆర్థిక స్థోమత లేని, నడవలేని పిల్లలకు లయన్స్‌ క్లబ్‌ ద్వారా క్యాలిపర్స్‌, వీల్‌ఛైర్లు వంటివి ఉచితంగా అందేట్టు చేస్తున్నాం. సేవను మించిన తృప్తి ఏముంటుంది? అయినా సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రోహిణి చేతుల మీదుగా సత్కారం అందుకోవడం మరిచిపోలేని అనుభూతి.

- గోవర్ధన్‌ రాజు, హైదరాబాద్‌

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్