..ఆమెలా మరెవ్వరికీ కాకూడదని!

భర్త, తండ్రి... ఎవరో ఒకరు అండగా ఉన్నప్పుడు ఆర్థిక ఇబ్బందులంటే ఏంటో మనకి తెలియకపోవచ్చు. అలాంటి తోడు కోల్పోయినా... బెదిరిపోకుండా మహిళలు తమ కాళ్లపై తాము నిలబడేలా చేయాలనుకున్నారు సూర్యదేవర వనిత.

Published : 18 Nov 2022 00:16 IST

భర్త, తండ్రి... ఎవరో ఒకరు అండగా ఉన్నప్పుడు ఆర్థిక ఇబ్బందులంటే ఏంటో మనకి తెలియకపోవచ్చు. అలాంటి తోడు కోల్పోయినా... బెదిరిపోకుండా మహిళలు తమ కాళ్లపై తాము నిలబడేలా చేయాలనుకున్నారు సూర్యదేవర వనిత. అందుకే వందలమందికి చేయూతనిచ్చి ఉపాధి బాటపట్టిస్తున్నారు...

తోటి వారు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు చేతనైన సాయం చేయడం వనితకు అలవాటు. భర్త ప్రభుత్వ ఉపాధ్యాయుడు. వీళ్లది జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా, కాటారం. ‘18 ఏళ్ల కిందట నా స్నేహితురాలి భర్త చనిపోయారు. ఇద్దరు పిల్లలున్న తనకి బతకడానికే దారీ లేదు. తనకి ధైర్యం చెప్పి, తోచిన సాయం చేశాక కుదుటపడి.. ఓ చిరుద్యోగం సంపాదించుకుంది. ఆ సంఘటన నన్ను మార్చేసింది. అప్పటినుంచి ఆడవాళ్లకు వీలైనంత అండగా నిలబడాలని అనుకున్నా. మా పక్క మండలం మహదేవపూర్‌లో మహిళలకు కుట్టు శిక్షణ ఇస్తున్నారని తెలిసి, వెళ్లి నేర్చుకున్నా. అక్కడే ఆర్నెల్లు శిక్షకురాలిగా చేశా. తర్వాత కాటారంలో ఉచిత శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశా. నా చొరవ చూసిన ఐకేపీ అధికారులు.. ఎక్కడ కార్యక్రమాలు ఉన్నా పిలిచేవారు. అలా జిల్లా అంతా తిరిగి శిక్షణ ఇచ్చే అవకాశం దొరికింది’ అనే వనిత 1500 మందికి పైగా టైలరింగ్‌ నేర్పించారు. వారిలో నిరుపేదలు, వితంతువులే ఎక్కువ. కుట్టుమిషన్‌ కొనుక్కునే స్థోమత లేనివారికి ఆవిడే ఉచితంగా ఇస్తున్నారు. ఇలా శిక్షణ పొందిన వందల మంది సొంతగా బొటిక్‌లు, టైలరింగ్‌ దుకాణాలతో ఉపాధి పొందుతున్నారు. వీళ్లలో నెలకు రూ.30 వేలవరకూ సంపాదించే వాళ్లూ ఎక్కువే.

మహిళలకు ఉపాధి కల్పిస్తూ...

వనిత సేవాభావం చూసి బ్యాంకు అధికారులే సలహా ఇచ్చి మరీ పరిశ్రమను ఏర్పాటు చేయించారు. ‘కాటారంలో మా శిక్షణ కేంద్రానికి ఎదురుగా ఎస్‌బీఐ శాఖ ఉండేది. మా కార్యక్రమాలను గమనిస్తున్న బ్యాంకు మేనేజరు పిలిచి మాట్లాడారు. గార్మెంట్స్‌ పరిశ్రమ ఏర్పాటు చేస్తే మహిళలకు ఉపాధి కూడా దొరుకుతుంది కదా అంటూ రూ.15 లక్షల రుణం మంజూరు చేశారు. కర్ణాటక, ముంబై, హైదరాబాద్‌ల్లోని గార్మెంట్స్‌ పరిశ్రమలకు వెళ్లి అధ్యయనం చేశా. ఆధునిక కుట్టుమిషన్లు తెప్పించి.. నా దగ్గర శిక్షణ తీసుకున్న 30 మంది మహిళలకు ఉపాధి కల్పించా’ అనే వనిత జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, పెద్దపల్లి, కరీంనగర్‌ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు యూనిఫాంలు కుట్టిస్తున్నారు. భూపాలపల్లి, కాటారాల్లో ఉచిత శిక్షణ కేంద్రాలనూ సమర్థంగా నడిపిస్తున్నారు.

ఆడపిల్లల కోసం..

2017లో తొమ్మిది మంది సభ్యులతో కలిసి సఖ్యత ఛారిటబుల్‌ ట్రస్టుని ఏర్పాటు చేశారు వనిత. పాఠశాలల్లో పరిశుభ్రత, కౌమార దశలో ఆడపిల్లలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వంటి విషయాలపై అవగాహన కల్పిస్తున్నారు. అనాథ, వృద్ధాశ్రమాలకు వెళ్లి తోచిన సాయం చేస్తారు. పర్యావరణపరిరక్షణలో భాగంగా 2018 మేడారం జాతర ప్లాస్టిక్‌ రహితంగా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దాంతో వస్త్రంతో చేసిన 10వేల సంచులను ట్రస్టు ద్వారా ఉచితంగా అందించారు. పేద విద్యార్థులకు ఆర్టీసీ పాస్‌లు ఇప్పిస్తారు. నాబార్డు సహకారంతో తాటాకులతో కళాకృతుల తయారీని 90 మంది మహిళలకు నేర్పించారు. ఇందుకు ఎన్నో అవార్డులూ, ప్రశంసలనూ అందుకున్నారు.

- సోగాల స్వామి, జయశంకర్‌ భూపాలపల్లి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని