అందాలు ‘పండు’తున్నాయి!

అదొక మారుమూల పల్లె. అన్నీ వ్యవసాయ కుటుంబాలే. కానీ వాతావరణంలో మార్పు, చీడపీడల సమస్యలతో పంటలు కరవయ్యాయి. అరకొరగా పండినా.. ధర పలికేది కాదు. కుటుంబాన్ని పోషించడానికీ కష్టపడుతుండేవారు.

Published : 19 Apr 2023 00:32 IST

అదొక మారుమూల పల్లె. అన్నీ వ్యవసాయ కుటుంబాలే. కానీ వాతావరణంలో మార్పు, చీడపీడల సమస్యలతో పంటలు కరవయ్యాయి. అరకొరగా పండినా.. ధర పలికేది కాదు. కుటుంబాన్ని పోషించడానికీ కష్టపడుతుండేవారు. ఈ నేపథ్యంలో సీమ భర్తతో కలిసి చేసిన ఆలోచన ఎంతోమందికి ఉపాధినిస్తోంది. ఆ కథేంటో మనమూ తెలుసుకుందాం.

‘మాది కేరళలో పూచక్కల్‌ అనే కుగ్రామం. వ్యవసాయ కుటుంబం. కొన్నేళ్లుగా సాగు నష్టాలతోనే జీవితం సాగిపోతోంది. రకరకాల తెగుళ్లు.. వాతావరణ అనుకూలతా లేదు. పండిన పంటకి సరైన ధర పలికేది కాదు. చేతిలో పనిలేక, డబ్బొచ్చే మార్గం తెలీక జనం నానా అగచాట్లూ పడటం గమనించా. ఈ సమస్యకు పరిష్కారం వెతికితేనే... వారందరికీ చేయూతనివ్వొచ్చు అనిపించింది. అప్పుడు వచ్చిన ఆలోచనలే సబ్బుల తయారీ’ అని గుర్తుచేసుకుంటారు సీమ. ఆలోచన వచ్చిందే తడవు... సబ్బుల తయారీ గురించి ఓ చిన్నపాటి పరిశోధనే చేశారు. అవగాహన వచ్చాక దాచుకున్న డబ్బులన్నీ పోగేసి ఇంట్లోనే వీటి తయారీ మొదలుపెట్టారు. మొదట సన్నిహితులూ, స్నేహితులకు ఈ సబ్బులను ఇచ్చి వారితో వాడించారు. ఆపై దగ్గర్లోని సూపర్‌ మార్కెట్లకూ అందించారు.. ఈ సహజ ఉత్పత్తులకు మంచి ఆదరణ లభించడంతో ఆర్డర్లూ వరుసకట్టాయి. ‘మా ప్రయోగం ఫలించి నాతో పాటూ... మా పొలంలో పనిచేసే వారి కుటుంబానికీ ఆలంబన దొరికింది. సబ్బుల తయారీకి అవసరమైన ముడిసరకు సేకరణ, అమ్మకాలతో వచ్చిన ఆదాయం చూశాక ఇది మరెందరికో ఉపాధి కల్పిస్తుందనే నమ్మకం కలిగింది. దాంతో ‘గ్రామ హోమ్‌ కేర్‌’ పేరుతో తయారీ విస్తృతం చేశాం’ అంటారామె. మావన్నీ సహజ వనరులతో కూడిన పర్యావరణహిత ఉత్పత్తులే కావడంతో ఆదరణ పెరిగింది. హెర్బల్‌ సోపులు, షాంపూలూ, ముల్తానీ మట్టి, స్క్రబ్స్‌ లాంటివే కాకుండా టవళ్లని నేయడమూ మొదలు పెట్టాం. రసాయనాలు వాడం, ప్యాకింగుకు కూడా రీసైకిల్‌ చేసిన కాగితాన్నే వాడతాం. కొబ్బరినూనె, ఎర్రచందనం, ఆముదం, కొబ్బరిపాలు, మేకపాలు, తేనె, అలోవెరా, పెసలు, పసుపు.. ఉపయోగిస్తాం. వీటితో చర్మం సురక్షితంగా ఉండటమే కాదు, నునుపు దేలుతుంది. అనారోగ్యాలు తలెత్తవు. నేలతల్లినీ కాలుష్యాలకు దూరంగా ఉంచినట్లవుతుంది.

శిక్షణ ఇప్పించి...

సౌందర్య ఉత్పత్తుల తయారీ కోసం గ్రామంలోని ఔత్సాహికులకు శిక్షణ ఇప్పించి... ఆ తర్వాతే వారికి పనులు అప్పగించడం మొదలు పెట్టారు. ‘తులసి, శీకాయ, మేకపాలు, పెసలు, దాల్చినచెక్క.. వంటి అనేక రకాల సబ్బులను తయారు చేస్తున్నాం. ప్రస్తుతం కంపెనీ టర్నోవర్‌ రూ.22 లక్షలు. ఎక్కువమందికి ఆసరా కల్పించాలన్న ఉద్దేశంతో నోట్‌బుక్‌ బ్యాంకులు, రీసైక్లింగ్‌ ప్రాజెక్టులు వంటివీ తీసుకుని గ్రామస్థులకు ఉపాధి కల్పిస్తున్నాం. ఈ పనుల వల్ల ఆదాయం పొందుతున్న వారిలో ఎక్కువమంది మహిళలే’ అంటారు సీమ. ఈ కార్యక్రమాల వల్ల ఎన్నో కుటుంబాల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడ్డాయి. పిల్లలు చదువుకుంటున్నారు. జీవనశైలి మారింది. ఇది మాత్రమే కాదు... సీమ నెలకొల్పిన ‘గ్రామ ఫార్మ్‌ స్టే’ టూరిజం ప్రాజెక్ట్‌కు తాజాగా కేరళ ప్రభుత్వ ఆమోదం లభించింది. పర్యటకులకు ఇంటి భోజనం, సైకిల్‌ రైడ్స్‌, కాలువ విహారాలు, పల్లెపట్టున నడక లాంటి సరదా కాలక్షేపాలు ఇందులో ఉన్నాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని