అమ్మే గెలిచింది... నవ్విన చోటే నిలబడింది!

కష్టనష్టాల వెనుకే జీవితాన్ని గెలిచే అవకాశాలు ఉంటాయన్నది ఆమె నమ్మకం. అందుకే బిడ్డలకు లోపమున్నా... అవి శాపంగా మారి కుటుంబాన్నే కుంగదీస్తున్నా... ఆ తల్లి ఏటికి ఎదురీదుతోంది.

Updated : 15 Dec 2022 07:34 IST

కష్టనష్టాల వెనుకే జీవితాన్ని గెలిచే అవకాశాలు ఉంటాయన్నది ఆమె నమ్మకం. అందుకే బిడ్డలకు లోపమున్నా... అవి శాపంగా మారి కుటుంబాన్నే కుంగదీస్తున్నా... ఆ తల్లి ఏటికి ఎదురీదుతోంది. పిల్లలకు కంటిపాపలా మారి వెలుగులు పంచుతోంది. వారి భవిష్యత్తుకు బంగారు బాటలు పరుస్తోంది. ఆమే అనంతపురం జిల్లాకి చెందిన నీలం సుధారాణి.

‘ఎన్నేళ్లు నీళ్లల్లో ఉన్నా రాయి మెత్తబడదు. అమ్మ ప్రేమ కూడా అంతే... బిడ్డలకెన్ని లోపాలున్నా, ఎన్ని కష్టాలెదురైనా వారిపై ప్రేమ ఇసుమంతైనా తగ్గదు’. తల్లినవుతున్నా... అన్న క్షణం దగ్గర నుంచి పిల్లల్ని పొత్తిళ్లలోకి తీసుకునే వరకూ ఎంత ఆరాటపడ్డానో నాకే తెలుసు. మేనరికమో, మరో కారణమో కానీ... పిల్లలిద్దరికీ చూపు లేదని తెలిశాక గుండెలవిసేలా ఏడ్చేదాన్ని. తర్వాత ఆలోచించా... బాధపడితే తలరాత మారిపోదని నాకు నేనే సర్ది చెప్పుకొన్నా. వారి భవిష్యత్తుకి మార్గాన్ని నేనే చూపాలనుకున్నా.

మాది పామిడి మండలం ఎద్దులపల్లి. రైతు కుటుంబం. ఇంటర్‌ అయిన వెంటనే మేనత్త కొడుకు వేణుగోపాల్‌రెడ్డితో పెళ్లయ్యింది. రోజులు సంతోషంగా గడిచిపోయేవి. చదువాపొద్దని దూరవిద్యలో డిగ్రీ మొదలుపెట్టా. ఆయనతో పాటు పొలం పనులూ చూసుకునేదాన్ని. ఈలోగా గర్భం దాల్చా. రెండు కుటుంబాల వాళ్లూ కాలు కింద పెట్టకుండా చూసుకునేవారు. మొదటి కాన్పు ఆడపిల్ల. ‘లక్ష్మీదేవే’ వచ్చిందని సంతోష పడ్డాం. బిడ్డ ఎప్పుడెప్పుడు మమ్మల్ని గుర్తుపడుతుందా? తప్పటడుగులు వేస్తుందా అని చూసే వాళ్లం. ఆరునెలల తరువాత అనుమానం వచ్చి బెంగళూరులోని డాక్టర్‌ దగ్గరికి తీసుకెళ్తే... పిడుగులాంటి వార్త వినాల్సి వచ్చింది. పాప పుట్టుకతోనే జన్యువ్యాధితో బాధపడుతోందనీ, చూపు లేదనీ చెప్పారు. ఎక్కడో ఓ చోట నయం కాదా అన్న ఆశతో... ఎన్నో ఆసుపత్రులు తిప్పాం.. ఫలితం లేకపోయింది.

అంతా నవ్వుతున్నా...

