పల్లెల్ని దిద్దిన అమ్మలు..
ఇంటిని దిద్దుకున్నట్టుగానే.. గ్రామాల్నీ తీర్చిదిద్దుకున్నారు. పట్టుదలతో వారి పల్లెల్ని ప్రగతి బాట పట్టిస్తున్నారు... గ్రామస్థుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు... పొరుగు గ్రామాల్లోనూ స్ఫూర్తిని రగిలిస్తున్న ఈ అతివల శ్రమ వృథా పోలేదు.
ఇంటిని దిద్దుకున్నట్టుగానే.. గ్రామాల్నీ తీర్చిదిద్దుకున్నారు. పట్టుదలతో వారి పల్లెల్ని ప్రగతి బాట పట్టిస్తున్నారు... గ్రామస్థుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు... పొరుగు గ్రామాల్లోనూ స్ఫూర్తిని రగిలిస్తున్న ఈ అతివల శ్రమ వృథా పోలేదు. జాతీయ స్థాయిలో తెలంగాణాకు 13 అవార్డులు వస్తే అందులో ఎనిమిదింటి విజేతలు మహిళలే...
మహిళలే సారథులు...
ఆడవాళ్లే తోటి ఆడవాళ్ల కష్టాలని అర్థం చేసుకుని ముందుకు నడిపించగలరనడానికి ఉదాహరణ సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ మండలంలోని ఏపూర్ గ్రామ పంచాయతీ. ఇక్కడ పాలకుల నుంచి అధికారుల వరకూ అందరూ మహిళలే. ‘మహిళా స్నేహపూర్వక పంచాయతీ అవార్డు’తోపాటు రూ.కోటి నగదునీ అందుకున్న ఆ గ్రామ సర్పంచి సానబోయిన రజిత. ఏడో తరగతే చదువుకున్నా... అభివృద్ధి సూత్రాలని బాగా ఆకళింపు చేసుకున్నారు. ‘మా గ్రామంలో ప్రతి మహిళా పొదుపు సంఘంలో సభ్యురాలే. పొదుపు మొత్తాన్ని కొందరు వ్యవసాయంలో పెట్టుబడిగా పెడితే... మరికొందరు డెయిరీ, కోళ్లఫారాలు, ఇటుక బట్టీలు, పిండి మిల్లులు, ఇంటర్‌నెట్, మినీ బ్యాంకు, పాల కేంద్రాలు ఏర్పాటు చేసుకున్నారు. తడి, పొడి చెత్తను వేరు చేసి, సేంద్రియ ఎరువు తయారు చేసి దాంతో ఆదాయం పొందుతున్నారు’ అంటూ తమ గ్రామాభివృద్ధి గురించి చెప్పుకొచ్చారామె..
అభివృద్ధి పాఠాలు...
తరగతి గదిలో పిల్లలపై పెట్టాలనుకున్న శ్రద్ధనే... ఊరివాళ్ల మీదా పెట్టారామె. వాళ్లతో అభివృద్ధి పాఠాలు దిద్దించి శభాష్ అనిపించుకోవడంతోపాటు, సామాజిక భద్రత ఉన్న పంచాయతీ సర్పంచ్‌గా ప్రశంసలు అందుకున్నారు మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలం కొనగట్‌పల్లికి చెందిన మానస. ‘నేను బీఏ, బీఈడీ చేశా. టీచరవ్వాలన్న నాకల.. నెరవేరేలోపే ఏకగ్రీవ సర్పంచ్‌గా ఎన్నికయ్యా. చిన్నారులు, గర్భిణిలు, బాలింతల పోషకాహారంపై దృష్టిపెట్టా. జీపీడీపీలో భాగంగా 2020- 21 ఆర్థిక సంవత్సరంలో సామాజిక సురక్షిత పంచాయతీ కోసం రూ.53 లక్షలు ఖర్చు చేశాం. ఇంకుడు గుంతలతో నీటి సంరక్షణ, పచ్చదనంపై ప్రధానంగా దృష్టి పెట్టా. అవే మా గ్రామానికి పురస్కారాన్ని అందించాయం’టున్నారు మానస.
ఆరోగ్యానికి పెద్దపీట...
పల్లెల్లో ఆరోగ్య స్పృహని రగిలించి వారికి భరోసాని కల్పించారు గౌతంపూర్ పంచాయతీ సర్పంచి పోడియం సుజాత. ‘నేను ఎంఏ బీఈడీ చదువుకున్నా. పంచాయతీలో నిత్యం పర్యటిస్తూ, ఎక్కడ సమస్య ఉన్నా అధికారులను, సిబ్బందిని అప్రమత్తం చేసి పరిష్కారానికి కృషి చేసేదాన్ని. కొవిడ్ సమయంలో పారిశుద్ధ్య, వైద్య సిబ్బంది సాయంతో కట్టడికి చర్యలు తీసుకొన్నాం. మావద్ద రెండు ఆరోగ్య ఉపకేంద్రాలు ఉండటంతో మాతా, శిశు మరణాలు లేకుండా వైద్య సేవలను కల్పించాం. మాప్రాంతంలో చెత్త నుంచి ఎరువును తయారు చేసే ప్రక్రియను మొదట ఐటీసీ వారు కల్పించారు. అన్ని పంచాయతీలకూ ఇక్కడే అవగాహన సమావేశాలు నిర్వహించారు. నిరంతర శ్రమ, సమష్టి కృషితోనే ‘ఆరోగ్య పంచాయతీ’ అవార్డు దక్కింది అని చెప్పుకొచ్చారు సుజాత.
ఊరిని మార్చిన మీనాక్షి...
ఆ ఊళ్లో ఎటు వెళ్లినా పచ్చదనమే. ఊరంతా డిజిటల్ పేమెంట్లు. శ్మశానవాటకా చూడముచ్చటగా ఉంటుంది. సౌర విద్యుత్తుతో పంచాయతీ కరెంటు బిల్లును ఆదా చేస్తున్నారు. ఇదంతా ఓ మారుమూల గ్రామం సాధించిన విజయం అంటే ఆశ్చర్యంగా ఉంటుంది. జాతీయ స్థాయిలో 4, రాష్ట్ర స్థాయిలో 3 పురస్కారాలు అందుకున్న ఈ గ్రామం ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలో ముఖరా(కె). గ్రామస్థులు మీనాక్షిని ఏకగ్రీవంగా సర్పంచిగా ఎన్నుకున్నప్పట్నుంచీ ఆ ఊరి రూపు రేఖలే మారిపోయాయి. వందశాతం మరుగుదొడ్లు, ఇంకుడు గుంతల నిర్మాణం, డంపింగ్‌యార్డు, హరితవనం, సేంద్రియ ఎరువుల తయారీతో గ్రామాన్ని అభివృద్ధి బాట పట్టించారు. చెత్తను సేంద్రియ ఎరువుగా మార్చి రెండేళ్లలో రూ.7 లక్షలు సంపాదించారు. ఆ డబ్బుతో సౌర యంత్రాలు కొని విద్యుత్తు బిల్లుల్ని ఆదా చేస్తున్నారు.
ప్లాస్టిక్‌ని నిషేధించి...
