ఆ చిన్నారుల కోసం... ఉద్యోగం వదులుకున్నా!
అమ్మపాలు... అమృతం ఒకటే అంటారు! కానీ అవి అందకే ఏటా మృత్యువాత పడుతున్న పిల్లలెందరో! వారికి తల్లిపాలను అందించి చిరంజీవులను చేసే బాధ్యతను తలకెత్తుకున్నారు రూపా సెల్వనాయకి.
అమ్మపాలు... అమృతం ఒకటే అంటారు! కానీ అవి అందకే ఏటా మృత్యువాత పడుతున్న పిల్లలెందరో! వారికి తల్లిపాలను అందించి చిరంజీవులను చేసే బాధ్యతను తలకెత్తుకున్నారు రూపా సెల్వనాయకి. ఇందుకోసం ఉద్యోగాన్నే వదులుకున్న ఆమెతో ‘వసుంధర’ ప్రత్యేకంగా మాట్లాడింది..
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అవ్వాలని చిన్నప్పటి నుంచే నాకు కోరిక. అనుకున్నట్టుగానే ఐటీ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. మాది తమిళనాడులోని తిరుప్పూరు. పెళ్లయ్యాక కోయంబత్తూరులో స్థిరపడ్డాం. మాకో పాప. తనకు స్తన్యమిస్తున్న సమయంలోనే ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న శిశువులు తల్లిపాలు చాలక మృత్యువుతో పోరాడుతున్నారని తెలిసింది. మా పాపకు పట్టగా ఇంకా చాలా పాలు మిగిలిపోయేవి. వాటిని ఆ పసి వాళ్లకి ఇవ్వాలనుకున్నా. అప్పట్లో ఈ పాలను దాచిపెట్టే బ్యాంకులు చాలా తక్కువ. అవి ఉన్న చోటుకే వెళ్లి తల్లులు పాలివ్వాలి. ఇంటి నుంచి పంపడానికి వీలయ్యేది కాదు. అంత శ్రమ ఎవరు పడతారు? అందుకే కోయంబత్తూరులోని మెడికల్ కాలేజీ, ప్రభుత్వ ఆసుపత్రి పెద్దల్ని సంప్రదించా. వాళ్లకీ ఈ పాల సేకరణ పెద్ద సవాలే అయ్యింది. దీనికో పరిష్కారం చూపాలనుకున్నా. పరిశోధన చేస్తే.. డీప్ ఫ్రీజర్‌లో కొన్ని నెలలు వరకూ పాలు పాడుకావని తెలిసి దాచడం మొదలుపెట్టా. ప్రతీ వారం 4, 5 లీటర్ల పాలని పంపింగ్ చేసి బ్యాంకులకు పంపేదాన్ని. కానీ అవేమూలకీ సరిపోవని అక్కడ అమ్మపాల కోసం ఆరాటపడుతున్న వందల మంది నవజాత శిశువుల్ని చూశాకే అర్థమైంది.
