బుజ్జాయిల దంత సమస్యలు తీర్చాలని...

చిన్నారుల దంత సమస్యలపై అనేక పరిశోధనలు చేశారావిడ... పిల్లలు నైపుణ్యాల్లో వెనకబడటానికి కారణాలను గుర్తించారు. తగిన పరిష్కారాలను అందిస్తూ దేశంలోనే తొలి ప్రివెంటివ్‌ పీడియాట్రిక్‌ డెంటిస్ట్‌గా నిలిచారు.

Published : 23 Apr 2023 00:28 IST

చిన్నారుల దంత సమస్యలపై అనేక పరిశోధనలు చేశారావిడ... పిల్లలు నైపుణ్యాల్లో వెనకబడటానికి కారణాలను గుర్తించారు. తగిన పరిష్కారాలను అందిస్తూ దేశంలోనే తొలి ప్రివెంటివ్‌ పీడియాట్రిక్‌ డెంటిస్ట్‌గా నిలిచారు. టంగ్‌ ఫౌండేషన్‌ ద్వారా ఎంతో సేవ చేస్తున్నారు. ఆ కృషికిగానూ అంతర్జాతీయ పురస్కారాన్నీ అందుకున్నారు. ఆమే డాక్టర్‌ షిఫా షంషుద్దీన్‌. ఆవిడ స్ఫూర్తి కథనం...

పిల్లలు సరిగ్గా నిద్రపోకపోతే వెంటనే దంత వైద్యనిపుణులను సంప్రదించాలంటారు డాక్టర్‌ షిఫా. తమిళనాడు కోయంబత్తూరుకు చెందిన ఈమెకి చిన్నతనంలోనే వైద్యం పట్ల ఆసక్తి. ముఖ్యంగా దంతవైద్యమంటే ఇష్టం. అందుకే మీనాక్షి అమ్మాళ్‌ వైద్యకళాశాలలో పిల్లల దంత వైద్యంలో ఎండీఎస్‌ చదివి, పదేళ్లు పలు ప్రముఖ ఆసుపత్రుల్లో పనిచేశారు. చిన్నారులను పరీక్షించేటప్పుడు దంతాల సమస్యలకు నాలుక, నోటిలోని కుహరంతోనూ సంబంధం ఉన్నట్లు గుర్తించారు. దీని మీద మరింత అధ్యయనం చేయాలని ఆస్ట్రేలియా వెళ్లారు. అక్కడి పరిశోధనాసంస్థలో ఏడాది పనిచేశారు.

కొత్త విషయాలు..

చిన్నారులకు పైకి కనిపించేవే అనారోగ్యాలు కాదు, అంతర్లీనంగా మరెన్నో కారణాలు దాగుంటాయంటారామె. ‘సామాజిక మాధ్యమాలు వేదికగా దంతాల అనారోగ్యం, నిద్రలేమి వంటివన్నీ వివరించడం మొదలుపెట్టా. దవడ జారి స్థానభ్రంశం కావడం, నాలుక కింది భాగంలో ఏర్పడే సమస్యల గురించి అవగాహన కలిగిస్తుంటాం. వీటివల్ల పిల్లలు ఎన్నో అనారోగ్యాలకు గురవుతారు. రాత్రంతా పిల్లల నోట్లో పాలసీసా లేదా పాలపీక ఉంటే శ్వాస తీసుకునేటప్పుడు తగినంత ఆక్సిజన్‌ అందదు. దీంతో మెదడు కణాలు విశ్రాంతి పొందలేవు. చిన్నారుల్లో నిస్సత్తువ ఆవరిస్తుంది. ఈ అలవాటు దీర్ఘకాలం కొనసాగితే తీవ్ర అనారోగ్యాలకు దారి తీస్తుంది. జీవన నైపుణ్యాలను నేర్చుకోవడంలో వెనకబడతారు. అందుకే నిద్రలేపి పాలు పట్టాలి. లేదా నిద్రకు ముందుగానే పాలు ఇవ్వాలి. అంతే కానీ పిల్లలకు నిద్రలో పాలు పట్టడం మంచిది కాదు. అలాగే తల్లిపాలు తాగడం వల్ల శిశువు అవయవాల ఎదుగుదల సక్రమంగా ఉంటుంది. తల్లిపాలు తాగే పిల్లల్లో వారి దవడ ‘యూ’ ఆకారంలో అభివృద్ధి చెందుతుంది. పాలు తాగే క్రమంలో నాలుక కదలడంతో దాని నిర్మాణం సక్రమంగా జరుగుతుంది’ అని వివరించారు షిఫా.

సంస్థను ప్రారంభించి..

ఎస్‌ఆర్‌ఎం విశ్వ విద్యాలయంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా నాలుగేళ్లు విధులు నిర్వహించారు షిఫా. 2012లో కోయంబత్తూరులో ‘వి లిటిల్‌’ ప్రారంభించారు. ‘నలుగురు వైద్యులతో అంతర్జాతీయ ప్రమాణాలు, నూతన సాంకేతికతలతో చికిత్సలు ప్రారంభించా. ఇప్పుడు 20మందికిపైగా నిపుణులతో కలిసి పని చేస్తున్నా. లండన్‌, అమెరికా వంటి దేశాల నుంచి వచ్చే చిన్నారుల దంత సమస్యలను పరిష్కరిస్తున్నా. దంత వైద్యంలోనూ సూపర్‌ స్పెషాలిటీ ఉంటుందనే అవగాహన మన దగ్గర పెద్దగా లేదు.

పిల్లలు ఆరోగ్యంగా ఉన్నప్పటికీ, నిద్రలేమికి గురవడానికి కారణం... శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దాని వల్ల స్లీప్‌- డిజార్డర్‌ తలెత్తుతుంది. దంత సమస్యలను పరిష్కరిస్తే ఇవన్నీ నయమవుతాయి’ అంటున్నారు. దేశంలోని అతికొద్ది మంది టంగ్‌ టై స్పెషలిస్టుల్లో షిఫా ఒకరు. ఆమె 2021లో అమెరికన్‌ బోర్డ్‌ ఆఫ్‌ డెంటల్‌ స్లీప్‌ మెడిసిన్‌లో మాస్టర్స్‌ చేశారు. తన కృషికి గుర్తింపుగా లండన్‌ రాయల్‌ కాలేజీ ఆఫ్‌ ఎడిన్‌బర్గ్‌ అందించే ‘ఇంటర్నేషనల్‌ అవార్డు ఆఫ్‌ ఎక్సలెన్స్‌ (ఐఏఈ)’ అందుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్