కళ్లముందే చనిపోయినా కర్తవ్యాన్ని ఆపలేదు...

డాక్టర్‌ ఎప్పుడొచ్చినా కనీసం నర్సైనా కనపడుతూ ఉంటే... రోగులకు కొండంత ధైర్యం. అందుకే తనకంటే ఎక్కువగా వృత్తిని ప్రేమించారావిడ... కట్టుకున్న వాడినీ, తోబుట్టువునీ కొవిడ్‌ పొట్టన పెట్టుకున్నా... తన సేవలు ఆపలేదు.

Updated : 12 Nov 2022 07:39 IST

డాక్టర్‌ ఎప్పుడొచ్చినా కనీసం నర్సైనా కనపడుతూ ఉంటే... రోగులకు కొండంత ధైర్యం. అందుకే తనకంటే ఎక్కువగా వృత్తిని ప్రేమించారావిడ... కట్టుకున్న వాడినీ, తోబుట్టువునీ కొవిడ్‌ పొట్టన పెట్టుకున్నా... తన సేవలు ఆపలేదు. ఆ అంకితభావమే విజయవాడ జీజీహెచ్‌ నర్సు మిర్యాల ఝాన్సీకి జాతీయ ‘ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌’ పురస్కారాన్ని అందించింది. ఈ సందర్భంగా ఆవిడ వసుంధరతో తన సంతోషాన్ని పంచుకున్నారిలా...

‘మన ప్రతి మాటా ప్రేమగా ఉండాలి. ప్రతి పనీ నిస్వార్థంగా చేయాలి. బాధలో ఉన్నవారికి సాంత్వన నిచ్చేందుకు వీటికి మించిన కానుకలేముంటాయి’ అన్న మదర్‌ థెరిసా మాటలే నాకు స్ఫూర్తి. ఇరవై ఏడేళ్లుగా ఈ వృత్తిలో ఉన్నా. పురిటి బిడ్డల్ని చూసి సంతోషపడే తల్లులూ, కొన ఊపిరితో ఉన్నా కాపాడుకోలేకపోతామా అన్న ఆశతో తిరిగే కుటుంబాలెన్నింటినో నా ప్రయాణంలో చూశా. గుండెల్ని పిండేసే సంఘటనలెన్నో ఎదురయ్యాయి. వైద్యులు రోగనిర్ధరణ చేస్తారు, మందులు రాసిస్తారు, శస్త్ర చికిత్సలూ చేస్తారు. వాటికి కొనసాగింపుగా మా సపర్యలే రోగులకు ఉపశమనం ఇస్తాయి. అందుకే, ఎవరే సమయంలో పిలిచినా స్పందించడం అలవాటు చేసుకున్నా.

ఎన్నో విభాగాల్లో...

నా మేనత్తలు, అక్క... ఇంకా చాలామంది కుటుంబ సభ్యులు ఈ రంగంలో ఉన్నారు. వారందరినీ చూస్తూ పెరిగా. అందుకేనేమో తెలియకుండానే ఈ వృత్తిపై ఇష్టం పెరిగింది. విజయవాడ సెయింట్‌ ఆన్స్‌లో జీఎన్‌ఎం, పీబీ బీఎస్సీ (ఎన్‌) కోర్సులు చేశా. విజయవాడ బోధనాసుపత్రిలోని ఐసీయూ, ఎన్‌సీయూ, ట్రామా, ఎమర్జింగ్‌, న్యూరో, బర్న్స్‌, లెప్రసీ, ఆంకాలజీ... ఇలా ఎన్నో విభాగాల్లో పని చేశా. సీఎం కాన్వాయ్‌లోని అంబులెన్సులోనూ విధులు నిర్వర్తిస్తుంటా.

పీపీఈ కిట్‌ వేసుకుని మరీ...

మాది ప్రేమ వివాహం. మాకిద్దరు అబ్బాయిలు. పెద్దబ్బాయి ఐఐటీలో గ్రాడ్యుయేషన్‌ చేసి పెట్రోలియం సంస్థలో పనిచేస్తున్నాడు. చిన్నవాడు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. నేనిలా, ఇంత పని చేయగలిగానంటే ఇంటా బయటా మా వారు తోట శివ నాగేశ్వరరావు మద్దతే కారణం. కొవిడ్‌ ప్రారంభంలోనే ఆయన దాని బారిన పడ్డారు. అప్పటికి ఎలాంటి వైద్యం చేయాలన్న దానిపై గైడ్‌లైన్స్‌ లేవు. రోగుల బంధువులెవరూ కనీసం ఆసుపత్రి దరిదాపుల్లోకి వెళ్లే అవకాశమూ లేదు. పీపీఈ కిట్‌ వేసుకుని ఆయనకు సేవలు చేశా. అక్కడున్న ఇతర కొవిడ్‌ రోగులకూ మనోధైర్యం కల్పించేదాన్ని. ఎంత చేసినా మా వారు నా కళ్లముందే ఊపిరి తీసుకోలేక విలవిల్లాడుతూ చనిపోవడం నన్నెంతో కలచివేసింది. తర్వాత కొద్దిరోజులకే ఆయుర్వేద వైద్యురాలైన మా అక్క ప్రసన్నలక్ష్మి కూడా కొవిడ్‌ బారిన పడింది. తన బాధ్యతలూ నేనే తీసుకున్నా... అయినా దక్కించుకోలేకపోయా. ఆసుపత్రి వాతావరణం రోగులను కంగారు పెట్టిస్తుంది. ఆ భయాన్ని పొగొట్టడానికే ప్రాధాన్యమిస్తా. మందుల్ని వైద్యుల సిఫారసు ప్రకారం కచ్చితమైన వేళల్లో ఇవ్వాలి. ఆహారాన్ని అందించడంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. కొవిడ్‌లో కొందరు భయంతోనే ప్రాణాలు పొగొట్టుకున్నారు. అందుకే ఆ సమయంలో మానసికంగా నేనెంత కుంగి పోయినా...

నా అవసరం ఆసుపత్రిలోనే ఎక్కువుందని వెంటనే విధుల్లో చేరిపోయా.

అత్యవసర సమయాల్లో సముచిత వైద్య పద్ధతులను పాటిస్తూ... ఎందరివో ప్రాణాలు కాపాడానని అధికారులు ఈ అవార్డుకు నా పేరును సిఫారసు చేశారు. అపార నైపుణ్యం, అంకితభావం ఉన్న ఎందరో గొప్ప వైద్యులు, నర్సులు, సిబ్బందితో కలసి పని చేస్తూ వచ్చాను... వారి నుంచి ఎంతో నేర్చుకున్నాను.

2021 ఏడాదికి తెలుగు రాష్ట్రాల నుంచి నేనొక్కరినే ఈ అవార్డుకి ఎంపికయ్యా. రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ చేతుల మీదుగా ఈ పురస్కారం అందుకోవడం నా బాధ్యతల్ని మరింతగా పెంచింది. గత పదమూడేళ్లలో 14 ప్రశంసా పత్రాలు అందుకున్నా. అన్నింటి కన్నా... ఓ రోగి కోలుకుని ఆరోగ్యంగా ఇంటికెళ్లినప్పుడు వచ్చే సంతోషమే గొప్పగా అనిపిస్తుంది.

- ఇట్టా సాంబశివరావు, అమరావతి

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని