అటు వైద్యం... ఇటు నాట్యం
నలభయ్యో పడిలోకి అడుగు పెట్టగానే పెద్దరికం వచ్చేస్తుంది. ఏం చేయాలన్నా ‘ఎవరేమనుకుంటారో’ అని వెనకడుగు వేసేవారే ఎక్కువ. డాక్టర్ ఓగిరాల వెంకట ఇందిర మాత్రం అలా కాదు. యాభై దాటాక చదువులు మొదలు పెట్టారు. 58 ఏళ్ల వయసులో భరతనాట్యం నేర్చుకుని పోటీ పడుతూ ప్రదర్శనలు ఇస్తున్నారు.
నలభయ్యో పడిలోకి అడుగు పెట్టగానే పెద్దరికం వచ్చేస్తుంది. ఏం చేయాలన్నా ‘ఎవరేమనుకుంటారో’ అని వెనకడుగు వేసేవారే ఎక్కువ. డాక్టర్ ఓగిరాల వెంకట ఇందిర మాత్రం అలా కాదు. యాభై దాటాక చదువులు మొదలు పెట్టారు. 58 ఏళ్ల వయసులో భరతనాట్యం నేర్చుకుని పోటీ పడుతూ ప్రదర్శనలు ఇస్తున్నారు. అభిరుచి ఉంటే చాలు.. సాధించడానికి వయసు అడ్డు కాదంటున్న ఆవిడ ప్రస్థానాన్ని వసుంధరతో పంచుకున్నారు...
పుట్టింది కృష్ణాజిల్లా, నందిగామ. మా నాన్న ఆదాయపన్ను అధికారిగా రాజమహేంద్ర వరంలో పనిచేశారు. దీంతో నా చదువంతా అక్కడ, కాకినాడల్లోనే. రంగరాయ మెడికల్ కాలేజ్‌లో వైద్యవిద్య పూర్తిచేసి, ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలందిస్తున్నా. చిన్నప్పుడు శాస్త్రీయ నృత్యం కొన్నాళ్లు నేర్చుకున్నా. కానీ చదువుకు ఇబ్బందని పక్కన పెట్టేశా. తర్వాత కొనసాగించే వీల్లేకపోయింది. కొన్నేళ్ల క్రితం నాకు ఆర్థరైటిస్‌తో నడకా కష్టమైంది. దీంతో ఫిజియోథెరపీ తప్పనిసరైంది. వ్యాయామం మనసుకీ ఆనందాన్నిస్తే మంచిదని భరతనాట్యం మీద దృష్టిపెట్టా. అప్పటికి నాకు 58 ఏళ్లు.. గురువు పెదిరెడ్ల వరలక్ష్మి దగ్గర శిక్షణకు చేరా. కొద్దికాలంలోనే ప్రదర్శనలూ ప్రారంభించా. ఈ నాలుగేళ్లలో మన రెండు రాష్ట్రాల్లో 40కుపైగా ప్రదర్శనలూ ఇచ్చా.
సమన్వయం తేలికే!
ఇప్పుడు నాకు 62 ఏళ్లు. తణుకు ప్రభుత్వ ఆసుపత్రిలో సివిల్ సర్జన్ ఆర్‌ఎంఓగా చేస్తున్నా. ఉండేదేమో కోరుకొండ. రోజూ ఫలానా సమయానికే, ఇన్ని గంటల సాధన... ఇలా నిబంధనలు పెట్టుకోను. ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు సాధన చేస్తుంటా. శిక్షణనీ కొనసాగిస్తున్నా. ఎక్కడికి ప్రదర్శన కోసం వెళ్లినా మావారు లక్ష్మాజీరావు నావెంట ఉండాల్సిందే. ఆయనది రాజమండ్రి. బ్యాంకు మేనేజర్‌గా చేశారు. ఈ వయసులో భలే చేస్తున్నారని అందరూ పొగుడుతుంటారు. అందుకున్న పురస్కారాలూ ఎన్నో! జానపద నృత్యోత్సవంలో ఎక్స్‌లెన్స్ అవార్డు, హైదరాబాద్‌లో మహానంది నాట్య ఉత్సవాల్లో శివనంది, తిరుపతి నృత్యోత్సవంలో నాట్య మంజరి పురస్కారాలు మాత్రం ప్రత్యేకం. ఒకసారి రాజమహేంద్రవరంలో 100 గంటల నిర్విరామ నృత్యోత్సవం నిర్వహించారు. దీనిలో డ్యాన్స్ ఆగకుండా ఒకరి తర్వాత ఒకరు అందుకుంటూ కొనసాగిస్తారు. అందులో నేనో అరగంట నృత్యం చేయడం మర్చిపోలేని అనుభూతి. అప్పటికి నాకు 59 ఏళ్లు!
వెనకబడొద్దని!
వయసు అంటూ వెనకడుగు వేస్తాం కానీ.. అదసలు అడ్డే కాదు. మా ఇద్దరు పిల్లలూ వైద్యులే! అమ్మాయి పుట్టాక నాకు మెడిసిన్‌లో సీటొచ్చింది. కోర్సు మధ్యలో బాబు పుట్టాడు. వీళ్లను చూసుకుంటూనే చదువుకున్నా. పిల్లలిద్దరి పీజీలయ్యాక నేనూ మళ్లీ చదువు కొనసాగించా. 52 ఏళ్ల వయసులో ఎండీ చేశా. 55 ఏళ్లకు ఎంబీఏ చదివా. మంచి గైనకాలజిస్ట్‌గా నాకు చుట్టుపక్కల పేరుంది. ఏదైనా కష్టమైన కేసులు వచ్చినప్పుడు దాని గురించి మా పిల్లలతోనూ చర్చిస్తుంటా. కాలంతో పరుగులు తీస్తున్న రోజులివి. వాళ్ల ఆధునిక ఆలోచనలకు తగ్గట్టుగా సాగాలంటే అందుకు తగ్గ పరిజ్ఞానం తప్పని సరి. పైగా అప్పటివరకూ వాళ్లకు నేనే మార్గదర్శి. వాళ్లతో సమానంగా సాగాలంటే నేనూ నేర్చుకుంటూనే ఉండాలి, వెనక బడిపోకూడదు అనిపించింది. అందుకోసమే ఎండీ చేశా. గతంలో నేర్చుకున్నవన్నీ వైద్యాంశాలే! ఆసుపత్రి నిర్వహణ గురించి తెలుసుకోవాలనిపించి హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్‌లో ఎంబీఏ చేశా. భవిష్యత్తులో సొంత ఆసుపత్రి ప్రారంభించే ఆలోచనా ఉంది. కుటుంబ ప్రోత్సాహం వల్లే కోరుకున్నవన్నీ చేయగలుగుతున్నా. మా అమ్మకి 80 ఏళ్లు. నేను నర్తిస్తోంటే చాలా ఆనందిస్తుంది. ఒకే జీవితం మరి... సాధించాలిగా! మీరూ.. ఏదైనా చేయాలనిపిస్తే ధైర్యంగా చేసేయండి. ఎవరో ఏదో అనుకుంటారని కూర్చోవద్దు. ఎవరికైనా నేనిచ్చే సలహా ఇదే!
- సత్యం శ్రీనివాసు, కోరుకొండ తూర్పుగోదావరి
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.