కాళ్లు లేకున్నా నడిచింది.. నడిపిస్తోంది..
పోలియో వల్ల తాను పడిన బాధలు ఇతరులు పడకూడదనుకుందామె. ఒక ట్రస్ట్ ఆరంభించింది. ఆ మార్గంలో వారిని నడిపించడమే కాదు, ఆ దారి తన వృద్ధికి దారితీసి అపూర్వ ఆత్మవిశ్వాసాన్ని నింపింది.
పోలియో వల్ల తాను పడిన బాధలు ఇతరులు పడకూడదనుకుందామె. ఒక ట్రస్ట్ ఆరంభించింది. ఆ మార్గంలో వారిని నడిపించడమే కాదు, ఆ దారి తన వృద్ధికి దారితీసి అపూర్వ ఆత్మవిశ్వాసాన్ని నింపింది. సేవాపథంలో సంతృప్తి పొందుతూ మరెందరికో మార్గగామిగా నిలిచింది మధుమైఖురీ.
అందాకా ఆడుతూపాడుతూ తిరుగుతున్న చిన్నారి మధుకు పన్నెండేళ్ల వయసులో రెండు కాళ్లకూ, ఒక చేతికీ పోలియో వచ్చింది. ఆ బాధను దిగమింగడం ఒక ఎత్తయితే సాటివారు చూపించే సానుభూతి మరీ దుర్భరమనిపించేది. స్వతంత్రంగా నిలబడి, ఈ జాలికబుర్లు వినిపించనంత ఎత్తుకు ఎదగాలి అనుకుంది, దాన్ని సాకారం చేసుకుంది. ఉత్తరాంచల్ గ్రామీణ బ్యాంకులో ఉన్నతాధికారిగా పదవీ విరమణ చేసిన మధుమైఖురీ.
‘నా వైకల్యం నాకెన్నో అవకాశాలను కల్పించినట్లయింది. నేనెంతో చేయొచ్చు, చేయాలి అనుకున్నాను. ఘర్వాల్‌కు చెందిన క్రియాశీలి మోహన్ జాగుడి నాకు ఆదర్శం. ఆమె ప్రభావంతో 1997లో గోకుల్ సంస్థను ఆరంభించాను. ఈ పాతికేళ్లలో పదివేలమంది వికలాంగులకు సాయం చేయగలిగాను. సంస్థ నెలకొల్పి మూడేళ్లయిన సందర్భంగా 2000 సంవత్సరంలో భారీ ఎత్తున మెడికల్ క్యాంప్ నిర్వహించాం. 800 మందికి మూడు చక్రాల సైకిళ్లు, వీల్‌చెయిర్లు, ఊతకర్రలు ఇచ్చాం. 2007లో ఆరంభించిన ఫిజియోథెరపీ సెంటర్‌లో 4 వేల మందికి పైగా లబ్ధి పొందుతున్నారు. 2010లో మొదలైన కృత్రిమ అవయవాలను అమర్చే ప్రోస్థెసిస్ సెంటర్‌లో 502 మంది లబ్ధి పొందారు.
రామాయణం స్ఫూర్తి
నా చిన్నతనంలో అమ్మ రోజూ నాన్నమ్మకు రామాయణం చదివి వినిపించేది. రాముడి దుఃఖ వర్ణన విన్నప్పుడు నా శారీరక బాధ చాలా చిన్నదనిపించింది. పోలియో వ్యాధి నుంచి ఎలా నెట్టుకురావాలని అమ్మానాన్నల్ని అడిగాను. వాళ్లకీ ఏం చెప్పాలో తోచలేేదు. అయితే కొన్నేళ్ల తర్వాత ఎడమచేతికి సర్జరీ చేశారు. నేనున్న స్థితిలో పెళ్లి వద్దనిపించింది. అమ్మానాన్నా నా నిర్ణయాన్ని గౌరవించి ఒత్తిడి చేయలేదు. నేను ఒంటరిగా ఉన్నా ఎందరో వికలాంగులకు పెళ్లిళ్లు చేసే అదృష్టం కలిగింది. గోకుల్ సంస్థ సేవానిరతి, లక్ష్యాలను విశ్వసించిన ప్రభుత్వం ఎంతగానో సహకరిస్తోంది. మా ఉద్యమ స్ఫూర్తితో రాష్ట్రవ్యాప్తంగా 252 మంది వికలాంగులైన చిన్నారులకు ప్రభుత్వం సాయం చేసింది. ఆరోగ్యపరంగానే కాకుండా పిల్లలూ పెద్దలకు తర్ఫీదిచ్చేందుకు రుద్రప్రయాగ్ జిల్లాలో కంప్యూటర్ ట్రైనింగ్ కేంద్రాన్ని నెలకొల్పాం. సేవా సంస్థలన్నీ ఏకతాటిమీద నడిస్తే మరింత ఎక్కువమందికి ప్రయోజనం చేకూరుతుంది’ అంటారీమె.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.