108 ఏళ్ల పియానో బామ్మ!

కొలెట్‌ మేజ్‌.. ఆవిడ సోషల్‌ మీడియాలో చిన్న పోస్ట్‌ పెట్టినా లైకులు, మెసేజ్‌లు కుప్పలు తెప్పలుగా వచ్చిపడతాయి. అంతటి ఫాలోయింగ్‌ ఆవిడకి! వయసు 108 ఏళ్లు. ఈ వయసులోనూ నవ్వుతూ తుళ్లుతూ సాగే ఆమె తత్వానికే ఇంత అభిమానం.

Published : 13 Apr 2023 00:07 IST

కొలెట్‌ మేజ్‌.. ఆవిడ సోషల్‌ మీడియాలో చిన్న పోస్ట్‌ పెట్టినా లైకులు, మెసేజ్‌లు కుప్పలు తెప్పలుగా వచ్చిపడతాయి. అంతటి ఫాలోయింగ్‌ ఆవిడకి! వయసు 108 ఏళ్లు. ఈ వయసులోనూ నవ్వుతూ తుళ్లుతూ సాగే ఆమె తత్వానికే ఇంత అభిమానం.

‘ఈ వయసులోనూ ఇంత ఉత్సాహంగా ఎలా?’ అని కొలెట్‌ బామ్మని అడిగారనుకోండి! ‘నేను వయసుని లెక్కేయడం ఎప్పుడో మర్చిపోయా! అయినా ఉత్సాహానికీ వయసుకీ సంబంధమేంటి’ అని తిరిగి ప్రశ్నిస్తారు. ఈవిడది ప్యారిస్‌. అమ్మమ్మ పియానో, అమ్మ వయొలిన్‌ వాయించేవారు. వాళ్ల పనుల్లో ఎప్పుడూ బిజీగా ఉండి తనను పట్టించుకునేవారు కాదు. ‘ఆ ఒంటరితనాన్ని మ్యూజిక్‌తో దూరం చేసుకున్నా. అందుకే పియానో నా స్నేహితురాలు, ప్రాణం’ అంటారామె. అయిదేళ్ల వయసులోనే శిక్షణలో చేరారు. కానీ కెరియర్‌గా ఎంచుకుంటా అన్నప్పుడే అడ్డుచెప్పడం మొదలైంది. ‘ఇప్పటిలా కాదు.. అప్పుడు ఆడవాళ్లని సంగీతం వంటివి వ్యాపకంలా నేర్చుకోమనే వారే కానీ.. మగవాళ్లతో పోటీ పడుతూ ప్రదర్శనలిస్తామంటే ఒప్పుకొనేవారు కాదు’ అనే ఈ బామ్మ ఎవరి మాటలనీ లక్ష్యపెట్టలేదు. దీంతో వాళ్ల అమ్మానాన్న ఈమెను పియానోకి దూరంగా ఉంచిన సందర్భాలెన్నో! అయినా పట్టు వదలక పియానో కోర్సు పూర్తిచేసి, బోధకురాలయ్యారీమె. 20 ఏళ్లపాటు బోధిస్తూనే ఆర్టిస్ట్‌గా, మ్యుజీషియన్‌గానూ కొనసాగారు. ఈమె వృత్తి అవమానంగా భావించిన అమ్మానాన్న, భర్త దూరమైనా.. ఒంటరిగా కొడుకును పెంచారు. ఎనభైల్లో కంపోజర్‌గా మారి సొంత ఆల్బమ్‌లు విడుదల చేయడం మొదలుపెట్టారు. సోషల్‌ మీడియాలోనూ చురుగ్గా ఉండే కొలెట్‌ తన 100వ పుట్టినరోజు నాడు పెట్టిన వీడియో ఒకటి వైరలైంది. దాంతో ఆమెకు పెద్దఎత్తున ఫాలోయింగ్‌ పెరిగింది. రోజువారీ కార్య కలాపాలతోపాటు ఆవిడ పర్యటనలు, పియానో వాయిస్తూ వీడియోలు పెడుతుంటారు. వాటికి లక్షల్లో వీక్షణలు, లైకులొస్తుంటాయి. ఇప్పటికీ తన పనులన్నీ సొంతంగా చేసుకుంటారీ బామ్మ. తాజాగా ‘108 ఇయర్స్‌ ఆఫ్‌ పియానో’ పేరుతో కొత్త ఆల్బమ్‌నీ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దాంతో ఆవిడ ఫాలోయర్లు మీ ఆరోగ్య రహస్యమేంటంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. దానికావిడ.. ‘దేని గురించీ అనవసర బాధ, కంగారు వద్దు. రోజూ కాసేపు ఆనందంగా డ్యాన్స్‌ చేయండి. శరీర భాగాలన్నింటికీ ప్రాణం పోసినట్లుగా, కొత్త జీవం ఆవరించినట్లుగా అనిపిస్తుంది. నిత్య యవ్వనం మీ సొంతం. నా రహస్యమిదే! మీరూ అనుసరించేయండి’ అని సలహానిస్తున్నారు. పాటిద్దామా మరి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని