18 దేశాలకుసహజ ఉత్పత్తులు
బ్యూటీ పరిశ్రమల లక్ష్యం ఆడవారే! మాకేం కావాలన్నది మాకు కాక ఇంకెవరికి బాగా తెలుస్తుందన్న ఆలోచన పూజను ఈ వ్యాపారంలోకి అడుగుపెట్టేలా చేసింది.
బ్యూటీ పరిశ్రమల లక్ష్యం ఆడవారే! మాకేం కావాలన్నది మాకు కాక ఇంకెవరికి బాగా తెలుస్తుందన్న ఆలోచన పూజను ఈ వ్యాపారంలోకి అడుగుపెట్టేలా చేసింది. సహజ పదార్థాలతో చేసే ఈమె ఉత్పత్తులు విదేశాలకూ ఎగుమతి అవుతున్నాయి. అనుకోకుండా వచ్చి ఈ స్థాయికి ఎలా ఎదిగింది?
ఎవరి అండా లేకుండా వ్యాపారంలో ఎదిగిన నాన్నే పూజా నాగ్‌దేవ్‌కి స్ఫూర్తి. ఆయనలాగే సొంత వ్యాపారం ప్రారంభించాలనుకుంది. వీళ్లది దిల్లీ. ఎంబీఏ చేసింది. తనకు బ్యూటీ పరిశ్రమంటే ఇష్టం. అందుకని యూకేలో కాస్మెటాలజీ చదివింది. ఎసెన్షియల్ ఆయిల్స్‌పై ఆసక్తితో కెనడాలో అరోమా థెరపీ కోర్సు చదివింది. ఆయుర్వేదం గురించీ అధ్యయనం చేసింది. తర్వాత తిరిగొచ్చి నాన్న వ్యాపార బాధ్యతలను స్వీకరించింది. ఎసెన్షియల్ ఆయిల్స్‌తో క్యాండిల్స్ మొదలైనవి తయారు చేయాలనుకుంది. పూజకి పర్యావరణంపై ప్రేమ. సమస్య ఏదైనా దానికి ప్రకృతిలో సమాధానం దొరుకుతుందన్నది తన నమ్మకం. అలాంటప్పుడు సహజ పదార్థాలతోనే అందానికి ఎందుకు మెరుగులు దిద్దకూడదనుకుంది. పైగా మార్కెట్‌లో ఉన్నవన్నీ రసాయనాలతో కూడినవే. వాటిని నడిపించేదీ ఎక్కువగా మగవారే. మహిళల అవసరాలు మహిళలకే బాగా అర్థమవుతాయి కానీ, మగవారికెలా తెలుస్తాయి అని అనుకుంది. దీంతో ఆయుర్వేదంపై లోతుగా పరిశోధన ప్రారంభించింది.
ప్రకృతికి దేశభక్తి జోడించి..
తన పరిజ్ఞానం, అరోమా థెరపీ జోడించి ఉత్పత్తులు తయారు చేసింది. వివిధ పరీక్షల తర్వాత ఫలితం బాగున్నాక 2007లో ‘ఇనాతుర్’ ప్రారంభించింది. దీనిలో ‘ఐ’ ఇండియాకి గుర్తు. నేచర్ నుంచి ‘నాతుర్’ తీసుకొంది. ‘సౌందర్యోత్పత్తుల కోసం వన్యప్రాణుల్ని చంపడం, రసాయనాల్ని ఉపయోగించడం పరిపాటిగా ఉండేది. కొందరు వీటిని వ్యతిరేకించే వారు కూడా. అప్పటికి పెద్దగా ప్రాచుర్యంలేని వీగన్ ఉత్పత్తులపై దృష్టి పెట్టా. ఇవి జంతువులతో నిమిత్తం లేకుండా చేసినవి. పెటా సర్టిఫికేషన్‌నీ పొందా. దీంతో త్వరగానే ఆదరణ వచ్చింది. మా ఉత్పత్తులు అందాన్ని పెంచుతాయని కాకుండా సహజమైన వాటిని వాడటం వల్ల ప్రయోజనాలేంటో చెప్పే వాళ్లం. నాణ్యతలో రాజీ ప్రశ్నేలేదు. దీంతో మొదటి ఏడాదే లాభాలు మొదలయ్యాయి. అవార్డులూ అనుసరించాయి. సొంత స్టోర్, వెబ్‌సైట్‌తోపాటు ఈకామర్స్ వేదికల్లోనూ ఉంచాం. మా ఉత్పత్తులు విదేశాలకూ ఎగుమతి అవుతున్నాయి. వ్యాపారంలో ఏటా కనీసం 30% పెరుగుదల ఉంటోంది. ఇప్పుడు మా వ్యాపారం రూ.50 కోట్లకు పైమాటే!’ అని చెబుతున్న పూజ ప్రారంభంలో మార్కెటింగ్‌లో ఎన్నో ఇబ్బందుల్నీ, వైఫల్యాల్నీ చూసింది. అయినా వెనకడుగు వేయలేదు. ఆ పట్టుదలే తనని 18 దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేర్చింది. చేసేపనిపై నమ్మకం ఉంటే తనలాగే ఎవరైనా విజయపథాన సాగొచ్చనేది ఈమె సలహా.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.