మంచి మసాలా లాంటి విజయం!

కుటుంబాన్ని పోషించుకోవడం కోసం రోడ్డువారన చిరు వ్యాపారాలు చేసిన నేపథ్యం ఆమెది. భవిష్యత్తులో కూడా రోడ్డువార వ్యాపారానికే పరిమితం కావాలను కోలేదామె! మరో అడుగు ముందుకేసింది.

Updated : 20 Apr 2023 07:56 IST

కుటుంబాన్ని పోషించుకోవడం కోసం రోడ్డువారన చిరు వ్యాపారాలు చేసిన నేపథ్యం ఆమెది. భవిష్యత్తులో కూడా రోడ్డువార వ్యాపారానికే పరిమితం కావాలను కోలేదామె! మరో అడుగు ముందుకేసింది. మసాలాల వ్యాపారంలో విజయం సాధించి 30 మందికి జీవనోపాధినీ, లక్షల టర్నోవర్‌నీ సొంతం చేసుకుంది కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటకు చెందిన వర్మని సుచరిత..

జాతర్లు, ఉత్సవాల సమయంలో రోడ్డు వారన చిన్నచిన్న దుకాణాలు పెట్టి వస్తువులు అమ్ముతుంటారు గమనించారా? సుచరిత కూడా మొదట్లో అలా జాతర్లలో కుంకుమ అమ్మి కుటుంబాన్ని నెట్టుకొచ్చేది. భర్త రమేశ్‌ ఓ ప్రైవేట్‌ కంపెనీలో ఎలక్ట్రీషియన్‌. చాలీచాలని ఆదాయం. ఇద్దరు ఆడపిల్లల్ని పెంచి పెద్దచేయాల్సిన బాధ్యత. ఇంతలో భర్త పనికోసం బెంగళూరు వెళ్లాల్సి వచ్చింది. మరో వైపు తనూ మేడారంలాంటి జాతర్లకి వెళ్లాల్సి వస్తే కొన్ని రోజులపాటు ఇంటికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి. ఇలాకాదు.. ఊళ్లోనే ఉండి సొంతంగా ఏదైనా చేద్దామనుకుంది. పెట్టుబడి కోసం ఎంతమందిని అడిగినా నిరాశే ఎదురయ్యింది. వీళ్ల ఆర్థిక పరిస్థితి చూసి రుణం ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాలేదు. భర్త నుంచి రూ.10 వేలు తీసుకుని.. దాంతోనే 2019లో మసాలాల విక్రయం ప్రారంభించింది సుచరిత. హైదరాబాద్‌, వరంగల్‌ నుంచి మసాలా దినుసులు తెచ్చి భర్త, కుమార్తెతో కలిసి వాటిని చిన్న ప్యాకెట్లలో నింపి కీర్తన అనే పేరుతో స్థానికంగా ఉన్న చిన్న దుకాణాల్లో అమ్మేది. వాటి నాణ్యత బాగుండటంతో కొద్దికాలానికే రోజుల్లోనే వీటికి డిమాండ్‌ పెరిగినా, ప్రారంభించిన కొద్దిరోజులకే కొవిడ్‌ దెబ్బ తాకింది.

రుణం దొరకడంతో..

సవాళ్లని తట్టుకుని ముందుకు సాగుతున్న సుచరిత పట్టుదలని గమనించిన మెప్మా అధికారులు రుణం ఇచ్చి ప్రోత్సహించారు. దీంతో మరో ఇద్దరు మహిళలకు మసాలా ప్యాకెట్ల తయారీలో శిక్షణ ఇచ్చి వ్యాపారాన్ని విస్తరించారామె. వ్యాపారం ఊపందుకోవడంతో బ్యాంకులో రూ.లక్ష రుణం తీసుకొని ప్యాకెట్ల రవాణాకు వ్యాన్‌ కొనుగోలు చేశారు. భర్త రమేశ్‌ కూడా ప్రైవేట్‌ ఉద్యోగాన్ని వదిలేసి.. సుచరిత వ్యాపారానికి అండగా నిలిచారు. మసాలా దినుసుల ప్యాకెట్లను వ్యాన్‌లో కరీంనగర్‌ ఉమ్మడి జిల్లా వరంగల్‌, పెద్దపల్లి, సిద్దిపేట, జయశంకర్‌ భూపాల పల్లి, జనగాం ప్రాంతాలకు తీసుకెళ్లి వ్యాపారులకు విక్రయించేవారు. వ్యాపారం పెరగడంతో నాణ్యత, ప్యాకింగ్‌పై మరింత దృష్టి పెట్టారు.

హుజూరాబాద్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో సుచరిత స్టాల్‌నీ.. ఉత్పత్తులని పరిశీలించిన ఉన్నతాధికారులు పీఎంఆర్‌వై కింద రూ.5 లక్షల రుణాన్ని మంజూరు చేశారు. దీంతో సుచరిత మరో అడుగు ముందుకేసి ప్యాకింగ్‌ యంత్రాలని కొనుగోలు చేశారు. జమ్మికుంట పరిసర ప్రాంతాలకు చెందిన 30 మంది మహిళలకు మసాలాల ప్యాకింగ్‌పై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. వీళ్లలో కొంతమంది తమ ఇంటి వద్దే తీరిక సమయాల్లో మసాలా ప్యాకింగ్‌ చేస్తూ డబ్బు సంపాదిస్తున్నారు. ‘కేరళ, హైదరాబాద్‌, వరంగల్‌ తదితర ప్రాంతాల నుంచి హోల్‌సేల్‌గా నాణ్యమైన  మసాలా దినుసులని తీసుకొచ్చి ఇక్కడ ప్యాకెట్లు తయారు చేస్తుంటాం. బగారా మసాలాలు, హోలీ, బతుకమ్మ పండుగలకు అవసరం అయిన రంగుల ప్యాకెట్లు కూడా తయారుచేసి విక్రయిస్తున్నాం. ఇలా స్వయం ఉపాధి పొందుతూ మరికొందరికి పని ఇవ్వడం ఎంతో సంతృప్తిగా ఉంది. ప్రభుత్వం చేయూతనిస్తే పరిశ్రమను విస్తరించి మరింత మంది మహిళలకు ఉపాధినివ్వాలని ఉంది’ అంటున్న సుచరిత ఏడాదికి రూ.40 లక్షల వ్యాపారం చేస్తున్నారు.  

- ఎ. సంపత్‌కుమార్‌, జమ్మికుంట

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని