ఓడిపోకూడదని ఎన్నో అవతారాలెత్తా!

ఉన్నచోటే ఉండిపోవాలనుకునే తత్వం కాదామెది. స్వతంత్రంగా ఎదగాలనుకున్నారు. అవాంతరాలూ, అడ్డంకులూ ఎన్ని ఎదురైనా.. ముందుకే సాగారు. అవసరాన్ని బట్టి.. వ్యాపారవేత్త, లాయరు, డ్రైవరుగా మారిపోయారు. పరిస్థితి ఏదైనా వెనుదిరగని ఆ తత్వమే ఆమెను విజేతగా నిలబెట్టింది. తనే సుధార్చన.. ఆ ప్రయాణం ఆమె మాటల్లోనే..!

Updated : 24 Apr 2023 07:40 IST

ఉన్నచోటే ఉండిపోవాలనుకునే తత్వం కాదామెది. స్వతంత్రంగా ఎదగాలనుకున్నారు. అవాంతరాలూ, అడ్డంకులూ ఎన్ని ఎదురైనా.. ముందుకే సాగారు. అవసరాన్ని బట్టి.. వ్యాపారవేత్త, లాయరు, డ్రైవరుగా మారిపోయారు. పరిస్థితి ఏదైనా వెనుదిరగని ఆ తత్వమే ఆమెను విజేతగా నిలబెట్టింది. తనే సుధార్చన.. ఆ ప్రయాణం ఆమె మాటల్లోనే..!

జీవితంలో నాకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలన్న ఆశ, అనుకున్న పని పూర్తి చేయడానికి ఎంతటి కష్టానికైనా వెనుకాడని తత్వమే నన్ను వ్యాపారవేత్తగా నిలబెట్టాయి. మాది విజయనగరం జిల్లా, కొత్తపాలెం. డిగ్రీ పూర్తవగానే పెళ్లయ్యింది. మావారు కోటి. మాకిద్దరు పిల్లలు.. ఇంజినీరింగ్‌ చేస్తున్నారు. జీవితం హాయిగా సాగిపోతున్నా... ఏదో అసంతృప్తి. ‘స్వయం కృషితో ఎదిగినవారికే జీవితం విలువ తెలుస్తుంద’ని నాన్న ఎప్పుడూ చెబుతుండేవారు. అదే నాకు సొంతంగా ఏదైనా చేయాలన్న కోరికను కలిగించింది. ఎన్నో మార్గాలు అన్వేషించా. దుస్తుల వ్యాపారం ఆకర్షించడంతో ఇంట్లోనే కుటుంబ సభ్యులు ఇచ్చిన రూ.50 వేల పెట్టుబడితో వ్యాపారం మొదలుపెట్టా. తక్కువ వ్యవధిలోనే గుర్తింపూ వచ్చినా.. ఎక్కడో, ఎవరో తయారు చేసిన వాటిని అమ్మడంలో నా ప్రత్యేకత ఏముంది అనిపించి ఆలోచనలో పడ్డా.

రెండో అడుగు..

