ఆస్ట్రేలియాలో.. సూపర్‌స్టార్‌నయ్యా!

దేశం కాని దేశం వెళితే... ఏ సమస్య అయినా మనమే ఒంటరిగా ఎదుర్కోవాలి. అలా ఆస్ట్రేలియా నేలపై విద్యార్థిగా ఎన్నో ఇబ్బందులు పడ్డ నీలిమ కడియాల తన తర్వాత వచ్చే పిల్లలైనా ఈ కష్టాలు పడకూడదనుకున్నారు. అందుకే విదేశీ విద్యార్థుల ఉపాధికీ, సాంకేతిక రంగంలో వివక్ష నిర్మూలనకు, మహిళల సంఖ్యను పెంచడానికీ శ్రమిస్తున్నారు.

Updated : 10 Dec 2022 07:21 IST

దేశం కాని దేశం వెళితే... ఏ సమస్య అయినా మనమే ఒంటరిగా ఎదుర్కోవాలి. అలా ఆస్ట్రేలియా నేలపై విద్యార్థిగా ఎన్నో ఇబ్బందులు పడ్డ నీలిమ కడియాల తన తర్వాత వచ్చే పిల్లలైనా ఈ కష్టాలు పడకూడదనుకున్నారు. అందుకే విదేశీ విద్యార్థుల ఉపాధికీ, సాంకేతిక రంగంలో వివక్ష నిర్మూలనకు, మహిళల సంఖ్యను పెంచడానికీ శ్రమిస్తున్నారు. ఆ కృషి ఫలితంగానే ‘స్టెమ్‌ సూపర్‌స్టార్‌’ పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా వసుంధర ఆవిణ్ని పలకరించింది...

మేమిద్దరం ఆడపిల్లలం. అమ్మ విజయకుమారి ఆర్టీసీ, నాన్న జొన్నలగడ్డ కోటేశ్వరరావు ప్రైవేటు ఉద్యోగులు. హైదరాబాదులో బీసీఏ చేశా. విక్టోరియా యూనివర్శిటీలో మాస్టర్స్‌ ఆఫ్‌ ఇన్‌ఫర్మేషన్‌ సిస్టమ్స్‌ చేయడానికి 2003లో ఆస్ట్రేలియా వెళ్లా. ఇమిగ్రేషన్‌లో గంటల పాటు నిలబడినప్పుడు.. ఈ దేశంలో శాశ్వత నివాసం (పీఆర్‌) సంపాదించాల్సిందే అనుకున్నా. ఏడాదిన్నరకు నా చదువైపోయింది. కానీ పీఆర్‌కు రెండేళ్ల చదువుండాలన్నారు. అందుకోసం మరో డిప్లొమా చేశా. ఆ తర్వాత ఉద్యోగం ఉంటేనే పీఆర్‌ ఇస్తామన్నారు. ఇక్కడ ఏటా ఇలా నిబంధనలు మారిపోతూ ఉంటాయి. దాంతో చాలా ఇబ్బందులు పడ్డా. ఎలా అయితేనేం కాంట్రాక్ట్‌ జాబ్‌తో అనుకున్నది సాధించా. నాకైతే సాధ్యమయ్యింది కానీ చాలామంది ఈ పీఆర్‌ దొరక్క స్వదేశాలకు వెళ్లిపోతుంటారు. ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావాలనుకున్నా.

ఇబ్బంది లేకుండా..

సన్‌కాప్‌ సంస్థలో డెలివరీ మేనేజర్‌గా ఉన్నప్పుడు భిన్న సంస్కృతులను ప్రోత్సహించే ‘డైవర్సిటీ అండ్‌ ఇన్‌క్లూజన్‌ ఫోరం’లోనూ పనిచేసేదాన్ని. ఇందులో భాగంగా టెక్నాలజీలో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచడం, ప్రసూతి సెలవుల తర్వాత పార్ట్‌టైం ఉద్యోగాల కల్పన వంటి అంశాలపై వర్కింగ్‌ గ్రూపుల్లో చర్చించేదాన్ని. ఈ దేశంలో ఉద్యోగానికి వెళ్తే.. పీఆర్‌, సిటిజన్‌షిప్‌ ఉండాలంటారు. పీఆర్‌కు అప్లై చేయాలంటే ఉద్యోగం ఉండాలంటారు. నిజానికి స్టూడెంట్‌ వీసాతో ఉద్యోగాలు చేసుకోవచ్చు. కానీ చాలా సంస్థలు ఈ విషయాన్ని గుర్తించడం లేదు. దీన్నే మా ఉన్నతాధికారులకు వివరిస్తే.. వాళ్లు మనమే అవకాశమిద్దామన్నారు. స్కూల్‌ స్థాయిలోనే అమ్మాయిలకు టెక్నాలజీలో అవకాశాలపై అవగాహన కల్పించాలనీ ప్రతిపాదించా. ఈ ఆలోచనలు నచ్చి నాకు పోర్ట్‌ఫోలియో మేనేజర్‌గా పదోన్నతినిచ్చి, కొత్త ప్రాజెక్టులప్పగించారు. ఇంటర్న్‌షిప్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్స్‌ ఎంపికల్లో అమ్మాయిలు 50 శాతం ఉండేలా చూడ్డం, విదేశీ విద్యార్థులకు స్టూడెంట్‌ వీసా మీద ఉద్యోగాలొచ్చేలా చేయడం, 9, 10 తరగతుల అమ్మాయిలకు మా సంస్థలో పని అనుభవాన్ని పొందేలా చేయడం నా బాధ్యతలు. ఇవి సమర్థంగా పూర్తిచేయడంతో సన్‌కాప్‌ సంస్థకు పలు పురస్కారాలు దక్కాయి.  

శాస్త్రవేత్తలు, వైద్యుల మధ్య...

స్టెమ్‌ సూపర్‌స్టార్స్‌ పురస్కారం అందుకోవడానికి.. ఆస్ట్రేలియాలో ఏటా లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే 60 మంది మాత్రమే ఎంపికవుతారు. అంత కఠినమైన వడపోతలుంటాయి. అవన్నీ దాటుకుని నేనూ స్టార్‌గా ఎంపికయ్యా. నేను తప్ప తక్కిన వారంతా శాస్త్రవేత్తలు, వైద్యులే. దీన్లో భాగంగా రెండేళ్ల పాటు ప్రోగ్రామ్స్‌ ఉంటాయి. లీడర్‌షిప్‌, అడ్వాన్స్‌డ్‌ కమ్యూనికేషన్స్‌లో శిక్షణ ఇస్తారు. వీటి సాయంతో టెక్‌లో చేరేలా మహిళలకు ప్రోత్సాహాన్నివ్వాలి. ప్రస్తుతం.. ఛాలెంజర్‌ లిమిటెడ్‌ సంస్థలో ఐటీ ప్రోగ్రాం మేనేజర్‌ని. ఇక్కడా ‘లింగ సమానత్వం’ కోసం పని చేస్తున్నా. ప్రసూతి సెలవుల తర్వాత లేదా ఇతర కారణాలతో మధ్యలో బ్రేక్‌ తీసుకొన్న మహిళలకు పార్ట్‌టైం ఉద్యోగాలను ఈ సంస్థలో కల్పించేలా చేస్తున్నా. లింక్డిన్‌ ‘గీక్‌ ఆస్ట్రేలియా’ అంబాసిడర్‌గానూ ఎంపికయ్యా. ఏటా పది మందికే ఈ గౌరవం దక్కుతుంది.

ఇవి బాధ్యతలు..

కెరియర్‌, కుటుంబం, పిల్లలు, సేవ.. ఇవన్నీ సమన్వయం చేయడానికి మావారు ఉదయ్‌ తోడ్పాటే కారణం. అమ్మానాన్నలు ఏదీ ఆశించకుండా మనకోసం కష్టపడతారు. మనల్ని పెంచేటప్పుడు కష్టంగా ఉందని వాళ్లు వెనుకడుగు వేసుంటే మనమీ అవకాశాలను అందుకోలేం. అందుకే ఈ అవార్డును అమ్మానాన్నలకు అంకితమిస్తున్నా. పదోన్నతి మనల్ని వెతుక్కొంటూ రాదు. మనమే కష్టపడాలి. అవకాశం రానప్పుడు నిరాశచెందకుండా లక్ష్యాన్ని చేరుకొనే వరకు కృషి చేయాలి.


ఆహ్వానం

వసుంధర పేజీపై మీ అభిప్రాయాలు, సలహాలు, నిపుణులకు ప్రశ్నలు... ఇలా మాతో ఏది పంచుకోవాలన్నా 9154091911కు వాట్సప్‌, టెలిగ్రాం, సిగ్నల్‌ల ద్వారా పంపవచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్