కటిక పేదరికం నుంచి.. కేంద్ర మంత్రి ప్రశంసల దాకా
ఎనిమిదో తరగతి చదువుకుని, పద్నాలుగేళ్లకే పెళ్లి చేసుకున్న ఓ పేదింటి అమ్మాయి ఐ.ఎ.ఎస్‌లే అబ్బురపడేలా ఆర్థిక పాఠాలు చెబుతుంటే ఆశ్చర్యమేగా? జాతీయ స్థాయిలో పొదుపు సంఘాలని చైతన్యవంతం చేస్తూ తాజాగా కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి మన్ననలు పొందారు వరంగల్ వనిత ఉప్పునూతుల శోభారాణి.
ఎనిమిదో తరగతి చదువుకుని, పద్నాలుగేళ్లకే పెళ్లి చేసుకున్న ఓ పేదింటి అమ్మాయి ఐ.ఎ.ఎస్‌లే అబ్బురపడేలా ఆర్థిక పాఠాలు చెబుతుంటే ఆశ్చర్యమేగా? జాతీయ స్థాయిలో పొదుపు సంఘాలని చైతన్యవంతం చేస్తూ తాజాగా కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి మన్ననలు పొందారు వరంగల్ వనిత ఉప్పునూతుల శోభారాణి...
చిన్న మొత్తాలతో మహిళలు సాధిస్తున్న విజయాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశంలోని స్వయం సహాయక సంఘాల్లో 9 కోట్ల మంది మహిళలున్నారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా పొదుపు సంఘాల్లో ఈ ఏడాది చివరకు మరో కోటి మందిని చేర్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. మరి పొదుపు సంఘాల పనితీరు గురించి, వాటిలో మహిళలు సాధిస్తున్న విజయాల గురించి అద్భుతంగా చెబితేనే కదా కొత్తవారు ఆకర్షితులయ్యేది. అందుకే అయిదు రాష్ట్రాల్లో సంఘాల గురించి అద్భుతంగా చెప్పే మహిళలకు గూగుల్‌మీట్ ద్వారా పోటీలు నిర్వహించారు. అందులో మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన ఒకే ఒక్కరు ‘ఉప్పునూతుల శోభారాణి’. ఆమె సంఘాల గురించి చెప్పిన తీరుకు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి గిరిరాజ్ సింగ్ ఆశ్చర్యపోయారు. ‘మీ పేరు చిన్నదే కానీ చేసే పని గొప్పది’ అంటూ ఆయన ప్రసంగంలోనే శోభను కొనియాడారు. గతంలోనూ ట్రైనీ ఐఏఎస్‌లకు పొదుపు పాఠాలు చెప్పారామె. అయితే ఆ పాఠాలన్నీ.. తన అనుభవంలోంచే రావడం విశేషం.
బాల్య వివాహంతో....
ఎనిమిదో తరగతిలోనే చదువు మాన్పించి... 14 ఏళ్లకే పెళ్లి చేశారు అమ్మానాన్నలు. మహబూబాబాద్ జిల్లాలోని బొల్లెపల్లి గ్రామం ఆమె అత్తారిల్లు. భర్త వెంకన్న సైకిల్ దుకాణం నడిపేవారు. కటిక పేదరికంలో కనీసం తినడానికి తిండి కూడా లేని పరిస్థితులు. అయినా శోభ చదువుపై ఇష్టం వదులుకోలేదు. ఇంటి, వంట పని చేసి పదో తరగతి చదివేందుకు స్థానిక ప్రభుత్వ పాఠశాలకు వెళ్లేవారు. ఇక చదివినట్టే అంటూ తోటి విద్యార్థులు గేలి చేసినా శోభ కుంగిపోలేదు. కష్టపడి చదివి పదో తరగతి మొదటి శ్రేణిలో ఉత్తీర్ణత సాధించారు. బతుకుదెరువు కోసం వరంగల్ జిల్లా గీసుకొండ మండలం జాన్‌పాకకు వచ్చారు. అప్పుడప్పుడే స్వయం సహాయక సంఘాలు (ఎస్‌హెచ్‌జీ) బలోపేతం అవుతున్నాయి. శోభ సభ్యురాలుగా చేరి చిన్న మొత్తాల్లో పొదుపు చేయడం మొదలు పెట్టారు. హిందీ నేర్చుకొని రిసోర్స్ పర్సన్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. తన వాక్చాతుర్యానికి సానపెట్టుకుని 20 రాష్ట్రాల్లో వేల మంది మహిళలకు పొదుపు పాఠాలు నేర్పారు. శోభ మాట్లాడే తీరు చూసి అప్పటి ‘సెర్ప్’ అధికారులు ముస్సోరిలో శిక్షణ ఐఏఎస్‌లకు పొదుపు సంఘాల గురించి చెప్పే అవకాశాన్ని సైతం ఇచ్చారు. శోభ హిందీలో వివరించిన తీరు చూసి అనేక మంది ట్రైనీ ఐఏఎస్‌లు ప్రత్యేకంగా అభినందించారు. మరోపక్క కాకతీయ విశ్వవిద్యాలయంలో బీఏ పూర్తి చేశారు. తాను పనిచేస్తున్నది గ్రామీణాభివృద్ధి సంస్థలో కాబట్టి రెండేళ్ల క్రితం ఎం.ఎ. రూరల్ డెవలప్‌మెంట్లో పీజీ పూర్తి చేశారు. తన ఇద్దరబ్బాయిలను బీటెక్ చదివిస్తున్నారు. ‘సంధ్య అని.. తనకు తెలుగు తప్ప హిందీ రాదు. తనకి నెమ్మదిగా హిందీ నేర్పించా. ఇప్పుడు ఆమె సంఘంలో ఉత్సాహంగా పనిచేయడమే కాదు.. పుస్తకాలు, లెక్కలు చూడ్డం కూడా నేర్చుకొంది. బీటెక్ చదువుతోంది. ఉత్తర్‌ప్రదేశ్, బిహార్ లాంటి రాష్ట్రాల్లో పొదుపు గురించిన అవగాహన చాలా తక్కువ. శిక్షణ ఇద్దామని వెళ్తే ఆడవాళ్లు బయటకు కూడా వచ్చేవారు కాదు. మగవాళ్లు దురుసుగా ఉండేవారు. ఓపిక పట్టి కథలు చెబుతూ, ఆటపాటలతో వాళ్లని ఆకట్టుకుని ఆడవాళ్లకి పాఠాలు చెప్పేదాన్ని. మొదట్లో నన్ను రావద్దని వారించిన మగవాళ్లే తర్వాత ‘సారీ దీదీ’ అని చెప్పిన సందర్భాలు కోకొల్లలు. నేను శిక్షణ ఇచ్చిన వాళ్లలో ఎంతోమంది ప్రధాన మంత్రిని కలిసి ఆయన ప్రశంసలు పొందేవారు. అలాంటి వారంతా తిరిగి కాల్ చేసి ‘మీ వల్లే మాలో ఈ ఆత్మవిశ్వాసం’.. అంటే జీవితంలో ఇంతకన్నా సంతృప్తి ఉంటుందా?’ అనుకొనేదాన్ని’ అంటారు శోభ.
గుండు పాండురంగశర్మ, వరంగల్
ఆహ్వానం
వసుంధర పేజీపై మీ అభిప్రాయాలు, సలహాలు, నిపుణులకు ప్రశ్నలు... ఇలా మాతో ఏది పంచుకోవాలన్నా 9154091911కు వాట్సప్, టెలిగ్రాంల ద్వారా పంపవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.