ఇలానే రెండేళ్లు గడిచిపోయాయి. మరోసారి గర్భం దాల్చా. ఈసారి బాబు. తనలోనూ లోపం ఉందని ముందు గుర్తించలేకపోయాం. అనుమానం వచ్చి ఓ వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లాము. భయపడ్డట్లే జరిగింది. ఆ వార్త వినగానే... నా నెత్తిన మళ్లీ పిడుగు పడ్డట్లయ్యింది. ఇంటిల్లిపాదీ కుంగిపోయాం. పిల్లల్ని ఎలా పెంచాలో అర్థమయ్యేది కాదు. అందరిలా ఆడలేకపోయే వారు. తోటిపిల్లలు హేళన చేసే వారు. బంధువులూ, తెలిసిన వారూ పిల్లల పరిస్థితి చూసి మా ఎదురుగా సానుభూతి చూపేవారు. వెనకే నవ్వుకునేవారు. అవన్నీ గుర్తొస్తే మనసు కల్లోలమైపోయేది. నిద్ర పట్టేది కాదు. క్రమంగా మనసుని రాయి చేసుకున్నా. నా పిల్లల లోపం... వారికి శాపంగా మారకూడదంటే ఎవరిమీదా ఆధారపడకుండా చేయాలనుకున్నా.

అన్నీ తానై....

ఊళ్లోనే చదివిస్తే పరిస్థితులు సహకరించవేమో అని భయమేసింది. అందుకే అనంతపురంలో అద్దింట్లో మకాం పెట్టా. పిల్లల్ని బళ్లో చేర్చా. మా వారు అక్కడే ఉండి వ్యవసాయం చేసేవారు. ఇద్దరం తరచూ అక్కడికీ ఇక్కడికీ వెళ్లొస్తూ ఉండే వాళ్లం. అమ్మా తోడుండేది. ఇలా పద్నాలుగేళ్లు గడిచిపోయాయి.

ప్రస్తుతం ఇద్దరూ ఆర్ట్స్‌ కాలేజీలో డిగ్రీ ఫైనలియర్‌లో ఉన్నారు. అయితే, వారికి చదువు ఒక్కటే సరిపోద నిపించింది. నేను స్కూల్లో, కాలేజీలో వాలీబాల్‌ ఆడేదాన్ని. పిల్లల్నీ క్రీడల్లో తీర్చిదిద్దాలనుకున్నా. వాళ్లు ఇంటర్‌లో ఉండగా పీఈటీ దేవభూషణం సలహాతో షాట్‌పుట్‌, డిస్కస్‌త్రో, పరుగు వంటి వాటిలో శిక్షణ ఇప్పించా. మామూలు పిల్లలే ఆటల్లో బోలెడన్ని దెబ్బలు తగిలించుకుంటారు. మరి నా బిడ్డలు నెగ్గుకురాగలరా అనిపించేది. కానీ వాళ్లు చాలా కష్టపడ్డారు. రోజూ వారితో పాటు మైదానానికి వెళ్లేదాన్ని. ప్రతి క్షణమూ కనిపెట్టుకుని ఉండేదాన్ని. కష్టానికి ప్రతిఫలం ఎప్పుడూ ఉంటుంది. పోయిన మార్చిలో బెంగళూరులో పారా ఒలింపిక్‌ కమిటీ ఆధ్వర్యంలో జాతీయ పోటీల్లో మా అమ్మాయి పల్లవి సిల్వర్‌ మెడల్‌ సాధించింది. డిసెంబరులో బహ్రెయిన్‌లో ఏషియన్‌ యూత్‌ పారాగేమ్స్‌లో సంజయ్‌ షాట్‌పుట్‌లో కాంస్యం సాధించాడు. మొన్న మార్చి, జులైలో బెంగుళూరు, భువనేశ్వర్‌లో జాతీయ పోటీల్లో అక్కా తమ్ముళ్లు వెండి, కాంస్య పతకాలు గెలుపొందారు. మా బాబు సంజయ్‌ దుబాయ్‌లో పతకం అందుకున్నప్పుడు మా ఊర్లో గ్రామస్థులు, బంధువులు ఊరేగించారు. నా పిల్లలను చూసి నవ్విన చోటే గర్వంగా తలెత్తుకుని వెళ్లడం ఎంతో సంతోషంగా ఉంది. మున్ముందు అంతర్జాతీయ పోటీల్లో వారు దేశం గర్వించేలా పతకాలు సాధించాలనేది నా కోరిక. సాధిస్తారని నమ్మకం కూడా.

- సి.నల్లప్ప, అనంతపురం

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్