Padma Lakshmi: లాభంలేని పెట్టుబడన్నారు!

చిన్నతనంలో లైంగిక వేధింపులు. అది దాటుకుని మోడల్‌గా మారితే..‘నల్లమ్మాయ్‌, జిరాఫీ’ అంటూ ఛీత్కారాలు. పెళ్లి కాస్తా విఫలం.. దీనికి తోడు అనారోగ్యం. ఇన్ని కష్టాలూ దాటి టైమ్స్‌ అత్యంత ప్రభావశీలుర జాబితాలో చోటు దక్కించుకుంది.

Updated : 15 Apr 2023 07:54 IST

చిన్నతనంలో లైంగిక వేధింపులు. అది దాటుకుని మోడల్‌గా మారితే..‘నల్లమ్మాయ్‌, జిరాఫీ’ అంటూ ఛీత్కారాలు. పెళ్లి కాస్తా విఫలం.. దీనికి తోడు అనారోగ్యం. ఇన్ని కష్టాలూ దాటి టైమ్స్‌ అత్యంత ప్రభావశీలుర జాబితాలో చోటు దక్కించుకుంది.. భారతీయ మోడల్‌, వ్యాపారవేత్త, రచయిత్రి... పద్మ లక్ష్మి.. పుట్టింది చెన్నైలో. ఏడాది నిండిందేమో! అమ్మానాన్నలు విడాకులు తీసుకున్నారు. తల్లి అమెరికా వెళ్లిపోయింది. తండ్రి తిరిగి చూడలేదు. అయిదేళ్ల వరకూ అమ్మమ్మ ఇంట్లోనే పెరిగిందా చిన్నారి. తర్వాత మళ్లీ పెళ్లి చేసుకున్న అమ్మ చెంతకు చేరింది. ఏడేళ్ల వయసులో సవతి తండ్రి బంధువు లైంగికంగా వేధించాడు. విషయం అమ్మతో చెబితే వెంటనే భారత్‌కి పంపేసింది. పదహారేళ్ల వయసులోనూ ఇదే చేదు అనుభవం. ఈసారి ఎవరితోనూ చెప్పలేదు. ఎందుకంటే.. తిరిగి అందరూ తనని దూరం పెడతారని భయం!

అనుకోని ప్రమాదం...

14 ఏళ్లప్పుడు.. ఏదో చర్మ వ్యాధి. ప్రాణాపాయ స్థితిలో పడింది. తనెక్కడ దూరమవుతుందోనని అమ్మ కంగారు పడుతోంటే తల్లికి తనపై ఉన్న ప్రేమకు మురిసిపోయింది. తగ్గాక ఆనందంతో మొక్కు తీర్చుకొని తిరిగొస్తుంటే.. పెద్ద యాక్సిడెంట్‌. మోచేతిపైనా, నడుముకీ తీవ్ర గాయాలు. చేతికి శస్త్రచికిత్స చేయడంతో పెద్ద మచ్చ. అప్పటికే ‘నల్లమ్మాయ్‌’, ‘జిరాఫీ’లాంటి పేర్లతో సతమతమవుతోన్న ఆమెకీ మచ్చ మరింత ఆత్మన్యూనతను తెచ్చిపెట్టింది. వాటినీ దాటుకుని థియేటర్‌ ఆర్ట్స్‌, అమెరికన్‌ లిటరేచర్‌ల్లో డిగ్రీ పూర్తిచేసింది. ఓసారి ఆవిడని చూసిన మోడలింగ్‌ ఏజెంట్‌ అవకాశమిచ్చారు. అలా 21 ఏళ్లకి ఫ్యాషన్‌ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. అక్కడా ‘నల్ల తోలు’ పేరుతో అవమానాలే!

మచ్చను దాయలేదు...

మోడలింగ్‌లో మేకప్‌ మాటున లోపాలను దాయడం మామూలే. తను మాత్రం చేతిపై మచ్చను కెమెరా ముందుకు తెచ్చి దాన్నే గుర్తింపుగా మార్చుకుంది. దేశం నుంచి ప్యారిస్‌, మిలాన్‌, న్యూయార్క్‌ల్లో రాణించిన తొలి మోడల్‌ ఆమె. సినిమా అవకాశాలూ దక్కాయి. పాత్ర కోసం ఓసారి ఏకంగా 15 కేజీలు బరువు పెరిగింది. పనిపట్ల అంతటి నిబద్ధత కాబట్టే అవకాశాలొచ్చాయి. పద్మ వంటలపై రాసిన ‘ఈజీ ఎగ్జోటిక్‌’కి బాగా ఆదరణ వచ్చింది. ఇరవై సీజన్లుగా ‘టాప్‌ చెఫ్‌’ ప్రోగ్రామ్‌ని నిర్వహిస్తూ విజయవంతమైన హోస్ట్‌గా, నిర్మాతగా ఎన్నో పురస్కారాలు అందుకుంది.

పిల్లలు పుట్టరనీ...

కుకింగ్‌ ప్రోగ్రామ్‌కి హోస్ట్‌గా, జడ్జిగా చేస్తున్నప్పుడు తనకంటే 20 ఏళ్లు పెద్దయిన రచయిత సల్మాన్‌ రష్దీతో పరిచయమైంది. అదికాస్తా వివాహానికి దారితీసింది. మొదట్నుంచీ నెలసరి సమయంలో పద్మకి విపరీతమైన నొప్పి. మంచం దిగడమూ కష్టమయ్యేది. అది ఎండోమెట్రియాసిస్‌ అనీ, పిల్లలు పుట్టడమూ కష్టమేనన్నారు వైద్యులు. అది విని ‘లాభం లేని పెట్టుబడి’ అన్నారని భర్త నుంచి విడిపోయింది. ఇలా చెప్పుకొంటూ పోతే.. ఆమె చూసిన కష్టాలెన్నో!


ఎండోమెట్రియోసిస్‌పై పోరు...

ఎంతోమంది అమ్మాయిలు తనలానే బాధ ఎండోమెట్రియాసిస్‌తో బాధ పడుతున్నారని గ్రహించి ‘ఎండోమెట్రియాసిస్‌ ఫౌండేషన్‌’ ప్రారంభించింది. సంస్థ ద్వారా పరిశోధనే కాదు.. అమ్మాయిలకు అవగాహన, అవసరమైన సాయం చేస్తోంది. ‘ఒకరి మంచి ఆలోచించా కాబట్టే.. నా జీవితంలో అసాధ్యమనుకున్న మాతృత్వాన్ని అందుకున్నా’ అని సంబరపడుతుంది పద్మ. తనకో కూతురు. ఆమె పుట్టాకే.. పిల్లల్లో లైంగిక వేధింపులపై అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. వలసదారుల హక్కుల కోసం పోరాటాలు, ఐక్యరాజ్యసమితి డెవలప్‌మెంట్‌కి, కీప్‌ ఎ చైల్డ్‌ అలైవ్‌కి అంబాసిడర్‌. బ్యూటీ, నగల వ్యాపారాల్లోనూ విజయం సాధించింది. రూపం, కొలతలు చూసుకొని బాధపడే అమ్మాయిలకు భరోసానిస్తూనే హక్కులను కాపాడుకునే విషయంలో ధైర్యాన్నీ ఇస్తోంది. అందుకే.. ఈ తరం అమ్మాయిలు, మహిళలపై ఆమె ప్రభావమెక్కువ. టైమ్స్‌ అత్యంత ప్రభావశీలుర 100 మంది జాబితాలో మన దేశం నుంచి ముగ్గురు ఎంపికైతే అందులో ఏకైక మహిళ పద్మ లక్ష్మి.



Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని