Budaraju Radhika: ఆ గుర్తింపు.. నా కెరియర్‌నే మలుపు తిప్పింది!

చరిత్రను తిరగ రాయాలంటే ఓర్పు ఉండాలి. నేర్పు కావాలి. నాయకత్వ లక్షణాలను అలవరుచుకోవాలి. కొత్త విషయాలను తెలుసుకోగలగాలి. ఇవన్నీ ఇటీవలే ఒడిశా డీజీపీ ర్యాంకుని అందుకున్న తొలి మహిళా ఐపీఎస్‌ ‘బూదరాజు రాధిక’లో పుష్కలంగా కనిపిస్తాయి.

Updated : 31 Oct 2022 09:23 IST

చరిత్రను తిరగ రాయాలంటే ఓర్పు ఉండాలి. నేర్పు కావాలి. నాయకత్వ లక్షణాలను అలవరుచుకోవాలి. కొత్త విషయాలను తెలుసుకోగలగాలి. ఇవన్నీ ఇటీవలే ఒడిశా డీజీపీ ర్యాంకుని అందుకున్న తొలి మహిళా ఐపీఎస్‌ ‘బూదరాజు రాధిక’లో పుష్కలంగా కనిపిస్తాయి. జిల్లా ఎస్పీగా  మొదలైన ఆవిడ ప్రస్థానం ఇప్పుడు దేశ సరిహద్దుల్ని కాపాడే ‘సశస్త్ర సీమాదళ్‌’లో ఏడీజీ హోదా వరకూ చేరింది. ఈ సందర్భంగా రాధిక ‘వసుంధర’తో ప్రత్యేకంగా మాట్లాడారు.

మార్పుని అంగీకరించగలిగే మనసు, లక్ష్యంపై గురిపెట్టగల ఏకాగ్రత... ఎంతటి కఠిన పరిస్థితులనైనా అవగాహన చేసుకునే నేర్పు ఉంటే చాలు... ఏదైనా చేయగలుగుతాం. మా కుటుంబాల్లో పోలీసులెవరూ లేరు. ఐపీఎస్‌ని ఎంచుకుంటా అన్నప్పుడు అమ్మ... ‘నువ్వసలే సున్నితం. అక్కడ కఠిన శిక్షణ, మనుషులు రాటుదేలి ఉంటార’ని భయపడింది. ఇప్పుడా అభిప్రాయాన్ని మార్చుకుందనుకోండి. నిజానికి మా తరంలో ఆడపిల్లలకి త్వరగా పెళ్లిళ్లు చేసేవారు. మా అమ్మానాన్నలు విశాల భావాలున్న వారు. ఆడపిల్ల నవ్వు, నడక, ఆహార్యం గురించి చుట్టుపక్కలవారు మాట్లాడుతుంటే... నీ దృష్టి లక్ష్యం మీద మాత్రమే పెట్టు అనేవారు. ముగ్గురు పిల్లల్నీ  బాగా చదివించారు. వారిచ్చిన ధైర్యమే మమ్మల్ని ఉన్నత స్థానాలకు తీసుకెళ్లింది.

అమ్మ వాళ్లది తెనాలి. నాన్నది కారంచేడు దగ్గర స్వర్ణ. నాన్న ఉద్యోగరీత్యా అమ్మమ్మ వాళ్లింట్లో ఉండి గుంటూరు జేకేసీ కాలేజీలో డిగ్రీ చేశా. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఎస్సీ (బాటనీ) చదివా. ఇంటర్‌ ఒక ఏడాది చిత్తూరులో చదివా. అక్కడ కృష్ణకుమారి అని స్నేహితురాలుండేది. వాళ్ల నాన్న ఆ జిల్లా కలెక్టర్‌. తరచూ వాళ్లింటికి వెళ్లేదాన్ని. వాళ్ల నాన్నని కలిసి కష్టాలను చెప్పుకోవడానికి రోజూ వచ్చే వాళ్లను చూసి నేనూ కలెక్టర్‌ అవ్వాలనుకున్నా.

పర్యావరణంపై ఆసక్తి...

