కొత్తదారిలో విజయాలు పండిస్తూ...
వ్యవసాయంలో కొత్తరకం వంగడాలను కనిపెట్టడానికి ఆమె ప్రొఫెసర్ కాదు. శాస్త్రవేత్త అంతకన్నా కాదు.
వ్యవసాయంలో కొత్తరకం వంగడాలను కనిపెట్టడానికి ఆమె ప్రొఫెసర్ కాదు. శాస్త్రవేత్త అంతకన్నా కాదు. ఎనిమిదో తరగతి వరకే చదువుకున్న ఆమెకున్న ఒకే ఒక అర్హత సేద్యంపై ప్రేమ. అదే ఆమెను చదువుతో సంబంధం లేకుండా.. సహజ శాస్త్రవేత్తగా మార్చింది. వినూత్నంగా ఆలోచించి, రుచి, ఆకారంలో సాధారణ క్యారెట్‌కన్నా భిన్నంగా కొత్తరకాన్ని పండించిన ఈమె ప్రతిభకు రెండుసార్లు రాష్ట్రపతి అవార్డు దక్కింది. దేశవ్యాప్తంగా ఈ రకాన్ని పండించేలా చేయడానికి కృషి చేస్తున్న సంతోష్ పచర్ స్ఫూర్తి కథనమిది.
సంతోష్‌కు జబర్‌మాల్‌తో పెళ్లయ్యేటప్పటికి అత్తింటి వారిది ఉమ్మడి కుటుంబం. ఆ తర్వాత విడిపోయినప్పుడు ఈ దంపతులకు వాటాగా అయిదెకరాల భూమి వచ్చింది. రాజస్థాన్‌కు చెందిన ఆవిడ తమ వాటా భూమిలో గోధుమ, మెంతి, ఉల్లిపాయలు, క్యారెట్, వెల్లుల్లి వంటివి పండించడం ప్రారంభించారు. మరిన్ని రకాల పంటలను వేద్దామన్నా పెట్టుబడి ఉండేది కాదు. ఎరువుల కొనుగోలుకే ఇబ్బందులెదుర్కొనేవారు. ఆ సమయంలో స్థానిక ఎన్జీవో మొరార్కా ఫౌండేషన్ రైతులందరికీ సేంద్రియ పంటలపై అవగాహనా కార్యక్రమాలు, శిక్షణ నిర్వహించింది. దీనికి సంతోష్ కూడా హాజరయ్యారు.
కొత్త ఆలోచనతో..
సేంద్రియ ఎరువుల తయారీ సొంతంగా ప్రారంభించారు సంతోష్. ‘వ్యవసాయానికి పూర్తిగా రసాయనాలు వినియోగించడం మానేశా. సమీప గ్రామంలో మహవీర్‌సింగ్ అనే రైతు క్యారెట్ పండిస్తూ మంచి దిగుబడి అందుకుంటున్నాడని మావారు చెబితే, చూసొచ్చా. ఆయన పండిస్తున్న క్యారెట్‌కు మేం పండించే వాటికి తేడా గుర్తించా. మా పొలంలో పండేవి పీలగా, రంగు తక్కువగా ఉంటే, ఆ రైతు వద్ద ఎరుపు రంగులో పొడవుగా ఉన్నాయి. నేనూ ప్రయత్నాలు మొదలుపెట్టా. పండించే నేల మీద ఎరువులు చిమ్మడం కన్నా, విత్తనాలకు అందిస్తే ఎలా ఉంటుందనే కొత్త ఆలోచన వచ్చింది. 50 ఎంఎల్ తేనె, 25 గ్రాముల నెయ్యి మిశ్రమంలో కేజీ క్యారెట్ విత్తనాలను కొన్ని గంటలు నానబెట్టి, ఆ తర్వాత ఎండలో ఆరబెట్టి చిన్నచిన్న మడులుగా వేశా. చాలా ప్రయోగాలు చేసినా నా ప్రయత్నం ఫలితాలివ్వలేదు. అయినా పట్టుదలగా ప్రయత్నిస్తూనే ఉన్నా. క్రమేపీ క్యారెట్ పరిమాణం, రుచి, రంగు మారడం మొదలైంది. అలా నాలుగైదుసార్ల తర్వాత ఒకటిన్నర నుంచి రెండు అడుగుల పొడవు, తీపిగా, ఎరుపు రంగులో వాటికి పండించగలిగా. దీనికి మంచి ధర పలికింది. ఈ పద్ధతిలో ముందుగా ఒక ఎకరంలో పండించి విజయం సాధించా. దిగుబడి బాగా వచ్చింది. ఒక పంటకు మూడు నెలల సమయం సరిపోతుంది. నేను తయారుచేస్తున్న ఈ విత్తనాలకు ‘ఎస్పీఎల్ 101’ పేరు పెట్టా. ఈ ఫార్ములా ఫలితాలను రాష్ట్ర కృషి విజ్ఞాన్ కేంద్ర అండ్ అగ్రికల్చరల్ విభాగపు నిపుణులకు చూపించా. వారు పరిశీలించి దీన్ని కొత్తరకం వంగడంగా ఆమోదించడం చాలా సంతోషాన్నిచ్చింది’ అని వివరిస్తున్నారు సంతోష్.
నర్సరీ..
క్యారెట్‌ను పండిస్తూ దాన్ని మార్కెట్‌లో మంచి ధరకు అమ్మడంతోపాటు, నర్సరీ కూడా ప్రారంభించారీమె. తాను తయారుచేసే విత్తనాలతో నారు పోసి, దాన్నీ అమ్మేవారు. ఏటా వచ్చే రూ.4 లక్షల ఆదాయమిప్పుడు 20 రెట్లు పెరిగింది. కేవలం విత్తనాలతోనే ఏటా రూ.20 లక్షలు వార్షికాదాయాన్ని అందుకుంటున్నారీమె. ప్రస్తుతం ఈవిడ రెండెకరాల్లో క్యారెట్, మరో రెండు ఎకరాల్లో ఉల్లిని పండిస్తున్నారు. ‘ఎకరానికి క్యారెట్ 350-400 క్వింటాళ్లు దిగుబడి వస్తోంది. సేంద్రియ ఎరువులనే వాడుతున్నా. ఈ క్యారెట్ మార్కెట్లో కేజీ రూ.40 ధర పలుకుతోంది. ఈ కొత్త వంగడాన్ని దేశవ్యాప్తం చేస్తున్నందుకు 2013, 2017లో రాష్ట్రపతి అవార్డులు అందుకొన్నా. కృషి విజ్ఞాన్ కేంద్రాలు, గ్రామ పంచాయతీలు, రైతుల సంఘాలకు వెళ్లి, రైతులకు ఈ పంటపై శిక్షణ ఇస్తున్నా. ఇప్పటి వరకు నావద్ద శిక్షణ పొందిన 5వేల మంది రైతులు క్యారెట్‌ను పండిస్తున్నారు. మహిళా రైతులకు ప్రత్యేక అవగాహన కలిగించి ప్రోత్సహిస్తున్నా. ‘సంతోష్ పచార్ లిమిటెడ్’ సంస్థ ప్రారంభించాం. త్వరలో నేపాల్, దక్షిణాఫ్రికాలకూ క్యారెట్ విత్తనాలను ఎగుమతి చేయనున్నాం. ప్రపంచ వ్యాప్తంగా ఈ పంట గురించి తెలిసేలా చేయాలని ఉంది’ అని చెప్పుకొస్తున్న సంతోష్ కృషి స్ఫూర్తిదాయకం కదూ..
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.