తన వంటలకు లక్షల అభిమానులు

ఆరు పదుల తర్వాత అందరిలా ఆమె విశ్రాంతి దశ అనుకోలేదు. వంటల అభిరుచిని వ్యాపార ఆలోచనగా మార్చారు.

Updated : 06 Dec 2022 05:50 IST

ఆరు పదుల తర్వాత అందరిలా ఆమె విశ్రాంతి దశ అనుకోలేదు. వంటల అభిరుచిని వ్యాపార ఆలోచనగా మార్చారు. సామాజిక మాధ్యమాలు వేదికగా వందలమందికి అవకాశాల్నిస్తున్నారు. సవాళ్లను దాటి.. లక్షలమంది ఫాలోవర్స్‌ను ఆకట్టుకుంటున్నారు. అభిరుచికి వయసు అడ్డు కాదని నిరూపిస్తున్న విజయ్‌ హల్దియా గురించి తెలుసుకుందాం.

అమ్మతోపాటు వంటింట్లో తిరుగుతూ సాయం చేయడమంటే విజయ్‌కు ఇష్టం. అలా పెళ్లయ్యేసరికి చాలా రకాల వంటకాలను నేర్చేసుకున్నారు. ఆమె చేతి రుచి చూసిన వారందరూ వంటల పుస్తకం రాయొచ్చు కదా అని సలహా ఇచ్చేవారు. కూతురు ఆపేక్ష చదువు పూర్తి చేసి విదేశానికి వెళ్లడం, భర్త 2014లో ఉద్యోగ విరమణతో తనకు సమయం దొరికింది. వంటల ఆసక్తితోనే ఏదైనా చేయాలనుకున్నారామె. ఓ ఫేస్‌బుక్‌ గ్రూపులో చేరి, తను చేసే కొత్త వంటకాల ఫొటోలను పొందుపరిచేవారు. 

బ్లాక్‌ చేస్తే... కొత్త బాట

తనను ఎందుకో ఆ గ్రూపులో బ్లాక్‌ చేయడం బాధనిపించింది అంటారు విజయ్‌. ‘ఓసారి ఆపేక్షను కలిసినప్పుడు అదే చెప్పి బాధపడ్డా. ఎవరిలా చేశారో కనిపెట్టమన్నా. తను మాత్రం.. మనమే ఫేస్‌బుక్‌లో ఓ గ్రూపును తయారు చేద్దామంటూ, 2014లో ‘జయ్‌కా తడ్కా బై విజయ్‌ హల్దియా’ ప్రారంభించింది. మరి మా వంటకాలకు ఫాలోయర్స్‌ ఉండాలిగా. ఇది మాకో సవాల్‌గా మారింది. ఆపేక్షకున్న డిజిటల్‌ మార్కెటింగ్‌ నైపుణ్యాలు ఇక్కడ ఉపయోగపడ్డాయి. నాకోసం వర్డ్‌ప్రెస్‌ సైట్‌ ఏర్పాటు చేసింది. దీనిద్వారా నాలుగు నెలల్లో 30వేలమంది ఫాలోయర్స్‌ను సంపాదించుకోగలిగా. బ్లాగ్‌ కూడా ప్రారంభించాం’ అని వివరిస్తారు విజయ్‌.

90 లక్షల మంది..

ట్విటర్‌, ఫేస్‌బుక్‌, బ్లాగుల నిర్వహణ, వంటల ఫొటోలు, వీడియోలు పొందుపరచడం వంటివన్నీ ఆపేక్ష వద్ద విజయ్‌ నేర్చున్నారు. లైవ్‌ వీడియోలు చేసే స్థాయికి చేరుకొన్నారు. ‘ఇప్పుడు 90 లక్షలమంది ఫాలోయర్స్‌ మా వీడియోలను వీక్షిస్తున్నారు. ఇన్‌స్టాకు మాత్రమే 5లక్షల మంది ఉన్నారు. ఆపేక్ష భర్తతో కలిసి అహ్మదాబాద్‌ నుంచి వచ్చేసి, నాకు చేయూతగా ఉంటోంది. మొదటి ఏడాదిలో లక్ష మంది ఫాలోయర్స్‌ వద్ద ఆగిపోయింది. మూడేళ్లపాటు చేతిలోని డబ్బు అంతా ఖర్చు పెట్టేశా. అయినా పట్టుదలగా ముందుకే వెళ్లా. ఈ వేదికపైకి ఆసక్తి ఉన్న మహిళలను తీసుకొస్తే ఎలా ఉంటుందనే కొత్త ఆలోచనతో మా గ్రూపులో లైవ్‌లో వంటకాలు చేసే అవకాశాన్నిచ్చాం. దేశవ్యాప్తంగా ఎక్కడికైనా.. ఆపేక్ష వెళ్లి వాళ్లతో లైవ్‌లో ఏదైనా కొత్త వంటకం చేయిస్తుంది. అతి తక్కువ సమయంలో చేసేవి, ఇంట్లోని పదార్థాలతోనే పోషకాలుండే రుచికరమైన వంటకాలకు ప్రాధాన్యతనిస్తాం. ఇందులో చేస్తున్న ప్రయోగాల వల్ల మధ్యతరగతి మహిళలనెందరినో ‘జాయ్‌కా కా తడ్కా’ ఆకర్షిస్తోంది. 20 నుంచి 90 ఏళ్ల మహిళల వరకు తమకు తెలిసిన సంప్రదాయ, ప్రాచీన, ఆధునిక వంటకాల వరకు అందరితో పంచుకోవడానికి ముందుకొస్తున్నారు. ఇప్పటి వరకు 800మంది ఈ వేదికపైకి వచ్చారు. వీరందరిలో ఎనలేని ఆత్మవిశ్వాసం. ఈ ఛానెల్‌ తర్వాత కొందరికి లేటు వయసులోనూ వంటచేసే అవకాశాలొచ్చాయి. నా 60 ఏళ్ల వయసులో అభిరుచితో వ్యాపారవేత్తగా మారా. అనుకున్నది చేయడానికి వయసు అడ్డు కాదు. ఈ ఛానెల్‌లో ఎందరో నన్ను ప్రశంసిస్తుంటే సంతోషంగా అనిపిస్తుంది. మరిన్ని రుచికరమైన వంటకాలు చేసేలా ప్రోత్సాహాన్నిస్తుంది. వయసయిపోయింది అనే ఆలోచన రానీయకుండా సాధించాలనే ఆలోచనతో ఉత్సాహంగా ముందడుగేస్తే విజయం మనదే’ అంటున్న విజయ్‌ అన్ని తరాలకూ స్ఫూర్తి కదూ..

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్