ప్లాస్టిక్‌ వస్తువుల నిషేధం జోరుగా సాగుతోంది. ప్రత్యామ్నాయాలపై దృష్టిపెడితే భవిష్యత్తు బాగుంటుందని పేపరు ప్లేట్లను తయారు చేద్దామనుకున్నా. శిక్షణనీ తీసుకున్నా. సంస్థ ఏర్పాటుకి రెండెకరాల భూమిని కొని, రుణం తీసుకుని ఉత్పత్తి మొదలుపెట్టా. కొంతమంది మహిళలకు ఉపాధినీ కల్పించా. కానీ, దీంతో వీరందరికీ ఏడాదంతా పనులు చూపించడం అసాధ్యం. అందుకే మరో వ్యాపారాన్నీ చేయాలనుకున్నా. మా ప్రాంతం నుంచి ఏటా దేశవిదేశాలకు మామిడి కాయలూ, పండ్లూ ఎగుమతి అవుతాయి. వాటి ప్యాకింగ్‌కి అట్టపెట్టెలు దిల్లీ, విశాఖ వంటి చోట్లే దొరకడం గమనించా. స్థానికంగా తయారు చేస్తే గిరాకీతోపాటు రైతులకూ ఛార్జీలు కలిసొస్తాయని తయారీ ప్రారంభించా. చుట్టుపక్కల ప్రాంతాల రైతుల నుంచి పెద్ద ఎత్తున ఆర్డర్లు మొదలయ్యాయి. గత అప్పులన్నీ తీరడమే కాదు.. ఆదాయమూ మొదలైంది. ప్రస్తుతం రూ.కోటి వరకూ వ్యాపారం చేస్తున్నా. తాజాగా ఎంఎస్‌ఎంఈ యువ పారిశ్రామికవేత్త పురస్కారాన్ని అందుకోవడం మరచిపోలేని అనుభవం.

కష్టాలు ఎదురైనా..

ఇప్పుడంతా సవ్యంగా సాగుతోంది కానీ.. పరిశ్రమ ప్రారంభంలో ఇబ్బందులెన్నో! రూ.50 లక్షలతో మెషినరీ బుక్‌ చేస్తే... సంస్థ సకాలంలో యంత్రాలను ఇవ్వకపోగా ఏకంగా చేతులెత్తేసింది. దీంతో కోర్టును ఆశ్రయించాను. కొన్నాళ్లయ్యాక ‘కేసు గెలవలే’మంటూ నా తరఫు న్యాయవాది వెనకడుగు వేశారు. నావైపు న్యాయం ఉంది.. కచ్చితంగా గెలవగలననే ధైర్యం నాది. అందుకే నా కేసు నేనే వాదించుకుంటానని జడ్జి అనుమతి తీసుకున్నా. సాక్ష్యాధారాలను చూపించి కేసు గెలిచా. నా యంత్రాలు నేను దక్కించుకున్నా. అంతటితో అయిపోలేదు.. తీరా వాటిని బిగించాక నిపుణులు దొరకలేదు. శిక్షణ తీసుకొని నేనే మొదటి కార్మికురాలినయ్యా. తర్వాత ఇంకొందరికి నైపుణ్యాలు నేర్పి పని మొదలుపెట్టా. కాస్త గాడిలో పడ్డామనుకోగానే కరోనా! ఎక్కడి పనులక్కడే ఆగిపోయాయి. అయినా నిబ్బరం కోల్పోలేదు. దీన్నుంచీ గట్టెక్కడానికి కలెక్టర్‌ అనుమతితో తయారీ కొనసాగించా. కానీ సరకుని గమ్యస్థానానికి చేర్చేందుకు డ్రైవర్లు దొరకలేదు. ఈసారి డ్రైవర్‌ అవతారం ఎత్తా. ఐషర్‌, బొలేరో వాహనాలను నడుపుతూ పండ్ల పెట్టెలను గమ్యస్థానానికి చేర్చాను. ఎలాగైతేనేం నేననుకున్న మార్గంలో మొండిగా సాగుతూ మరో 20 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తుండటం గర్వంగా అనిపిస్తుంది. కష్టాలెదురయ్యాయని ప్రయాణం ఆపొద్దు. మరింత పట్టుదలతో సాగితే విజయం సాధ్యమే. అందుకు నేనే ఉదాహరణ.

-మాకినేని ప్రేమసాయి, విజయనగరం


ఆహ్వానం

వసుంధర పేజీపై మీ అభిప్రాయాలు, సలహాలు, నిపుణులకు ప్రశ్నలు... ఇలా మాతో ఏది పంచుకోవాలన్నా 9154091911కు వాట్సప్‌, టెలిగ్రాంల ద్వారా పంపవచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని