ఆ అవకాశం ఎనిమిది సార్లొచ్చింది!

ఈమధ్య నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ‘కాలా’ సినిమాలోని ‘ఘోడే పే సవార్‌’ పాట కొద్దిరోజుల్లోనే కోట్ల వీక్షణలతో సంచలనంగా మారింది. రెట్రో థీమ్‌తో ఉన్న ఆ పాటకు అనుష్క శర్మ, మాధురీ దీక్షిత్‌ సహా ఎంతోమంది సెలబ్రిటీలు కాలు కదిపారు.

Updated : 23 Apr 2023 07:39 IST

ఈమధ్య నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ‘కాలా’ సినిమాలోని ‘ఘోడే పే సవార్‌’ పాట కొద్దిరోజుల్లోనే కోట్ల వీక్షణలతో సంచలనంగా మారింది. రెట్రో థీమ్‌తో ఉన్న ఆ పాటకు అనుష్క శర్మ, మాధురీ దీక్షిత్‌ సహా ఎంతోమంది సెలబ్రిటీలు కాలు కదిపారు. దాంతో అది పాడిన గాయని రాత్రికి రాత్రే స్టార్‌ అయ్యింది. ఆమెవరో కాదు.. మన తెలుగమ్మాయే! శిరీష భాగవతుల.. తనని వసుంధర పలకరించింది.

‘ఓటమి విజయానికి తొలిమెట్టు’ అందరూ చెప్పే మాటే! కానీ, నా జీవితంలో అది రెండుసార్లు నిరూపితమైంది. మాది విశాఖపట్నం. నాన్న బీఎస్‌ మూర్తి విశ్రాంత బ్యాంకు మేనేజర్‌, అమ్మ సుందరి. తాతయ్య కృష్ణారావు, కవి. చిన్నప్పట్నుంచీ పద్యాలు నేర్పించేవారు. వాటిని లయబద్ధంగా పాడుతోంటే ముచ్చటేసి అమ్మానాన్న సంగీత పాఠశాలలో చేర్పించారు. అలా మూడున్నరేళ్లకే నా సంగీత ప్రయాణం ప్రారంభమైంది. ఎనిమిదో తరగతి నుంచే ‘పాడుతా తీయగా’, ‘సరిగమప’, ‘సూపర్‌ సింగర్‌’ తదితర షోల్లో పాల్గొనడం మొదలు పెట్టా. ఇంజినీరింగ్‌లో చేరాకా సాధన కొనసాగించా. లెక్చరర్లు నా ఆసక్తిని గమనించి, ప్రత్యేక తరగతులు బోధించేవారు. బీటెక్‌ అవ్వగానే టీసీఎస్‌లో ఉద్యోగం... అదే సమయంలో లండన్‌లో మ్యూజికల్‌ కాన్సర్ట్‌ అవకాశం. ఏది ఎంచుకోవాలో అర్థమవ్వలేదు. చివరికి.. అయిదంకెల జీతం కాదని సంగీతానికే ఓటేశా.

చెన్నైలో గది అద్దెకు తీసుకొని చిన్న ఆల్బమ్స్‌కు పాడటం ప్రారంభించా. ఇంట్లో డబ్బులు అడిగేదాన్ని కాదు. పని చేస్తేనే, నెల గడిచే పరిస్థితి. దానికి కరోనా తోడైంది. ఏం చేయాలా అని ఆలోచిస్తోంటే తమిళ రియాలిటీ షోలో పాల్గొనే అవకాశం. తుది వరకూ నిలవలేకపోయానని నిరాశపడ్డా. కానీ, ఆ షోకు అతిథిగా వచ్చిన ఏఆర్‌ రెహమాన్‌కి నా గొంతు నచ్చి, ‘బిజిల్‌’ సినిమాలో పాడించారు. 2021లో ఇండియన్‌ ఐడల్‌-12 లోనూ గెలవలేకపోయా. అప్పుడూ మణిరత్నం సినిమా పొన్నియిన్‌ సెల్వన్‌-1లో ‘సై’తోపాటు, కోబ్రా చిత్రంలో ‘ఎలో ఏడు సుందర’ పాడే అవకాశం ఇచ్చింది. పీఎస్‌-2లోనూ ఒక పాట పాడా. గాయనీ గాయకులెవరైనా రెహమాన్‌తో ఒక్కసారైనా కలిసి పనిచేయాలని అనుకుంటారు. నాకు మాత్రం ఆ అవకాశం ఎనిమిదిసార్లు దక్కింది. మణిశర్మ, ఇళయరాజా వంటి వారితోనూ పనిచేశా. మూడేళ్లలో తెలుగు, తమిళ, మలయాళ, గుజరాతీ భాషల్లో 25 పాటలు పాడా. ప్రైవేట్‌ ఆల్బమ్స్‌, ఇండిపెండెంట్‌ సాంగ్స్‌ కోసం కూడా పని చేశా.

అలా హిందీ చిత్రసీమకు..

ఇంజినీరింగ్‌లో ఇద్దరు సీనియర్లు నా గాత్రం నచ్చి ఆల్బమ్‌ చేయించారు. వాళ్ల సిఫారసుతోనే ‘కాలా’ అవకాశం వచ్చింది. ముందు ఒక పాట పాడించారు. అది వాళ్లకు నచ్చుతుందో లేదోనని భయపడ్డా. ఇంతలో రికార్డింగ్‌ థియేటర్‌ నుంచి బయటికొచ్చిన దర్శకుడు ‘సినిమాలో మరో నాలుగు పాటలూ నువ్వే పాడాలి’ అనేసరికి ఒక్కసారిగా ఏడ్చేశా. అలా ఆ సినిమాలోని ఆరింటిలో అయిదు పాటలతోపాటు ప్రధాన పాత్రకు డబ్బింగ్‌ కూడా చెప్పా. ‘ఫెరో నా నజరియా’ పాట రికార్డింగ్‌ అయ్యాక చిత్రబృందం అంతా ఉద్విగ్నతకు లోనైంది. తర్వాత బాలీవుడ్‌ ప్రముఖుల నుంచి ప్రశంసలూ వచ్చాయి. అవి మరపురాని అనుభూతులే! కానీ ఒకప్పుడు వచ్చిన అవకాశాలు చేజారేవి. ఇంకా వరుస ఓటములు. ఒకానొక దశలో ‘నా గొంతు బాగోలేదేమో! నేనెందుకూ పనికిరాను. ఇక ఇంటికి వెళ్లిపోవడం నయ’మనీ అనుకున్నా. అయినా ఏదో ఆశతో ప్రయత్నాలు కొనసాగించా. ప్రతీ అవకాశాన్నీ అందుకున్నా. ఆ పట్టుదలే గుర్తింపును తెచ్చిపెట్టింది. ఇటీవల ఓటీటీ ప్లే నిర్వహించిన ఛేంజ్‌ మేకర్స్‌ కార్యక్రమంలో ఉత్తమ నేపథ్య గాయని పురస్కారం అందుకున్నా. ఇంకా ఇతర పురస్కారాలూ చాలా వచ్చాయి. తెలుగు ‘ఇండియన్‌ ఐడల్‌’కు మెంటార్‌గానూ వ్యవహరించా. ప్రస్తుతం ఓ పాన్‌ ఇండియా సినిమాతోపాటు ప్రైవేట్‌ ఆల్బమ్స్‌ చేస్తున్నా.

- తేరాల రంజిత్‌ కుమార్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్