కుటుంబాల్లో చిచ్చుపెట్టే తాగుడు, పర్యావరణాన్ని నాశనం చేసే ప్లాస్టిక్ ఈ రెండిటిపైనా పోరాడి శభాష్ అనిపించుకున్నారు సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లి సర్పంచి మొండి భాగ్యలక్ష్మి. ఇంటర్ చదివిన భాగ్యలక్ష్మి 2019లో సర్పంచిగా ఎన్నికయ్యారు. ప్రభుత్వ సహకారంతో ప్రతి ఇంటికీ సౌర విద్యుత్తు సౌకర్యాన్ని కల్పించారు. మహిళల్లో చైతన్యాన్ని తీసుకువచ్చారు. దాంతో గ్రామంలో మద్యపాన, ప్లాస్టిక్ నిషేధం ఇప్పటికీ కొనసాగుతున్నాయి. వృథా నీరు ఇంకుడు గుంతల్లోకి వెళ్లే బాధ్యతనూ మహిళలే తీసుకున్నారు. గ్రామంలోని పదేళ్లలోపు ఆడపిల్లలందరినీ సుకన్య సమృద్ధి యోజన పథకంలో చేర్పించారు.
ఊరి బాగుకోసం..
ఓ సాధారణ మహిళారైతుని సర్పంచిగా ఎంచుకున్నారు జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం నెల్లుట్ల పంచాయతీ ప్రజలు. వాళ్ల నమ్మకాన్ని వమ్ము చేయకుండా నీటి సమృద్ధి విభాగంలో ప్రథమ స్థానంలో నిలిపి, కోటి రూపాయల నగదును పురస్కారాన్ని అందుకున్నారు చిట్ల స్వరూపారాణి. చదువుకున్నది ఎనిమిదో తరగతే. భర్త భూపాల్‌రెడ్డి సౌదీలో పదేళ్లు నీటి సరఫరా విభాగంలో ఫోర్‌మెన్‌గా పని చేసి తిరిగొచ్చారు. భర్తతో కలిసి ఆవిడ 50 ఎకరాలలో అన్ని రకాల పంటలూ సాగు చేసేవారు. అలా వ్యవసాయంపై పట్టు సాధించిన స్వరూప గ్రామంలోనూ నీటి వినియోగ కార్యక్రమాలు చేపట్టారు. ‘వృథా నీటిని మళ్లించి కుంటలు నింపాం. నాలుగు నీటి ట్యాంకులతో పైపులైన్లను అనుసంధానించాం. ఇంకుడు గుంతలు తవ్వించాం. నాలుగేళ్ల్లలో 11 ఎకరాల్లో 65 రకాలవి 65 వేల మొక్కలను నాటించాం. ఒకప్పుడు చెత్తా, చెదారం, కంపచెట్లు, పిచ్చిమొక్కల ప్రదేశం నేడు చిట్టడివిలా మారిందంటే అది ప్రజల సహకారంతోనే అంటారామె.
గ్రామీణ నేపథ్యమే నడిపించింది..
కేంద్రం అందించే నానాదీ దేశ్‌ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ వికాస్ పురస్కారానికి కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎంపికైంది. 9 విభాగాల్లో ప్రతిభ కనబరిచి రెండో స్థానంలో నిలిచి రూ.1.50 కోట్ల నగదు బహుమతి అందుకుంది. ఈ ఘనతంతా మండల పరిషత్ అధ్యక్షురాలు కేతిరెడ్డి వనితా దేవేందర్‌రెడ్డిదే. ‘మాది వ్యవసాయ కుటుంబం. చిన్నపనికి కూడా కార్యాలయాల చుట్టూ తిరగడం, వీధుల్లో ఎక్కడ చూసినా చెత్త వంటివి నన్ను రాజకీయాల్లోకి వచ్చేలా చేశాయి. అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో గ్రామాల్లో పచ్చదనాన్ని పెంచాం. మహిళా సంఘాలకు ఐకేపీ కేంద్రాల బాధ్యతలు అప్పగించి, చిన్న వ్యాపారాల కోసం రుణాలు అందించాం. పంచాయతీల్లో కంప్యూటర్లు, ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాం. పోలీసు శాఖ సహకారంతో షీ బృందాలతో మహిళల భద్రత, ఆత్మరక్షణపై అవగాహన కల్పించాం. ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తూ మందులూ అందజేస్తున్నాం’ అంటున్నారు వనిత.
- సహకారం: న్యూస్‌టుడే యంత్రాంగం
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.