చందమామ కల.. కళలను నిలబెడుతోంది
చందమామ కథలు వినడం ఏ చిన్నారికైనా సరదానే! ప్రియ విషయంలో మాత్రం కాస్త భిన్నం. వాటిని కాలక్షేపంలా వినలేదామె. స్ఫూర్తిగా తీసుకొని ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. ఆ స్ఫూర్తి ప్రయాణాన్ని మీరూ చదివేయండి.
చందమామ కథలు వినడం ఏ చిన్నారికైనా సరదానే! ప్రియ విషయంలో మాత్రం కాస్త భిన్నం. వాటిని కాలక్షేపంలా వినలేదామె. స్ఫూర్తిగా తీసుకొని ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. ఆ స్ఫూర్తి ప్రయాణాన్ని మీరూ చదివేయండి.
అమ్మ చెప్పే చందమామ కథలంటే ప్రియా రాథోడ్‌కి ప్రాణం. వాటిని వింటూ చంద్రుడిలా తనూ ఇతరులకు సాయపడాలి అని అనుకునేదట. ఈమెది రాజస్థాన్‌లోని కనోటా. ఓసారి రణతంబోర్‌లోని బంధువుల ఇంటికి వెళితే.. అక్కడ ఎంతోమంది వృథా వస్త్రాలతో బ్యాగులు, యాక్సెసరీలు తయారు చేయడం గమనించింది. పర్యావరణ హితానికి ప్రాధాన్యమిస్తూనే అందమైన ఉత్పత్తులు తయారు చేసే ఆలోచన ఆమెకెంతో నచ్చింది. పెద్దయ్యాక తనూ నేర్చుకోవాలనుకుంది. ఉద్యోగం కాదు.. సొంత వ్యాపారం ప్రియ లక్ష్యం. చీకటిలో వెలుగు నింపే చందమామ ఆమెకు స్ఫూర్తి. అలా తన వ్యాపారం ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపాలనుకునేది. డిగ్రీ అయ్యాక చాలా ఆలోచించింది. కనోటాలో ఎంతోమంది మహిళలు తాటియా, కాంతా, ప్యాచ్ వర్క్, హస్తకళాకృతులు చేయడం వంటివి గమనించింది. కానీ అందరూ కాలక్షేపంగా చేసేవారే! ఇలాగైతే కొన్నాళ్లకు ఈ కళలు అంతరించి పోతాయి కదా అనిపించిందామెకు. వీటిని అందరికీ అందుబాటులోకి తేవాలనుకొని 2018లో ‘చాంద్ ఫౌండేషన్’ ప్రారంభించింది.
ఆ పేరూ కలిసొచ్చేలా
‘అమ్మపేరు చాంద్ కన్వర్.. ప్రతి విషయంలో తన ప్రోత్సాహం ఎక్కువే. అందుకే నాకు స్ఫూర్తి చంద్రుడు, ఇంకా అమ్మ పేరు కలిసొచ్చేలా ‘చాంద్’ ప్రారంభించా. అప్పటికి నా వయసు 21.. వ్యాపారం కొత్త. పైగా ఎంతో నైపుణ్యం ఉన్నా.. ఈ మహిళలు గుమ్మం దాటి బయటికి రారు. వాళ్లను నాతో కలిసి పనిచేసేలా ఒప్పించడానికి చాలా కష్టపడ్డా. వాళ్ల దగ్గర కూర్చొని నచ్చజెప్పేదాన్ని. వాళ్ల కాళ్లమీద వాళ్లు ఎలా నిలబడొచ్చో వివరించేదాన్ని. అలా క్రమంగా మార్పు తీసుకొచ్చా. చేనేత, వృథా వస్త్రాలతో గృహాలంకరణ వస్తువులు, బ్యాగులు, బొమ్మలు, యాక్సెసరీలు వంటివాటిపై దృష్టిపెట్టా. ఇంటి నుంచే పనిచేసి ఇచ్చేలా ఏర్పాటు చేయడంతో చాలామంది ముందుకొచ్చారు. సలహా ఇవ్వాలంటే వాటిపై పట్టు కావాలిగా! అందుకే అన్నీ నేర్చుకున్నా. ఒకప్పుడు మాట్లాడటానికే సిగ్గు పడేవాళ్లు.. ఇప్పుడు ధైర్యంగా ఆలోచనలూ పంచుకుంటున్నారు’ అంటోంది 25 ఏళ్ల ప్రియ.
టెక్నాలజీపై ఆధారపడే యుగంలో సంప్రదాయ కళలను మర్చిపోకూడదన్నది ప్రియ భావన. అందుకే వీరికి సాయం చేస్తోంది. ఉత్పత్తులను సామాజిక మాధ్యమాలు, ఈ కామర్స్ వెబ్‌సైట్ల ద్వారా అమ్ముతోంది. తద్వారా వారికి ఉపాధి కల్పిస్తోంది. మరింత మంది గ్రామీణ మహిళలను తమ కాళ్ల మీద తాము నిలబడేలా చేయడమే తన కలంటున్న ప్రియ ఈ తరానికి ఆదర్శమే కదూ!
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.