ఉస్మానియాలో చేరాక సలీం అలీలా ఆర్నిథాలజిస్ట్‌ కావాలనుకున్నా. పీహెచ్‌డీకి దరఖాస్తు చేశా. యూజీసీ, సీఎస్‌ఐఆర్‌ స్కాలర్‌షిప్పులు వచ్చాయి. అప్పుడే మా సీనియర్లు కొందరు ఫారెస్ట్‌ సర్వీస్‌లో ర్యాంకులు సాధించారు. నా మనసూ అటు లాగింది. పరీక్షకు దరఖాస్తు చేశా. అయితే, తెలిసిన వారందరూ... సివిల్స్‌ ఎంచుకోమనడంతో రాస్తే ఐఆర్‌ఎస్‌ వచ్చింది. చేరలేదు. రెండో ప్రయత్నంలో ఐపీఎస్‌ వచ్చింది. పరీక్షకు సన్నద్ధమైనప్పటి పరిచయంతో మా వారు ‘ఐపీఎస్‌ కూడా ప్రజాసేవతో ప్రత్యక్ష సంబంధం ఉన్నదే. కచ్చితంగా బాగుంటుంది. ఆలోచించు’ అన్నారు. నాకూ నచ్చి ఐపీఎస్‌ని ఎంచుకున్నా.

సీఎం స్టేషన్‌కి ఫోన్‌ చేశారు...

ఒడిశా క్యాడర్‌కి ఎంపికయ్యా. రాష్ట్రంలో ‘తొలి మహిళా ఐపీఎస్‌’ అనే గుర్తింపు నా కెరియర్‌నే మలుపు తిప్పింది. పోస్టింగ్‌కి ముందు సీఎం బిజూ పట్నాయక్‌ నుంచి పిలుపు. ఆయన.. ‘ఏం రాధికా... జిల్లా బాధ్యతలు తీసుకోలేవా? అమ్మాయి కదా, మరో పోస్టు చూస్తామంటున్నారు సీనియర్లు’ అన్నారు. ‘జిల్లా బాధ్యతల్నే తీసుకోవాలని వచ్చా సర్‌. నన్ను నమ్మి, అవకాశం ఇస్తే చాలు’ అన్నా. వెంటనే సోన్‌పుర్‌ ఎస్‌పీగా బాధ్యతలు అప్పగించారు. మూడు నెలలు గడిచాయో లేదో ఆయనే ఫోన్‌ చేసి ‘జియో బాగా చేస్తున్నావు. నీ పనితీరు నచ్చింది’ అని ప్రశంసించారు. జియో అంటే ఒడియాలో అమ్మాయి అని. 24 గంటలూ సిబ్బందికి అందుబాటులో ఉండేదాన్ని. ఎవరెప్పుడు ఏ కష్టం వచ్చిందన్నా.... ప్రతిస్పందన వేగంగా ఉండాలనీ, ఎదుటి వారి బాధల్ని సున్నితంగా డీల్‌ చేయాలని మా సిబ్బందికి శిక్షణ ఇప్పించా. ఈ ఆలోచన సత్ఫలితాల్నిచ్చింది. తర్వాత ఖొర్దా జిల్లాలో విమెన్‌ సెల్‌ ఏర్పాటు చేశా. అందుకే తర్వాత రాష్ట్ర మంతటా ఏర్పాటైన విమెన్ సెల్స్ లో నాకు కీలక పాత్ర పోషించే అవకాశం దక్కింది. 

సూపర్‌ సైక్లోన్‌...

కెరియర్‌లో గుర్తుండిపోయే అనుభవం 1999 తుఫాను. నెలల పాటు ఇంటికే వెళ్లలేదు. తర్వాత డిప్యుటేషన్‌ మీద హైదరాబాద్‌ సీబీఐలో ఎస్‌పీగా, డీఐజీగానూ చేశా. అక్కడే కేసుల పరిశీలన ఎంత నిర్మాణాత్మకంగా ఉండాలో నేర్చుకున్నా. ఆపై ఒడిశా స్టేట్‌ విజిలెన్స్‌, ఆర్మ్‌డ్‌ పోలీస్‌, నార్కొటిక్‌ సెంట్రల్‌లో పనిచేశా. అక్కడి నుంచి పదోన్నతిపై సశస్త్ర సీమాబల్‌లో ‘అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌’గా చేస్తున్నా. నేపాల్‌, భూటాన్‌ సరిహద్దుల్లో 90,000 మంది భద్రతా దళాలను పర్యవేక్షించే బాధ్యతలో ఉండటం ఒకింత గర్వంగానూ ఉంటుంది. మావారు జీవీవీ శర్మదీ గుంటూరే. 86 బ్యాచ్‌ ఐయ్యేఎస్‌ అధికారి. మాకో పాప, బాబు. ఇద్దరూ పిల్స్‌బరీలో లా చేసి ఉద్యోగాలు చేస్తున్నారు.  అన్నట్లు చెప్పలేదు కదూ... ఎక్కడ పని చేసినా... ఏం నేర్చుకున్నాం, ఏం నేర్పాం అన్నదే ముఖ్యం. అదే వ్యవస్థను బలోపేతం చేస్తుంది. మనకీ గుర్తింపు తెస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్