నిప్పుతో చెలగాటం ఆమెకిష్టం!

‘మేడమ్‌ మీరు ఆర్మీ కాలేజీకో.. ఎయిర్‌ఫోర్స్‌ కాలేజీకో దరఖాస్తు చేసుకుంటే మంచిది. ఎందుకంటే ఈ కాలేజీలో అంతా మగవాళ్లే ఉంటారు.

Updated : 05 Mar 2023 07:40 IST

‘మేడమ్‌ మీరు ఆర్మీ కాలేజీకో.. ఎయిర్‌ఫోర్స్‌ కాలేజీకో దరఖాస్తు చేసుకుంటే మంచిది. ఎందుకంటే ఈ కాలేజీలో అంతా మగవాళ్లే ఉంటారు. మీకు కనీసం వాష్‌రూమ్‌ సదుపాయం కూడా ఉండదు. ఆలోచించుకోండి’ అని అధికారులు అన్నప్పుడు హర్షిణి క్షణమాత్రం కూడా వెనక్కి తగ్గలేదు. ‘ఇంతవరకూ లేకపోవచ్చు. కానీ నేనా చరిత్రని తిరగరాయాలనుకుంటున్నా’ అందామె. అన్నట్టునే దేశంలోనే మొదటి మహిళా ఫైర్‌ ఫైటర్‌గా రాణించింది. ఆ కాలేజ్‌ నేషనల్‌ ఫైర్‌ సర్వీస్‌ కాలేజ్‌. 46 ఏళ్ల కాలేజీ చరిత్రలోనే కాదు దేశంలోనే నిప్పుతో ఆడుకొన్న మొదటి మహిళ ఆమె..

హారాష్ట్రలోని నాగ్‌పూర్‌ ఆమె స్వస్థలం. ఆసక్తికొద్దీ ఎన్‌సీసీలో చేరింది. అప్పుడే.. చేరితే యూనిఫామ్‌ సర్వీస్‌లోనే చేరాలని కలలు కంది హర్షిణి కన్హేకర్‌. కానీ అమ్మానాన్నల కోసం ఎంబీఏలో చేరింది. స్నేహితురాలి సూచనతో ‘నేషనల్‌ ఫైర్‌ సర్వీస్‌ కమిషన్‌ పరీక్షకు దరఖాస్తు చేసుకుంది. 30మందికి మాత్రమే అవకాశం, పరీక్ష కష్టంగా ఉంటుందని తెలిసినా యూనిఫామ్‌పై ఇష్టంతో దరఖాస్తు చేసింది. ఎంపికైనట్లు సమాచారం. కానీ తర్వాతే తెలిసింది అంతవరకూ ఆ రంగంలో అసలు అమ్మాయిలే లేరని. దాంతో అడుగడుగునా నిరుత్సాహమే ఎదురయ్యింది. ఇంటర్వ్యూలో ‘ఇంతవరకూ ఈ కాలేజీలో అబ్బాయిలే కానీ అమ్మాయిలు లేరు. ఆలోచించుకొనే వచ్చారా?’ అనే ప్రశ్న ఎదురయ్యింది. కళ్లముందు కలలుగన్న ఇన్‌స్టిట్యూట్‌ మాత్రమే హర్షిణికి కనిపించింది. వాళ్లన్నట్టుగానే అక్కడ అమ్మాయిల కోసం ఒక్క సదుపాయం కూడా లేదు. దీనికి తోడు ‘మాక్‌ డ్రిల్స్‌కి ఏ కొంచెం ఆలస్యంగా వెళ్లినా ఆడవాళ్లు ఇంతే. వీళ్లొచ్చేలోపు జరగాల్సిన ప్రమాదం జరిగిపోతుంది అనేవారు. ఆ మాట అనిపించుకోకూడదనే చాలా పట్టుదలగా శిక్షణ పూర్తిచేశా అనే’ హర్షిణి ఎన్నో ప్రమాదాల నుంచి ప్రజల్ని రక్షించి శభాష్‌ హర్షిణి అనిపించుకుంది. ‘దిల్లీలో దీపావళి సంబరాలు జరుగుతున్నాయి. ఒక రాకెట్‌ చెప్పుల దుకాణంలోకి దూసుకువచ్చింది. ఆ మంటలు కాస్తా అదుపుతప్పాయి. భవనం బీటలు వారింది. అయినా దాని మీదకి ఎక్కి మంటల్ని అదుపు చేయడానికి ఆరుగంటలు పట్టింది. ఇలాంటి అనుభవాలు చాలానే. దేశంలో ఎక్కడ వరదలు ముంచెత్తినా, క్రూరమృగాలు ఊళ్లపై దాడిచేసినా నేనక్కడ ఉండేదాన్ని’ అనే హర్షిణి గుజరాత్‌లోని మెహసనాలో ఫైర్‌స్టేషన్‌కు ఇంఛార్జిగా పనిచేసింది. ‘ఇది మగవాళ్లపని. ఇది ఆడవాళ్ల పని అంటూ విడిగా ఉండవు. సంకల్పం ఉంటే ఆడవాళ్లు ఏ పనైనా చేయగలరు’ అంటుందామె.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్