వివక్షపై పోలీసు పోరాటం!

పని ఒక్కటే. కానీ గుర్తింపుకొచ్చేసరికి ‘ఆడ’, ‘మగ’ తేడా! ప్రభుత్వమూ ఇదే ధోరణి ప్రదర్శిస్తే సమానత్వానికి తావేది? దీన్నే నిలదీశారు వినయ. దాని కోసం 23 ఏళ్ల నుంచి పోరాడుతున్నారు. ఎట్టకేలకు హైకోర్టు నుంచి స్పందన దొరకడమే కాదు.. వ్యవస్థలో మార్పుకీ కారణమయ్యారు. ఇలా ఎన్నో రకాల వివక్షల మీద ఆవిడ యుద్ధం చేస్తున్నారు...!

Updated : 16 Nov 2022 01:05 IST

పని ఒక్కటే. కానీ గుర్తింపుకొచ్చేసరికి ‘ఆడ’, ‘మగ’ తేడా! ప్రభుత్వమూ ఇదే ధోరణి ప్రదర్శిస్తే సమానత్వానికి తావేది? దీన్నే నిలదీశారు వినయ. దాని కోసం 23 ఏళ్ల నుంచి పోరాడుతున్నారు. ఎట్టకేలకు హైకోర్టు నుంచి స్పందన దొరకడమే కాదు.. వ్యవస్థలో మార్పుకీ కారణమయ్యారు. ఇలా ఎన్నో రకాల వివక్షల మీద ఆవిడ యుద్ధం చేస్తున్నారు...!

వినయ ఎన్‌ఏ.. కేరళలోని త్రిశూర్‌లో కానిస్టేబుల్‌గా కెరియర్‌ ప్రారంభించారు. ప్రభుత్వ దరఖాస్తులు, ఎఫ్‌ఐఆర్‌ లాంటి వాటిలో మహిళలకు స్థానం లేకపోవడాన్ని గమనించారావిడ. ఎక్కడైనా వివరాలు రాయాల్సి వస్తే ‘సంరక్షుడి’గా నాన్న పేరు, అమ్మాయి పెళ్లైతే భర్త పేరుంటుంది. ఇద్దరూ లేనప్పుడే అమ్మ ప్రస్తావన.. ఇది లింగ వివక్షే కదా? అంటూ 1999లో ఆవిడ కోర్టులో కేసు వేశారు. తన వాదనను సమర్థిస్తూ 2001లో తీర్పూ వెలువడింది. అప్పటి నుంచి వెంటాడుతుంటే దీన్ని అమల్లోకి తీసుకొస్తున్నట్టుగా అడ్మినిస్ట్రేటివ్‌ రిఫార్మ్స్‌ కమిటీ తాజాగా సర్క్యులర్‌ విడుదల చేసింది. భర్తకు బదులుగా భాగస్వామి, తండ్రితోపాటు తల్లి పేరు చేర్చడం వంటి ఎన్నో మార్పులకు అందులో చోటిచ్చారు. ‘ఇప్పటికైనా మార్పు మొదలైనందుకు సంతోషం. నేనీ పిటిషన్‌ వేసేప్పుడు నువ్వు చేసేది పిచ్చి పని. ఆ దరఖాస్తు నేరుగా చెత్తబుట్టలోకే వెళ్తుంది అని గేలి చేశారంతా. రిట్‌ పిటిషన్‌ సిద్ధం చేయడంలో సాయం చేసిన హైకోర్టు క్లర్క్‌ ఒక్కరే అభినందించారు. ఒక్కరైనా తోడు నిలిచారన్న భావన నాలో మరింత విశ్వాసాన్ని పెంచింది’ అని చెబుతారీమె.

గ్రౌండ్‌లు అబ్బాయిలకేనా?

పోలీసులకు ఏటా ఆటల పోటీలుంటాయి. అయితే అవి మగవారికే! మేమెందుకు అర్హులం కాదంటూ వినయ ప్రశ్నించారు. మహిళా కానిస్టేబుళ్లపై పై అధికారుల చెడు ప్రవర్తననీ బయటపెట్టారు. మగ, ఆడ కానిస్టేబుళ్లంటూ తేడాలుండకూడదని పోరాడారు. ఈ 33 ఏళ్లలో ఇలాంటి పోరాటాలెన్నో! కొన్నిసార్లు సస్పెండ్‌ అయినా గౌరవంగా తిరిగొచ్చారు. జీవితంలో ఆటల పరిచయం లేని గ్రామీణ మహిళల్ని మైదానాల్లో దింపారు. 2014లో విమెన్‌ ఇంటిగ్రేషన్‌ అండ్‌ గ్రోత్‌ త్రూ స్పోర్ట్స్‌ (వింగ్స్‌) అనే సంస్థని ప్రారంభించి ఫుట్‌బాల్‌, వాలీబాల్‌ ఆటల్లో శిక్షణివ్వడమే కాదు.. మగవారితో కలిపి పోటీలూ నిర్వహిస్తున్నారు. వీరిలో 35 ఏళ్లకు పైబడినవారే ఎక్కువ. కేరళలో ఓనమ్‌ సమయంలో ‘పులికలి’ నిర్వహిస్తారు. మగవాళ్లు శరీరంపై పులిలా పెయింటింగ్‌ చేసుకొని డప్పుల చప్పుళ్లకు నృత్యం చేస్తారు. 2016లో ఆసక్తి ఉన్న మహిళలకి ‘వింగ్స్‌’ ద్వారా పులికలి శిక్షణిచ్చి, పాల్గొనేలా చూడటంతోపాటు ఆవిడా పాదం కదిపారు. అప్పట్నుంచి రాష్ట్రవ్యాప్తంగా మహిళలూ ఇందులో పాల్గొనడం ప్రారంభమైంది. 55 ఏళ్ల వయసులో ఆవిడ కేరళ సంప్రదాయ నృత్యం ఒట్టంతుల్లల్‌ నేర్చుకున్నారు. నవరాత్రుల్లో మగవాళ్లు చేసే ఈ నృత్యాన్ని ఈ ఏడాది వేడుకల్లో ప్రదర్శించారు కూడా. ‘ఇవేవీ ఎవరికో వ్యతిరేకంగా చేసినవి కాదు. మహిళ అన్న కారణంతో ఆంక్షలు ఎందుకు ఉండాలి? అందరికీ సంతోషంగా ఉండే హక్కు ఉంది. దాన్ని కాపాడేందుకు ఇది నా వంతు ప్రయత్న’మంటున్న వినయ ఇప్పుడు ఇరింజల్‌కుడా గ్రామీణ మహిళా పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌ఐ. తన అనుభవాలను ఓ పుస్తక రూపంలోనూ తీసుకొస్తున్నారట.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్