ముగ్గు.. జీవితాల్ని మారుస్తోంది
ఆమె ఓ డిజైనర్.. కెరియర్‌లో దూసుకెళుతున్నారు. అలాంటిది ఓ ప్రమాదం వల్ల మెదడుకీ చేతికీ అనుసంధానం తప్పింది. చేస్తున్న పనేంటో.. తన స్నేహితులెవరో మర్చిపోయారు. అలాంటి ఆమె జీవితాన్ని ముగ్గు తిరిగి గాడిలో పెట్టింది. ఆ స్ఫూర్తితో దాన్ని మరెందరికో పనికొచ్చేలా చేస్తున్నారావిడ.
ఆమె ఓ డిజైనర్.. కెరియర్‌లో దూసుకెళుతున్నారు. అలాంటిది ఓ ప్రమాదం వల్ల మెదడుకీ చేతికీ అనుసంధానం తప్పింది. చేస్తున్న పనేంటో.. తన స్నేహితులెవరో మర్చిపోయారు. అలాంటి ఆమె జీవితాన్ని ముగ్గు తిరిగి గాడిలో పెట్టింది. ఆ స్ఫూర్తితో దాన్ని మరెందరికో పనికొచ్చేలా చేస్తున్నారావిడ. అదెలాగో తెలుసుకోవాలంటే భార్గవి మణిని కలుసుకోవాలి.
భార్గవి.. ఇంటీరియర్ డిజైనింగ్ చదివారు. సింగపూర్, దుబాయ్‌ల్లో డిజైన్ సంస్థలు నెలకొల్పారు. దేశానికి తిరిగొచ్చి 2011లో చెన్నైలో ‘ఎడ్జ్ డిజైన్ హౌజ్’ (తర్వాత భార్గవి మణి అండ్ కన్సల్టెన్సీగా మార్చారు) ప్రారంభించారు. కమ్యూనికేషన్ డిజైన్, ఫొటోగ్రఫీ, యానిమేషన్.. ఇలా వివిధ అంశాల్లో సేవలందిస్తుందీ సంస్థ. కెరియర్ పరంగా రాణిస్తూ గుర్తింపూ సంపాదించుకున్నారు. 2018లో ప్రమాదంలో పదేళ్ల జ్ఞాపకాలు మర్చిపోయారామె. చుట్టూ ఉన్నవాళ్లు, కెరియర్.. అన్నీ మర్చిపోయారు. మెదడుకీ, చేతికీ అనుసంధానం తప్పి.. చేత్తో తినడం, నీళ్ల గ్లాసు పట్టుకోవడమూ కష్టమయ్యేది. తన జీవితమేంటో తనకే తెలియని స్థితిలో పడిపోయారామె. అప్పుడు వాళ్లమ్మ సలహా ఆమె జీవితాన్ని నిలబెట్టింది.
‘మాది చెన్నై. చిన్నప్పుడు రోజూ తెల్లవారుజామున లేచి కోలమ్ (ముగ్గు) వేసేదాన్ని. అదో సరదా జ్ఞాపకం. తర్వాత్తర్వాత చదువు, కెరియర్‌లో పడి మానేశా. అమ్మ ‘కోలమ్ ప్రయత్నించి చూడు. కనీసం ఓ వ్యాపకంగా అయినా పనికొస్తుంద’న్న సలహానిచ్చింది. మార్కెట్‌లో చాలా వెదికా ఏవైనా పుస్తకాలు కనిపిస్తాయేమోనని. అవేవీ నేర్చుకోవడానికీ, ప్రయత్నించడానికీ వీలుగా అనిపించలేదు. దీంతో అమ్మ సాయంతో మొదలుపెట్టా. ఒక్క గీత గీయడానికే రోజులు పట్టింది. అయినా పట్టు వదలకుండా ప్రయత్నించా. వారం రోజుల్లోనే చేతికి, కంటికీ సమన్వయం ప్రారంభమైంది. ఆ ఉత్సాహంతో రోజూ కొన్ని గంటలు ముగ్గు వేయడానికే కేటాయించేదాన్ని. ఇంటి ముందూ రోజుకో రకం వేయడం ప్రారంభించా. బాగున్న రోజు పాల అబ్బాయి నుంచి ఇంటి ముందు వాళ్ల వరకు అందరూ వచ్చి చెప్పేవారు. క్రమంగా జ్ఞాపకాలూ తిరిగిరావడం ప్రారంభించాయి. ఒక్కొక్కరూ గుర్తుకు రావడం మొదలైంది. నాకెంతో ఇష్టమైన కెమెరానీ, నా కెరియర్‌నీ మర్చిపోయా. కొన్నిరోజుల పాటు ఎవరినీ గుర్తించలేక గదికే పరిమితమయ్యా. తర్వాత అవన్నీ గుర్తొచ్చినప్పుడు ఆనందాన్ని మాటల్లో చెప్పలేను’ అంటారామె.
కోలమ్ (ముగ్గు) మానసిక చికిత్సకీ తోడ్పడుతోంది అని గుర్తించాక దాన్ని అందరికీ చేరువ చేయాలనుకున్నారామె. ఇన్‌స్టా, యూట్యూబ్ మాత్రమే కాదు.. ‘కోలమ్ పోడు’ పేరుతో వెబ్‌సైట్‌నీ ప్రారంభించారు. ఇన్‌స్టాగ్రామ్‌ని దాదాపు లక్షన్నర మంది అనుసరిస్తున్నారు. చుక్కల నుంచి మొత్తం గీయడం వరకూ నేర్చుకునేలా వాటిని తీర్చిదిద్దారు. ‘ముగ్గు ఫోకస్‌ను పెంచుతుంది. సృజనాత్మకతతోపాటు సమస్యా పరిష్కార నైపుణ్యాలనూ మెరుగుపరుస్తుంది. నలుగురినీ ఒక చోటికి చేర్చగలదు’ అనే ఆవిడ తన ఛానెళ్ల ద్వారా వేల మంది పిల్లలు, పెద్దవాళ్లకు సాయపడుతున్నారు కూడా. ‘సంప్రదాయ కళను సులువుగా నేర్చుకోగలుగుతున్నాం, మీ స్ఫూర్తితో మేమూ ప్రయత్నిస్తున్నాం, పిల్లలకీ నేర్పిస్తున్నాం.. ఏకాగ్రత పెరిగింది’ అంటూ కామెంట్లూ పెడుతుంటారు. ఇంటి ముందు సాధారణంగా వేసే ముగ్గు.. వేలమందికి మానసికంగా సాయపడటం గొప్ప విషయమే కదూ!
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.