బిడ్డతో ప్రయాణాలు
నా స్నేహితులు, బంధువుల సాయంతో తల్లి పాలను సేకరించడం మొదలుపెట్టా. ప్రతీవారం 300కి.మీ దాకా తిరిగి.. పాలని ప్రత్యేక బాక్సుల్లో తెచ్చేదాన్ని. అప్పుడు మాపాప వయసు 5నెలలు. ఇలా రెండేళ్లు చేశా. పాల సేకరణ, సరఫరా చట్టబద్ధంగా ఉండాలంటే ఓ సంస్థను పెట్టాలని కొందరు సూచించారు. అలా ఉద్యోగం చేస్తూనే 2019లో ‘అమృతం బ్రెస్ట్‌మిల్క్’ స్వచ్ఛంద సంస్థను స్థాపించా. కోయంబత్తూరుతో పాటు మరో మూడు జిల్లాల్లో సేవలు మొదలుపెట్టా. చాలామంది ముందుకొచ్చారు. మెల్లగా వాలంటీర్లూ పెరిగారు. విద్యార్థులు, ఉద్యోగినులూ సేవలందించేందుకు సిద్ధమయ్యారు. ఆసక్తి ఉన్న తల్లులకు.. తల్లిపాలని ఫ్రిజ్‌లో శాస్త్రీయంగా ఎలా భద్రపరచాలో అవగాహన కల్పించాం. ఈ అమ్మపాల దానం గురించి ఆనోటా ఈనోటా అందరికీ తెలిసింది. సోషల్ మీడియానూ వేదికగా మార్చుకున్నా. దాంతో తమిళనాడు వ్యాప్తంగా మా సేవల గురించి ప్రచారమైంది. ఎందరో తల్లులు మంచి మనసుతో దాతలుగా ముందుకొచ్చారు. ఇప్పుడు మా సంస్థలో 6 వేల మంది కొత్త తల్లులు ప్రతీ నెలా పాలని భద్రపరిచి వాలంటీర్లకు అందిస్తున్నారు. తమిళనాడులోని 38 జిల్లాల్లో మా వాలంటీర్లు, 48 వాట్సాప్ గ్రూపుల్లో సభ్యులుగా ఉన్నారు. వారిచ్చే పాలను 28 ప్రభుత్వ తల్లిపాల బ్యాంకులకు అందిస్తున్నాం. అక్కడ వాటిని ల్యాబ్‌లో క్షుణ్ణంగా పరీక్షించాకే నవజాత శిశువులకు ఇస్తారు.
పిల్లలందరినీ కాపాడొచ్చు..
ప్రస్తుతం మా సంస్థలోని ప్రతి తల్లీ నెలనెలా 200 నుంచి 400మి.లీ పాలని దానంగా ఇస్తోంది. అలా 2021లో 1,114లీటర్లు, 2022లో 2,147 లీటర్ల పాలను ఇచ్చారు. నవజాత శిశువుల అవసరాల కోసం 24 గంటలూ ఈ కార్యక్రమాలపై దృష్టి పెట్టాలి... ఓ పక్క మా పాప బాగోగులూ చూడాలి. అందుకే గతేడాది ఉద్యోగానికి రాజీనామా చేశా. మావారు అండగా లేకపోతే ఇదంతా సాధ్యమయ్యేది కాదు. కొంత మంది నిపుణులూ మాతో కలిసి పనిచేస్తున్నారు. వీళ్లు తల్లుల సందేహాలకు శాస్త్రీయంగా అవగాహన కలిగిస్తుంటారు.
రికార్డు దాతలు...
‘హైపర్ లాక్టేషన్’ అంటే ఎక్కువ పాలు రావడం. వీరికి అవగాహన కలిగిస్తున్నాం. దాంతో చాలామంది తమ పాలను దానం చేసి రికార్డులు బద్దలు కొడుతున్నారు. కోయంబత్తూరులోని కనియూరు గ్రామానికి చెందిన సింధు మౌనిక 42 లీటర్ల పాలని దానం చేసి పలు రికార్డ్స్‌లో స్థానం పొందింది. మరో అమ్మ శ్రీవిద్య ఏకంగా 106 లీటర్లని దానం చేసి ఆ రికార్డును బద్దలుకొట్టింది. వీరంతా మరెంతోమంది తల్లులు పాలను దానం చేయడానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అమ్మపాలు లేక ఏ పసిబిడ్డా తల్లడిల్లకూడదన్నది నా ఆశయం.
- హిదాయతుల్లాహ్.బి, చెన్నై
ఆహ్వానం
వసుంధర పేజీపై మీ అభిప్రాయాలు, సలహాలు, నిపుణులకు ప్రశ్నలు... ఇలా మాతో ఏది పంచుకోవాలన్నా 9154091911కు వాట్సప్, టెలిగ్రాంల ద్వారా పంపవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.