కొడుకు కోసం పరికరం..

పండంటి మగబిడ్డను కన్నప్పుడు ఆమె సంతోషానికి అవధుల్లేవు. అంతలోనే ఆ చిన్నారికి మూర్చవ్యాధి ఉందని తెలియడంతో తల్లిగా కుంగిపోయింది.

Published : 05 Mar 2023 00:07 IST

పండంటి మగబిడ్డను కన్నప్పుడు ఆమె సంతోషానికి అవధుల్లేవు. అంతలోనే ఆ చిన్నారికి మూర్చవ్యాధి ఉందని తెలియడంతో తల్లిగా కుంగిపోయింది. ఆ అనారోగ్యంతో తన బిడ్డ పడుతున్న వేదన ఆమెను అల్లాడిపోయేలా చేసింది. ఈ వ్యాధి రాకముందే గుర్తించగలిగితే కొంతైనా ఉపశమనం ఉంటుందనే ఆలోచన ఆమెను ఆవిష్కరణవైపు నడిపించింది. కొడుకు కోసం ఆ తల్లి శాస్త్రవేత్తలా ఆలోచించి, కనిపెట్టిన పరికరం ఇప్పుడు మరెందరో చిన్నారులకు ఉపయోగకరంగా మారింది.

ఇంజినీరింగ్‌ చదివి ఐటీలో స్థిరపడ్డారు బెంగళూరుకు చెందిన బొర్తాకూర్‌. వివాహం తర్వాత తొలికాన్పుగా మగబిడ్డ పుట్టాడని తెలియగానే ఆ కుటుంబమంతా సంతోషంలో మునిగిపోయింది. కానీ వారి ఆనందం కొన్ని నెలల్లోనే ఆవిరైపోయింది. పిల్లాడికి మూర్చవ్యాధి మొదలైంది. రోజురోజుకీ అది పెరగడమే కాకుండా, చికిత్సతో మాత్రమే ఆ చిన్నారి సాధారణస్థితికి చేరుకొనేవాడు. మూడేళ్లపాటు బాబును చేతుల్లో వేసుకొని ఆసుపత్రుల చుట్టూ తిరిగాం అంటారు బొర్తాకూర్‌. ‘ కొన్నిసార్లు ఎక్కువగా ప్రభావితమయ్యేవాడు. వైద్యసాయం ఆలస్యమైతే, ప్రమాదకర స్థాయికి చేరుకొనేవాడు. మూర్చ వస్తున్నట్లు ముందుగానే తెలుసుకుంటే, సమయానికి చికిత్స త్వరగా అందించొచ్చు కదా అనిపించేది. దీన్నుంచి బాబును పూర్తిగా బయటకు తీసుకురాలేకపోయినా, కనీసం వ్యాధి రాకముందు గుర్తించే వీలుందా అని ఆలోచించేదాన్ని. దీనికి సంబంధించి ఏవైనా పరికరాలున్నాయేమో ఆరా తీశా. అప్పటివరకు ఎవరూ ఈ దిశగా ఆవిష్కరణలు చేయలేదు. దీంతో నేనే ప్రయత్నించాలనుకున్నా. నా కొడుకు ఒక్కడి కోసమే కాదు, నాలాంటి తల్లుల బాధను తగ్గించాలనుకున్నా. ఈ అనారోగ్యానికి సంబంధించిన జర్నల్స్‌, నరాలకి సంబంధించిన మెడికల్‌ బుక్స్‌ చదవడం మొదలుపెట్టా. ఇంజినీరింగ్‌లో ఎలక్ట్రానిక్స్‌ చదవడంతో కొంత అవగాహన ఉంది. వీటన్నింటినీ క్రోడీకరించి మెదడు పనితీరును ముందుగానే గుర్తిస్తే, వచ్చే సమస్యను ముందస్తుగా తెలుసుకోవచ్చు అనుకున్నా. రెండేళ్లపాటు పలురకాల పరిశోధనలు చేపట్టా. పలువురు నిపుణులనూ కలుసుకొని సందేహాలను తెలుసుకొనేదాన్ని. అలా ‘టీజే’ పరికరాన్ని రూపొందించగలిగా. ఇది మన చేతికి ధరించేలా బయోమెడికల్‌ రింగ్‌లా ఉంటుంది. దీనికి సెన్సార్స్‌ అమర్చి ఉంటాయి. దీన్ని రోగి చేతికి తొడిగితే చాలు. రోగి రక్తపోటు, పల్స్‌ రేటులో కలిగే మార్పులకు ఇది స్పందిస్తుంది. మెదడు కార్యకలాపాలు, కీలక గుర్తులు, శారీరక శ్రమ, ఒత్తిడి, నిద్రావేళలన్నింటినీ ఈ పరికరం ట్రాక్‌ చేస్తుంటుంది. మూర్చవ్యాధిని ముందుగానే గుర్తించి, తక్షణం సంకేతాలను అందిస్తుంది. వెంటనే వైద్యులు తగిన చికిత్స అందించి రోగిని ప్రమాదపుటంచులకు చేరకుండా కాపాడొచ్చు. ఈ పరికరం క్లినికల్‌ ట్రయల్స్‌లో సత్ఫలితాలను అందించడంతో దీన్ని అందరికీ అందుబాటులోకి తేవడానికి 2016లో ‘టెర్రాబ్లూ ఎక్స్‌టీ’ సంస్థను ప్రారంభించా’ అని వివరించే ఈమె రూపొందించిన పరికరానికి ‘వుమెన్‌ ట్రాన్స్‌ఫార్మింగ్‌ ఇండియా అవార్ట్స్‌’ వంటి పురస్కారాలెన్నో అందాయి. ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది చిన్నారులకు ఇది చేయూతగా నిలుస్తోంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్