రేలా రే రేలా.. పెళ్లిచూపులు భళా!

పెళ్లంటే రెండు మనసులు, రెండు కుటుంబాల కలయికని చెబుతాం. కానీ వాళ్ల సంప్రదాయంలో రెండు ఊళ్ల అనుబంధం కూడా. అందుకే తమ ఊరి అబ్బాయికి అమ్మాయిని ఎంపిక చేసేందుకు మహిళలే వేరే గ్రామానికి వెళ్తారు. అందుకు మైళ్ల దూరం నడుస్తూ, బృందాలుగా నృత్యం చేస్తూ, ఐక్యతకు తాము ప్రతిరూపమని చాటుతున్నారు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని ఆదివాసీ మహిళలు.

Published : 24 Oct 2022 00:41 IST

పెళ్లంటే రెండు మనసులు, రెండు కుటుంబాల కలయికని చెబుతాం. కానీ వాళ్ల సంప్రదాయంలో రెండు ఊళ్ల అనుబంధం కూడా. అందుకే తమ ఊరి అబ్బాయికి అమ్మాయిని ఎంపిక చేసేందుకు మహిళలే వేరే గ్రామానికి వెళ్తారు. అందుకు మైళ్ల దూరం నడుస్తూ, బృందాలుగా నృత్యం చేస్తూ, ఐక్యతకు తాము ప్రతిరూపమని చాటుతున్నారు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని ఆదివాసీ మహిళలు.

దీపావళి సందర్భంగా వారంపాటు జరిగే ‘దండారీ’ ఉత్సవాలకు ఆదివాసీల సంస్కృతిలో విశేష ప్రాధాన్యముంది.  దండారీలో పురుషులు గుస్సాడీ వేషధారణలో ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి వెళ్లి తమ నృత్యంతో ఆకట్టుకుంటారు. వారితోపాటు మహిళలు, యువతులు సైతం తమ గూడెం నుంచి ఆతిథ్యమిచ్చే మరో గూడేనికి ఎన్నో మైళ్లు నడిచి బృందంగా వెళ్తారు. అక్కడి పటేల్‌ సతీమణి ఆతిథ్యాన్ని స్వీకరిస్తారు. సాయంత్రం వరకూ గోండీలో పాటలు పాడుతూ ‘రేలా రేలా’ ఆడతారు. ఆ సమయంలో    దండారీగా వచ్చిన మహిళా బృందం పాడిన పాటలకు అవతలి బృందం సైతం జవాబుగా పాట పాడుతుంది. అదే సమయంలో ‘దండారీ’ పెళ్లిచూపులకు చక్కని వేదికగా నిలుస్తోంది. మహిళలు మరో ఊరికి వెళ్లి ఆత్మీయ బంధం పంచుకోవడంతో పాటు పెళ్లీడుకు వచ్చిన యువతులను గుర్తిస్తారు. ఆ యువతుల గురించీ, కుటుంబాల నేపథ్యాన్నీ తమ గ్రామ పెద్దల దృష్టికి తీసుకువచ్చి ‘పెళ్లి’లో తమదైన పాత్ర పోషిస్తారు. ఆదివాసీల్లో కట్నకానుకలు ఉండవు. దండారీ ఉత్సవాలే పెళ్లిచూపులకు వేదికగా నిలుస్తాయి. ఈ ఉత్సవాల్లో మహిళా బృందాలు కేవలం శాకాహారమే స్వీకరిస్తాయి. ఈ ఏడు తమకు ఆతిథ్యమిచ్చిన వారికి వచ్చే ఏడాది ప్రతిగా ఆతిథ్యమిచ్చే సంప్రదాయమూ ఈ ఉత్సవాల్లో కనిపిస్తుంది. మానవ సంబంధాలు, ఆత్మీయ బంధాల బలోపేతానికి వేదికగా ఈ వేడుకలు నిలుస్తున్నాయి.  

- డి.లక్ష్మీనర్సయ్య, ఆదిలాబాద్‌

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని