Updated : 09/11/2022 04:28 IST

రైతన్నల్లో జీవాన్ని నింపి...

దేశంలోనే అక్కడ రైతుల ఆత్మహత్యలు ఎక్కువని పలు సర్వేలు చెప్పాయి. ఆమె అక్కడ అడుగు పెట్టకముందు  రైతులంతా అప్పుల్లో కూరుకుపోయి సేద్యమంటేనే భయపడ్డారు. ఆమె తయారుచేసి అందించిన జీవపురుగు మందులు  వ్యవసాయానికి జీవం పోశాయి. రైతన్నల ఆత్మహత్యలు తగ్గడానికి కృషి చేస్తూ.. వేలమంది మహిళలకు సాధికారతనూ కల్పిస్తున్న సంగీత సవ్వాలఖే స్ఫూర్తి కథనమిది.

సంగీత ఓసారి క్షేత్రస్థాయి పరిశీలనకు విదర్భకి దగ్గర్లోని సింధెవాహికి గ్రామానికి వెళ్లారు. అక్కడి రైతులు... వ్యవసాయమెంత భారంగా మారిందో ఆమెతో చెప్పుకుని బాధ పడ్డారు. సేద్యం కోసం ఎరువులూ, మందులూ కొనడానికి తల తాకట్టు పెడుతున్నామన్నారు. అప్పటికే అక్కడ రైతుల ఆత్మహత్యలతో ఎంతో మంది తమ కుటుంబ పెద్దల్ని  కోల్పోయి అనాథలుగా మారడం చూసిన సంగీత తనవంతుగా ఏదైనా సాయం చేయాలనుకున్నారు. 

పరిశోధనగా..

సంగీత తండ్రి కహరే నాగ్‌పూర్‌ వ్యవసాయ కళాశాలలో ఆచార్యులు. కీటకాలు, పురుగులపై పరిశోధన చేసే వారు. తండ్రి నుంచి స్ఫూర్తి పొందిన సంగీత అదే మార్గాన్ని ఎంచుకున్నారు. అగ్రికల్చర్‌ బీఎస్‌సీ తర్వాత ఎంటమాలజీ (కీటకశాస్త్రం)లో పీజీ చేశారీమె. ఫీల్డ్‌ విజిట్‌ కోసం సింధెవాహి వెళ్లినప్పుడు అక్కడ చూసిన రైతుల కష్టాలను తండ్రితో చర్చించారు. సేంద్రియ వ్యవసాయం గురించి అప్పుడే తనకొక ఆలోచన వచ్చిందంటారీమె. ‘విదర్భకు వెళ్లడం నా జీవితానికొక లక్ష్యం వచ్చేలా చేసింది. అక్కడున్న 11 జిల్లాల్లో 60 శాతం వ్యవసాయం చేస్తారు. అప్పులభారంతో కొందరు ఆత్మహత్య చేసుకున్నారు. రసాయనరహితమైన ఎరువులవాడకం, బయోపెస్టిసైడ్స్‌ (జీవపురుగు మందులు)తో సేద్యంలో దిగుబడి బాగుంటుంది. ఈ ఆలోచనను ఉపయోగించి ఆ రైతులకు సాయం చేయాలనిపించింది’ అంటారు సంగీత.

తగ్గిన ఆత్మహత్యలు..

చదువయ్యాక ఈఎన్‌టీ వైద్యుడితో వివాహమై, యవత్మాల్‌కు వెళ్లారు సంగీత. తన ఆలోచనను కార్యరూపంలోకి తేవడానికి ఇంట్లోనే చిన్న ల్యాబ్‌ ఏర్పాటు చేసి పరిశోధనలు ప్రారంభించారు. స్థానిక వ్యవసాయ అధికారుల సమావేశాలకు, చర్చలకు హాజరయ్యేవారు. రైతులకు రసాయనరహిత పంటలపై అవగాహన కలిగించేవారు. ‘రసాయనాలు వేయకపోతే.. ప్రత్యామ్నాయం ఏంటని రైతులు అడిగే వారు. అప్పుడే బయోపెస్టిసైడ్స్‌ తయారీ ఆలోచన వచ్చింది. 2008లో ‘విదర్భ బయోటెక్స్‌’  ప్రారంభించా. ప్రొడక్షన్‌ యూనిట్‌ కోసం బ్యాంకులో రూ.40 లక్షలు రుణం తీసుకున్నా. ప్రభుత్వం 40శాతం సబ్సిడీ ఇచ్చింది. ప్రస్తుతం 16రకాల బయో పెస్టిసైడ్స్‌ తయారు చేస్తున్నాం. మావద్ద 30 మంది పని చేస్తున్నారు. ఈ ఉత్పత్తులను రైతులకు తక్కువ ధరకు అందిస్తున్నాం. ఎన్జీవోలు, రైతు సంఘాలు, కొన్ని కార్పొరేట్స్‌ మావద్ద వీటిని కొనుగోలు చేసి రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేస్తున్నారు. ఇప్పుడిక్కడ ఆత్మహత్యల శాతం తగ్గింది’ అంటోన్న సంగీత రైతులకు చేయూతగా నిలుస్తున్నందుకు కేంద్ర వ్యవసాయశాఖ నుంచి ఎక్సలెన్స్‌ అవార్డు సహా ఎన్నో పురస్కారాలను అందుకున్నారు. ఈ ఉత్పత్తులకు మహారాష్ట్ర సహా పంజాబ్‌, ఒడిశా తదితర ప్రాంతాలనుంచి పెద్ద మొత్తంలో ఆర్డర్లు వస్తున్నాయి. గతేడాది ఆ సంస్థ వార్షికాదాయం రూ.80 లక్షలు కాగా, స్థానిక స్వయం సహాయక బృందాలతో అనుసంధానమై, మహిళలకు ఆర్థిక స్వావలంబన కలిగించడానికి ఈ ఉత్పత్తులను 25 శాతం తగ్గింపు ధరకు అందిస్తున్నారు సంగీత. ఇప్పుడు మొత్తం 10వేల మంది మహిళలు ఈ సంస్థతో కలిసి పనిచేస్తుండగా, 15 వేలమంది రైతులిప్పుడు అక్కడ సేంద్రియ విధానాలను అనుసరిస్తున్నారు. ఈ విజయాల స్ఫూర్తితో మరిన్ని రకాల ఉత్పత్తులపై సంగీత ప్రయోగాలు చేస్తున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని